ఏపీ సీపీఎంలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయా? పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రాజీనామా ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డు పడినా.. అసలు సమస్య కొలిక్కి వచ్చేదెప్పుడు? అన్నీ సర్దుకుంటాయి.. నిర్ణయాలు అమలు చేస్తామన్న CPM అగ్రనేతల మాటల వెనుక అర్థమేంటి? ఇంతకీ CPMలో ఎందుకీ జగడం?
రాఘవుల రాజీనామాను ఆమోదించని సీపీఎం
CPM పొలిట్‌బ్యూరో సభ్యుడు BV రాఘవులు రాజీనామా అంశం.. పార్టీలో టీకప్పులో తుఫానులా చల్లారిపోయింది. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశాల్లో రాఘవుల రాజీనామాను CPM ఆమోదించలేదు. ఆయన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతారని స్వయంగా CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. దీంతో పార్టీలో ఈ సమస్య కొలిక్కి వచ్చినట్టు వామపక్ష నాయకులు భావిస్తున్నా.. అసలు రాఘవులు వంటి నాయకులు తన పదవికి రాజీనామా చేసేంతగా పరిస్థితులు ఏమొచ్చాయి..? ఆయన రాజీనామాకు.. ఏపీ సీపీఎంలో పరిణామాలకు లింకేంటి? అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
వీఎస్‌ఆర్ ఏపీ సీపీఎం కార్యదర్శి కావడానికి రాఘవులు సాయపడ్డారా?
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో బీవీ రాఘవులు అంటే సీపీఎం.. CPM అంటే బీవీ రాఘవులు అనేంతగా పార్టీపై ముద్ర పడింది. అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు.. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ సీపీఎంలో మిగిలిన లీడర్ల కంటే రాజకీయ పక్షాల్లో రాఘవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ పగ్గాలు మాజీ ఎంపీ మధు చేతికి వెళ్లాయి. రాఘవులు కేంద్ర కమిటీలోకి వెళ్లారు. సీపీఎం అత్యున్నత నిర్ణాయక మండలైన పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ సీపీఎం కార్యదర్శిగా మధు ప్లేస్‌లో వి. శ్రీనివాసరావు వచ్చారు. కార్యదర్శి మార్పు సమయంలో తలెత్తిన విభేదాలు రాచపుండుగా మారి రాఘవులు ఇబ్బంది పడినట్టు టాక్. శ్రీనివాసరావు ఎన్నిక వ్యవహారాంలో రాఘవులు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని ఆరోపణలు వచ్చాయట. ఇదే పదవి ఆశించిన మాజీ ఎమ్మెల్యే MA గఫూర్ ఇటీవల పార్టీలోని తన పదవులకు రాజీనామా చేసి కలకలం రేపారు. కార్యదర్శి పదవి VSRకు దక్కడంలో రాఘవులు సహకరించారనేది గఫూర్ వర్గం అభియోగం.
రాఘవులు రాజీనామా ఎపిసోడ్‌తో ప్రచారంలోకి రకరకాల అంశాలు
సీతారాం ఏచూరి మాట్లాడటంతో గఫూర్ కాస్త శాంతించారని ప్రచారం జరిగింది. ఇంతలో పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాఘవులు రాజీనామా చేశారనే
సమాచారం బయటకు రావడం… దానికి ఏపీ సీపీఎంలో జరుగుతున్న వ్యవహారాలే కారణమని చర్చ జరగడంతో విజయవాడ నుంచి ఢిల్లీ వరకు పార్టీ శ్రేణులు.. నాయకులు అప్రమత్తం అయ్యారు. ఇంతలో రాఘవులు హయాంలో పార్టీ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పార్టీ ఇబ్బందుల్లో ఉందని తెలంగాణ శాఖ నుంచి కూడా ఫిర్యాదులు వెళ్లాయట. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో పొలిట్‌బ్యూరో సభ్యుడి జోక్యంపైనా రాఘువులు మనస్తాపం చెందారని ప్రచారం జరుగుతోంది. వీటిల్లో ఏది నిజమో ఏమో.. రాఘవులు రాజీనామా అంశం మాత్రం హైలైట్ అయ్యింది. కానీ.. CPM కేంద్ర నాయకత్వం రాఘవుల రాజీనామాను ఆమోదించలేదని స్వయంగా సీతారాం ఏచూరి వెల్లడించారు. ఇప్పుడు పార్టీ పెద్దల దగ్గర ఉన్న మరో టాస్క్.. ఏపీ CPMలో చెలరేగిన అలజడిని పరిష్కరించడం. అలిగిన నాయకులను ఎలా బుజ్జగిస్తారు? నేతల మధ్య తిరిగి సయోధ్య సాధ్యమా? కేంద్ర నాయకత్వం ప్రతిపాదించే రాజీకి అసంతృప్త నాయకులు అంగీకరిస్తారా అనేది ప్రశ్న.