కామ్రేడ్లు అంటే కమ్మ.. రెడ్డిలే అన్నది బయట వారి విమర్శ. కానీ ఇప్పుడు అదేపార్టీలో చర్చకు దారితీస్తోందా? కమ్యూనిస్ట్‌లకూ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఏపీ CPMలో తాజా రచ్చకు కులం కోణమే కారణమా? ఆ సామాజికవర్గానికి నిబంధనలూ వర్తించవా? ఏం జరుగుతోంది?
సీపీఎంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే గఫూర్ అలక..!
అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీలుగా చెప్పుకునే రాజకీయ పక్షాల్లో సీపీఎం కూడా ఒకటి. అలాంటిది సీపీఎం ఏపీ శాఖలో లుకలుకలు భారీగానే బట్టబయలవుతున్న పరిస్థితి. క్షేత్రస్థాయి నుంచి మొదలుకుని కొందరు అగ్రనేతల వరకు పార్టీని వీడి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారట. ఇంకొందరైతే పార్టీతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక.. సమస్యను భరిస్తూ సైలెంట్ అవుతున్నారట. తాజాగా సీపీఎంలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గఫూర్ అలిగారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యకలాపాలకు వీలైనంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇంతకీ సీపీఎం ఏపీ శాఖలో ఏం జరుగుతోంది?
వీఎస్‌ఆర్ రాష్ట్ర కార్యదర్శి అయినప్పటి నుంచీ పార్టీలో కలహాలు..!
పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను వి.శ్రీనివాసరావుకు అప్పజెప్పినప్పటి నుంచి సీపీఎంలో కలహాలు ప్రారంభమైనట్టు చెబుతున్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్నికే పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయట. కార్యదర్శి పదవి ఎన్నిక ప్రక్రియలో ఎవరూ ప్రచారం చేసుకోకూడదనేది సీపీఎంలో ఉన్న ప్రధాన నిబంధన. అప్పట్లో కార్యదర్శి పదవి కోసం వి.శ్రీనివాసరావుతోపాటు.. గఫూర్ కూడా రేసులో ఉన్నారు. వి.శ్రీనివాసరావు వర్గీయులుగా చెప్పుకొనే కార్యకర్తలు VSRకు అనుకూలంగా ప్రచారం చేశారనేది అభియోగం. దీనికి తగ్గట్టు పోలిట్‌బ్యూరోలోని కొందరు నేతలు పార్టీలో ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బయట ఎప్పటి నుంచో ఈ అంశంపై ఆ పార్టీపైన విమర్శలు ఉన్నాయి. దాన్ని పార్టీ కొట్టిపారేసింది. కానీ ఈసారి పార్టీలోనే ఇది చర్చగా మారింది. కార్యదర్శి ఎంపిక దగ్గర నుంచి పార్టీలో జరిగే అంతర్గత వ్యవహరాలు ఏకపక్షంగా జరగడానికి కులమే కారణం అట. దీనిపైన మిగిలిన వర్గాలు రుసరుసలాడుతున్నాయి. వారికైతే ఒకలా.. వేరేవారికైతే ఇంకోలా నిబంధనలు అన్నట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి.
గఫూర్ సీపీఎంను వీడి వెళ్లడానికి సిద్ధ పడ్డారా?
ఈ సమస్య చినికి చినికి గాలి వానగా మారి.. చివరికి గఫూర్ పార్టీని వీడి వెళ్లడానికి కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే పార్టీలోని వివిధ కమిటీలకు గఫూర్ రాజీనామ చేసి.. ఓ సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతున్నారనేది టాక్. అయితే పార్టీలో తన పదవులకు.. బాధ్యతలకు రాజీనామా చేశాననే అంశంపై అటు గఫూర్ కానీ.. ఇటు పార్టీ నాయకత్వం కానీ నోరు మెదపడం లేదు. జరుగుతున్న పరిణామాలతో సర్దుకుపోలేక.. పార్టీ మీద అనుబంధంతో వీడి వెళ్లలేక సాధారణ కామ్రేడ్‌గా కొనసాగాలని భావిస్తున్నారట గఫూర్. ఈ విషయంలో CPM జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి దృష్టికి వెళ్లడంతో గఫూర్‌తో మాట్లాడారట. నేను సెట్ చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో గఫూర్ ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారట.
గఫూర్‌తో టచ్‌లోకి వెళ్లిన వైసీపీ ముఖ్యులు..!
ఇదే సమయంలో కొందరు వైసీపీ ముఖ్యులు గఫూర్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. వైసీపీ బ్యాకెండ్ టీమ్ నిర్వహించిన సర్వేల్లో కర్నూలులో గఫూర్‌కు మంచి ఇమేజ్ ఉందని.. పార్టీలో చేర్చుకుంటే బాగుటుందనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఆ కారణంతోనే ఈ మాజీ ఎమ్మెల్యేతో అధికారపార్టీ ముఖ్యులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. వైసీపీలో చేర్చుకుని MLCని చేస్తామని ప్రతిపాదన పెట్టారట. ఆ ప్రతిపాదనను గఫూర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే CPMని వీడి వెళ్లకూడదనే భావనలో ఉన్న గఫూర్.. ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారో లేదో కాలమే చెప్పాలి.