పాత నియోజకవర్గంపై మోజు పుట్టిందో ఏమో.. కొడుకుని తెరపైకి తెచ్చి పావులు కదుపుతున్నారు MLA మైనంపల్లి హన్మంతరావు. అక్కడా నేనే.. ఇక్కడా నేనే అని కొత్త రాగం అందుకున్నారట. అసెంబ్లీ ఎన్నికల వేళ గ్రౌండ్‌వర్క్ కూడా మొదలు పెట్టడంతో.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మారుతోంది.
గతంలో రామాయంపేట, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు
మైనంపల్లి హన్మంతరావు.. ప్రస్తుతం మల్కాజ్‌గిరి గులాబీ పార్టీ ఎమ్మెల్యే. గతంలో ఆయన రామాయంపేట, మెదక్‌ల నుంచి TDP శాసనసభ్యుడిగా గెలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ సందర్భంలో MLC కూడా. అప్పటి ఉమ్మడి జిల్లా టీడీపీకి అధ్యక్షుడుగానూ ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మల్కాజ్‌గిరికి షిఫ్ట్ అయ్యారు మైనంపల్లి. 2018 ఎన్నికల్లో ఎట్టకేలకు మల్కాజ్‌గిరిలో పోటీ చేసి గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. మల్కాజ్‌గిరి నుంచి గెలిచిన తర్వాత ఆయన మెదక్ జిల్లాకు వెళ్లింది తక్కువే. అక్కడ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్న ఉదంతాలూ లేవు. అలాంటి మైనంపల్లి ఉన్నట్టుండి మెదక్ అసెంబ్లీ పరిధిలో హల్చల్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి తన చిన్నకొడుకు రోహిత్ పోటీ చేస్తారనే అర్ధం వచ్చేలా మైనంపల్లి చేస్తున్న కామెంట్స్‌తో అధికారపార్టీలో అలజడి మొదలైంది.
మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి
బీఆర్ఎస్‌లో మెదక్ సీటు ఖాళీగా లేదు. ఇక్కడ పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే అనే ధీమాతో ఉన్నారు పద్మ. గతంలో ఇక్కడ MLC సుభాష్‌రెడ్డికి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి పడేది కాదు. ఆధిపత్యపోరు పీక్స్‌కు వెళ్లింది. పార్టీ పెద్దలు వారించడంతో సుభాష్‌రెడ్డి సైలెంట్ అయ్యారనే టాక్ ఉంది. అప్పటి నుంచి మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్టు నడుస్తోంది. ఇప్పుడు సడెన్‌గా మైనంపల్లి హన్మంతరావు ఎంట్రీతో కొత్త రగడం కలకలం రేపుతోంది. మైనంపల్లి రోహిత్ ఇప్పటికే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరుతో మెదక్ అసెంబ్లీ పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన మెదక్‌లోనే రోహిత్ కోసం మైనంపల్లి ఎంచుకున్నట్టు సమాచారం. పైగా ఆయన సొంతూరు మెదక్ జిల్లాలోని కొరవిపల్లి గ్రామం. వీటికితోడు తనకుంటూ నియోజకవర్గంలో సొంత కేడర్ ఉందని.. వాళ్లంతా రోహిత్‌కు అండగా నిలుస్తాని లెక్కలేస్తున్నారట హన్మంతరావు.
మెదక్‌లో మైనంపల్లి సేవా కార్యక్రమాల జోరు..!
శివరాత్రికి ఏడుపాయల జాతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు రోహిత్‌తో కలిసి వచ్చిన మైనంపల్లి.. ఆ సమయంలోనే తన మనసులోని మాటను బయట పెట్టారు. వచ్చే ఎన్నికల్లో రోహిత్ మెదక్‌లో పోటీ చేస్తారా లేదా అన్నది పార్టీ నిర్ణయమని.. మెదక్‌లో మాత్రం సేవా కార్యక్రమాలు ఆపేది లేదని ఆయన తేల్చేశారు. కాకపోతే మైనంపల్లి మళ్లీ మెదక్ రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా చెప్పారాయన. అప్పటి నుంచి రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్‌లకే టికెట్ అని బీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టంగా చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీకి MLA పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌లో సన్నాహాలు చేసుకుంటున్నా.. మైనంపల్లి తన కుమారుడిని తెరపైకి తేవడంతో పార్టీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారట ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి. మరి.. ఎవరి మాట నెగ్గుతుందో.. మెదక్ బరిలో ఎవరు ఉంటారో.. కుమారుడి కోసం మైనంపల్లి ఏం చేస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.