తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు నందమూరి వారసురాలిపై ఫోకస్ పెట్టాయా? కుటుంబ పార్టీని వీడబోతున్నారనే చర్చలో వాస్తవమెంత? ఏ పార్టీ ఆమెతో టచ్‌లో ఉంది? ఇప్పుడెందుకు ఈ ప్రచారం జరుగుతోంది?
గత ఎన్నికల్లో కూకట్‌పల్లిలో పోటీ.. ఓటమి
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ జట్టుకట్టి పోరాటం చేశాయి. అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఒంటరిగానే బరిలో దిగింది. అప్పుడే టీడీపీలోకి వచ్చిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. ఆ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు సుహాసిని. ఆ సీటులో గులాబీ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు మళ్లీ గెలిచారు. ఆ ఎన్నికల్లో ఓడినా సుహాసిని టీడీపీ కార్యక్రమాల్లో కొన్నాళ్లు యాక్టివ్‌గానే పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఆమె ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సుహాసిని టీడీపీ నుంచి పోటీ చేస్తారా? లేక ఇంకేదైనా రాజకీయ మార్పులు ఉంటాయా అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ మొదలైంది.
టీడీపీ నుంచే పోటీ చేస్తారని కొందరి వాదన
టీడీపీ నందమూరి-నారా కుటుంబ పార్టీ. ఆ కుటుంబం నుంచి వచ్చిన సుహాసిని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తారనేది తెలుగు తమ్ముళ్ల వాదన. అయితే అదే తెలుగుదేశం పార్టీ శిబిరంలో మరో వాదన వినిపిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి కాకుండా వేరే నియెజకవర్గంపై నజర్ పెడతారా అనే చర్చ కూడా ఉంది. వివిధ కారణాలతో తెలంగాణ టీడీపీలో సుహాసిని యాక్టివ్‌గా లేరని ప్రచారం జరుగుతోంది. దాంతో నందమూరి తనయ రాజకీయ అడుగులు ప్రస్తుతం చర్చల్లోకి వస్తున్నాయి.
సుహాసినితో టచ్‌లోకి వెళ్లిన ఓ పార్టీ?
సుహాసినితో ఇప్పటికే ఒక రాజకీయ పార్టీ సంప్రదింపులు మొదలు పెట్టినట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. కమ్మ సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్న ఆ పార్టీ.. సుహాసినితో టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం కూడా పలికారట. కండువా మారిస్తే తమ శిబిరంలో రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండబోదని చెప్పినట్టు సమాచారం. అయితే ఆ ఆఫర్‌కు సుహాసిని బదులివ్వలేదని తెలుస్తోంది. ప్రతిపాదనలు పెట్టిన పార్టీ సైతం సుహాసిని రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తోందట. తెలంగాణలో టీడీపీ పరిస్థితిని చూసి.. తప్పకుండా మెరుగైన రాజకీయ భవిష్యత్ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నారట.
సుహాసినితో టచ్‌లో ఉన్న ఆ పార్టీ ఏంటి?
నందమూరి సుహాసినితో సంప్రదింపులు జరిపిన పార్టీ ఏంటి? అధికారపార్టీ నుంచి అయితే ఎవరు ఆమెతో మాట్లాడారు? ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆహ్వానాలు వెళ్లి ఉంటే .. సమీకరణాలు ఎలా ఉంటాయి? కమ్మ సామాజికవర్గం ఓట్లను గురిపెట్టిన పార్టీ ఏంటని ఆరా తీస్తున్నారట. మరి.. సుహాసిని విషయంలో జరుగుతున్న ఈ ప్రచారం వాస్తవమో కాదో కాలమే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఏదైనా జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.