టీడీపీ కంచుకోటలో పాగా వేసినా అక్కడ పట్టుకోసం నానాపాట్లు పడుతోంది వైసీపీ. సొంత పార్టీ నేతల మధ్యే కుమ్ములాటలు ఎక్కువై.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎమ్మెల్యే. ఆధిపత్యం కోసం కిందిస్థాయి నాయకులు చూపిస్తోన్న అత్యుత్సాహం అసలుకే ఎసరొచ్చేలా ఉందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే?
మూడున్నరేళ్లుగా గోపాలపురం వైసీపీలో కుంపట్లు
గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురంలో వైసీపీకి పట్టం కట్టారు ఓటర్లు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంతా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు తలారి వెంకట్రావు. ఈ గెలుపుతో అటు అధినేతను, ఇటు ఓటర్లను మెప్పించగలిగినా.. కేడర్‌లో ఉన్న కుమ్ములాటలు మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యేకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ రెండువర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. విపక్ష పార్టీలను వదిలేసి.. వీళ్లల్లో వీళ్లే కుంపట్లు రాజేసుకుంటున్నారు.
రెండువర్గాల మధ్య హోరాహోరీ పోరు
గతంలో గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత వర్గం ఆ రెండింటిలో ఒకటి. ఎమ్మెల్యే వర్గం మరోకటి. నియోజకవర్గంపై పట్టు కోసం వేస్తున్న ఎత్తుగడలతో రాజకీయం గందరగోళంగా తయారైంది. ఎమ్మెల్యేతో సఖ్యత లేనివాళ్లంతా.. తమ పనులను మంత్రికి చెప్పి చేయించుకుంటున్నారట. అదే సమయంలో ఎమ్మెల్యేకు అంత సీన్ లేదని ప్రచారం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో గోపాలపురం నుంచి వనిత పోటీ చేస్తారని ఊదరగొట్టేస్తున్నారట. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నానా పాట్లు పడుతున్నారు తలారి అనుచరులు.
స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు సహకరించడం లేదా?
గతంలో ఎమ్మెల్యే వర్గానికి, వనిత అనుచరులకు మధ్య జరిగిన ఆధిపత్యపోరు హత్యకు సైతం దారి తీసింది. జీకొత్తపల్లిలో పార్టీ నేత గంజి ప్రసాద్‌ను హత్య చేశారు. ఆ సమయంలో అక్కడి వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అంతా చూశారు. ఇలాంటి వాతావరణమే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కొనసాగుతోందట. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వర్గపోరు శ్రుతిమించుతోందట. కేవలం మంత్రి మెప్పు పొందేందుకు కొందరు స్థానిక నాయకులు గోపాలపురంలో ఏం జరుగుతున్నా.. ఆ విషయాలను వనిత వద్దకు తీసుకెళ్తున్నారనేది ఎమ్మెల్యే తలారి వాదన. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకుల నుంచి సహకారం అందడం లేదట. ఈ పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే టిడిపి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించింది. అదే ఫార్మూలలా వైసిపిలోనూ అమలవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. టిడిపి కంచుకోటలో ఇంకా పట్టు బిగించాలంటే నాయకులంతా కలిసి సాగాలనేది కేడర్ మాట. అధిష్ఠానం కూడా పదే పదే ఇదే చెబుతోంది. కానీ.. గ్రౌండ్ లెవల్లో పరిణామాలు మరోలా ఉన్నాయని… అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకునేలా నేతల తీరు ఉందని అనుకుంటున్నారట. త్వరలోనే గోపాలపురం వైసీపీకి అధిష్ఠానం చికిత్స చేస్తుందని చెవులు కొరుక్కుంటున్నారు.