వారంతా అధికారపార్టీలోని ప్రజాప్రతినిధులు. ఆయన ఎంపీ.. వాళ్లంతా ఎమ్మెల్యేలు. ఎంపీ కదలికలు అనుమానం కలిగించాయో ఏమో.. ఎమ్మెల్యేలు ఆయన్ను దూరం పెట్టేశారు. ఎంపీ కూడా అటు వెళ్లడం ఎందుకు అని కామ్ అయ్యారట. మంత్రులు వచ్చినప్పుడే తళుక్కుమంటున్నారట ఎంపీ. అదెక్కడో.. వాళ్లెవరో ఈ స్టోరీలో చూద్దాం.
ఎంపీ పాటిల్ తీరుపై ఎమ్మెల్యేల డౌట్
బీబీ పాటిల్. జహీరాబాద్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2014లో భారీ మెజార్టీతో గెలిచిన బీబీ పాటిల్… రెండోసారి మాత్రం చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అయ్యింది ఆయన పరిస్థితి. 6 వేల 2వందల 29 ఓట్ల తేడాతో గట్టెక్కారు. అప్పట్లో ఎమ్మెల్యేలతో పొసగకపోవడమే మెజారిటీ తగ్గడానికి కారణమన్న ప్రచారం నడిచింది. దానికితోడు పాటిల్ వ్యవహార శైలి ప్రశ్నలకు ఆస్కారం కల్పించింది. అయితే రోజులు గడిచాక ఎంపీకి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు మధ్య కొంత సఖ్యత కుదిరినా.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందట.
నియోజకవర్గాల్లో ఎంపీకి సొంత వర్గాలు?
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్‌లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్‌లో శాసనసభ్యుడు మాణిక్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో ఎంపీ పాటిల్‌కు పడటం లేదు. అంతా బీఆర్‌ఎస్ నాయకులే అయినా వాళ్లకు పొసగడం లేదు. ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ పరిధిలో నిర్వహించే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవడం లేదట. దీనికి కారణం కూడా ఉందంట. ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ప్రత్యేకంగా తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట. తన సామాజికవర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విషయం తెలిసి ఎంపీని దూరం పెడుతున్న ఎమ్మెల్యేలు?
అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా కొందరికి కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తున్నారట ఎంపీ. అది తెలిసి ఎమ్మెల్యేలు కయ్‌మంటున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ ఎమ్మెల్యేలు.. ఎంపీ పాటిల్‌ను దూరం పెడుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ నియోజకవర్గాలకు వచ్చినా తన పని తాను చేసుకుని అక్కడి నుంచి సైడైపోతున్నారట ఎంపీ. తన వద్దకు వచ్చిన నాయకులను, కార్యకర్తలను మాత్రమే కలుస్తున్నారట. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కామారెడ్డి జిల్లాకే ప్రాధాన్యం ఇస్తున్నారట.
మంత్రులు వస్తేనే కనిపిస్తున్న ఎంపీ పాటిల్?
మంత్రులు లేదా ఇతర ముఖ్యుల పర్యటన ఉన్నప్పుడు మాత్రమే సంగారెడ్డి జిల్లాలో కనిపిస్తున్నారట ఎంపీ పాటిల్. మొత్తానికి ఎంపికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని.. అది ప్రచారం కాదని గులాబీ శ్రేణులు ఓపెన్‌గా మాట్లాడేస్తున్నాయి. మరి ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.