ఆ మాజీ మంత్రికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి చోటు కనిపించడం లేదా? వర్గ రాజకీయాల కారణంగా ఇతర ముఖ్యనేతలతో విభేదాలు ప్రతిబంధకం అయ్యాయా? రెండున్నర దశాబ్దాల పొలిటికల్ కెరీర్లో సొంత నియోజకవర్గం లేకుండా పోయిన ఆ నాయకుడు ఎవరు? వ్యతిరేకత ఎదురు కావడానికి కారణాలేంటి?
గంటా టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారా?
మాజీ మంత్రి.. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు ఇంటా బయటా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సీటు కనిపించడం లేదట. వైసీపీలో చేరేందుకు సన్నిహితులతో చర్చలు జరిపినా.. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో.. ఇటీవల టీడీపీ హైకమాండ్‌తో భేటీ అయ్యారు గంటా. దీంతో గంటా రాజీపడ్డారని.. రాజకీయ భవిష్యత్ కోసం వెనక్కి తగ్గారనే ప్రచారం సాగింది. దీనివెనుక వ్యక్తిగత కారణాలు ఏమైనప్పటికీ తిరిగి టీడీపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధం అనే సంకేతాలు పంపించారు. మాజీ మంత్రి మరోసారి ఎన్నికల బరిలోకి దిగితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఆయన ప్రతి కదలిక చర్చకు కారణం అవుతోంది.
మూడున్నరేళ్లుగా టీడీపీ కీలక సమావేశాలకు గంటా డుమ్మా..!
గంటాకు హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడానికి వీల్లేదని పార్టీలోని బలమైన నాయకత్వం ఒత్తిడి పెంచుతోందట. వైసీపీ ఒత్తిళ్లను ఎదుర్కొని పార్టీని కాపాడుకోవడానికి, కార్యకర్తల కోసం తామంతా పోరాటాలు చేస్తే గంటా ఎక్కడికిపోయారనేది సీనియర్ల సూటి ప్రశ్నగా తెలుస్తోంది. గంటా సైతం అసెంబ్లీ సమావేశాలకు, పార్టీ ముఖ్య కార్యక్రమాలకు, కీలకమైన మీటింగులకు డుమ్మా కొడుతూ వచ్చారు. ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు టీడీపీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల విధానాన్ని టీడీపీ వ్యతిరేకించగా.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను స్వాగతించారు గంటా. విశాఖ ఉక్కు కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా పార్టీలో విస్త్రత చర్చకు కారణమైంది. ఇలా, ఒకదాని తర్వాత ఒకటిగా గంటా నిర్ణయాలు, ఆలోచనలు కలిసి టీడీపీ హైకమాండ్‌తో గ్యాప్‌నకు కారణం అయ్యాయి. ఈ తరుణంలో గంటా మరోసారి ముఖ్య నాయకత్వంతో భేటీ అవ్వడంతో ఆయన తిరిగి ఎన్నికల రాజకీయం ప్రారంభించారనే చర్చ జరుగుతోంది.
గతంలో చోడవరం, అనకాపల్లి, భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంటా
1996లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గంటా ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవులు అనుభవించారు. 2014 ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి చేరారు. రెండున్నర దశాబ్ధాల్లో ఆయన చోడవరం, అనకాపల్లి, భీమిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న గంటా.. వచ్చే ఎన్నికల్లో తిరిగి సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. ఈ విషయాన్ని ఒకటీ రెండు సందర్భాల్లో ఆయనే చెప్పేశారు కూడా. దీంతో గంటా ఏ స్ధానం నుంచి బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరం. ఆయన ఆలోచన అంతా భీమునిపట్టణం మీదే వుందని సన్నిహితుల సమాచారం. ఐతే, భీమిలిలో వున్న నాయకత్వాన్ని మార్చి గంటాకు అవకాశం ఇవ్వడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు వ్యతిరేకిస్తున్నారట. మూడున్నరేళ్లు పార్టీని సమన్వయం చేసిన నాయకుణ్ణి మాజీ మంత్రి కోసం మార్చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనేది అచ్చెన్న ఆలోచనగా చెబుతున్నారు. భీమిలి కాకపోతే గాజువాక, పెందుర్తి, చోడవరం, యలమంచిలి ఈవిధంగా అనేక స్ధానాల్లో గంటా పోటీపై ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే స్ధానిక నాయకులతో ఈ మాజీమంత్రి టచ్ లో వుంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో గంటా ఎంట్రీకి అయ్యన్న మోకాలడ్డు..?
సామాజికవర్గ బలం, ఎన్నికల నిర్వహణ లెక్కలు వేసుకుని గంటా ఎక్కడ అడుగుపెడతారో అనే టెన్షన్లో నాయకులు కనిపిస్తున్నారట. అలాగని, అనకాపల్లి జిల్లాలో గంటా ఎంట్రీ ఎంత వరకు సాధ్యం అవుతుందనే అనుమానాలు లేకపోలేదు. ఇక్కడ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు బలమైన నేతగా ముద్రపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఇచ్చి తీరాలని హైకమాండ్‌ను డిమాండ్ చేసేందుకు ఆయన వెనుకాడరు. ఇప్పటికే ఆ దిశగా అన్ని స్ధానాల్లోనూ మాజీ ఎమ్మెల్యేలను యాక్టివేట్ చేశారు అయ్యన్న. ఒకవైపు, అచ్చన్న, మరోవైపు అయ్యన్న మధ్య గంటా పోరాడి సీటు తెచ్చుకుంటారా అనేది ప్రశ్న.