తెలంగాణలో బీజేపీ అగ్రనేతల టూర్లు ఖరారు అవుతున్నాయి… రద్దు అవుతున్నాయి…ఎందుకు? గడిచిన ఏడాది కాలంగా ఇదే తంతు జరుగుతోంది? అంటే… కమలనాధులకు ముహూర్తబలం కలిసి రావడం లేదా? లేక మరేదైనా కారణం ఉందా? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో స్కెచ్‌లు వేస్తున్న కాషాయ పార్టీ పెద్దలు ముఖ్యమైన రాష్ట్రం విషయంలో ఎందుకిలా చేస్తున్నారు?
ఈ పరిస్థితుల్లో… ఈనెల 8 న మోడీ పర్యటన ఉంటుందా? లేదా?
తెలంగాణ బీజేపీకి అచ్చిరాని 2023 కేలండర్
2023 కేలండర్‌లో బీజేపీ అగ్రనేతలకు తెలంగాణ టూర్ షెడ్యూల్ కలిసి వస్తున్నట్టు లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలనుకుంటున్న కాషాయదళం.. అందుకు తగ్గట్టే ఈ ఏడాది మొదట్నుంచి అగ్రనేతల పర్యటనలు ఖరారు చేసుకుంది. కానీ… ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు అవుతుంది…. తర్వాత అది వాయిదానో, రద్దో అవుతుంది… ముగ్గురు అగ్రనేతలు మోడీ, నడ్డా, అమిత్ షా ల కార్యక్రమాల విషయంలో ఇలాగే జరిగింది.
జనవరి 7న రద్దయిన నడ్డా కార్యక్రమం
జేపీ నడ్డా.. జనవరి 7న అసెంబ్లీ బూత్ కమిటీ సమ్మేళనాలనుద్దేశించి వర్చువల్ గా మాట్లాడాల్సి ఉంది. సమన్వయ లోపంతో అయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు… పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన తెలంగాణకు రావాల్సి ఉన్నా రద్దు అయింది. చివరికి ఆ ప్రోగ్రామ్‌లో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇక ప్రధాని మోడీ జనవరి 19న తెలంగాణలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు అయింది. బీజేపీ నేతలు ఆ ఏర్పాట్ల పై దృష్టి పెట్టి… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ , పరేడ్ గ్రౌండ్ లను పరిశీలించి వచ్చారు… చివరికి ఆ ప్రోగ్రాం వాయిదా పడింది. వందే భారత్ రైలును మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న అయన వస్తారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగినా రాలేదు…
ఈనెల 8న ప్రధాని కార్యక్రమమైనా ఉంటుందా?
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చినా.. అధికారిక కార్యక్రమాలకే పరిమితం అయ్యారు తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరవలేదు. జనవరి 28 న అయన రాష్ట్రానికి వస్తున్నారని… పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారని పార్టీ నేతలు చెప్పినా … పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున అయన రాలేదు…తిరిగి ఫిబ్రవరిలో కార్యక్రమం ఉంటుందని చెప్పినా… అదీ జరగలేదు. చివరికి ఈ నెల 12 న సంగారెడ్డిలో మేధావుల సదస్సులో పాల్గొంటారని ఏర్పాట్లు చేసింది తెలంగాణ బీజేపీ. అది కూడా రద్దయింది.
ఇలా… పార్టీ అగ్రనేతలు ముగ్గురి టూర్లు ఖరారవుతున్నాయి. కేన్సిల్ అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చ ఇప్పుడు పార్టీలో తీవ్రంగా నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కేడర్ నారాజ్ అవుతారని అంటున్నారు రాష్ట్ర నాయకులు. అసలు 2023 కేలండర్ బొత్తిగా తమకు అచ్చి రాలేదంటున్నారు. ఎన్నికల సంవత్సరంలో ముహూర్తబలం ఇంత వీక్‌గా ఉంటే ఎలాగన్న ఆందోళన దిగువ స్థాయి నేతల్లో వ్యక్తం అవుతోంది. చివరికి ఈనెల 8న ప్రధాని మోడీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరి ఈ టూర్ అన్నా ఉంటుందో లేదానన్న అనుమానాలు కార్యకర్తల్ని వెంటాడుతున్నాయి. ఈసారి ప్రధాని పర్యటన గనుక రద్దయితే…ముహూర్త బలం కోసం పరిహారాలు చేయించాలన్న సెటైర్స్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.