బీజేపీ-జనసేన గ్యాప్ వచ్చిందనేది కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చ. దీనికి కారణం ఎవరు? సోము వీర్రాజే కారణమని ఆ మధ్య కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలకు దగ్గరగానే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయా? బీజేపీ విషయంలో సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సింది జనసేనాని చెప్పేశారా? ఇక ప్రకటనే మిగిలి ఉందా? ఇంతకీ నిప్పు పెట్టింది ఎవరు?
బీజేపీ-జనసేన మధ్య గ్యాప్‌నకు వీర్రాజే కారణమా?
బీజేపీ-జనసేన పార్టీలు ప్రస్తుతానికి మిత్రపక్షాలు. 2019 ఎన్నికల తర్వాత మరోసారి కలిసిన ఈ రెండు పార్టీలు.. కలిసి పూర్తిస్థాయిలో ఉద్యమాలు చేసిన సందర్భాలు లేవు. కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్న ఉదంతాలు కనిపించవు. పోనీ ఉమ్మడిగా అధికారపక్షాన్ని గురి పెట్టాయా అంటే.. లేదనే చెప్పాలి. ఏపీలో జనసేనతో పొత్తు ఉండాలని పవన్ కల్యాణ్ వెంటపడి.. ఒప్పించి.. బీజేపీ అధినాయకత్వాన్ని అంగీకరింప చేసుకున్న సోము వీర్రాజే.. రాన్రానూ జనసేనానితో గ్యాప్ పెరగడానికి కారణంగా మారారనే విమర్శ ఉంది. దీనికి దారితీసిన పరిణామాలేంటో కానీ.. ఏపీ బీజేపీ చీఫ్ మాత్రం టార్గెట్ అయ్యారు. ఒక్క వీర్రాజే కాదు.. బీజేపీ ఏపీ సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ నేత విష్ణువర్దన్‌రెడ్డి వాళ్లు కూడా కారణంగా చర్చ సాగుతోంది.
గతంలో ఆరోపణలు చేసిన కన్నా..!
బీజేపీని వీడే సమయంలోనూ.. అంతుకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఇవే ఆరోపణలు చేశారు. సరిగ్గా ఇవే అంశాలను తాజాగా మచిలీపట్నం సభలో ప్రస్తావించారు పవన్ కల్యాణ్. జాతీయస్థాయిలో బీజేపీ నాయకత్వం అమరావతి విషయంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నా.. దానికి లోకల్ నేతలు సహకరించడం లేదని పవన్ ఆక్షేపించారు. తాను అమరావతి కోసం లాంగ్ మార్చ్ చేపడదామని సిద్దమైతే.. దానికి స్థానిక బీజేపీ నేతలెవ్వరూ సహకరించలేదని చెప్పారు పవన్ కల్యాణ్. దీనివల్ల బీజేపీ-జనసేన కూటమి బలపడలేదని.. అదే జరిగి ఉంటే టీడీపీతో అవసరం లేకుండానే ఎన్నికలకు వెళ్లేవాళ్లం అనే కీలక కామెంట్స్ చేశారు జనసేనాని.
రెండు పార్టీల మధ్య కలిసి ఉద్యమాలు లేవు
ఇప్పుడు బీజేపీలోనూ ఇదే చర్చ జరుగుతోంది. బీజేపీ స్థానిక నాయకత్వం ముందు నుంచి జనసేనతో కో-ఆర్డినేట్ చేసుకుంటూ.. ఉద్యమాలు.. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారి అభిప్రాయం. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో టీడీపీ వైపు పవన్ కల్యాణ్ మొగ్గు చూపక తప్పని పరిస్థితులు వీర్రాజు అండ్ టీమ్ కల్పించిందనేది బీజేపీలో ఓ వర్గం వాదన. సోము వీర్రాజు, సునీల్ దేవధర్, జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డి వంటి నేతలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. కీలక సందర్భాలు.. అమరావతి వంటి అంశాల్లో జాతీయ పార్టీ ఆలోచనలకు విరుద్దంగా వెళ్లారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ బలోపేతం కాకుండా నిర్వీర్యం అయ్యిందనేది వారి అభిప్రాయం. పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడి ఉంటే తెలంగాణలో మాదిరే ఏపీలోనూ బీజేపీ బలపడేదని వాళ్లు చెబుతున్నారు. అందుకే జరగబోయే పరిణామలపై ప్రేక్షక పాత్ర పోషించడం తప్పితే ఏం చేయలేమని అనుకుంటున్నారట. మరి.. ఈ అంశాలపై ఢిల్లీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.