టీడీపీలో ప్రస్తుతం చర్చంతా ఆ లీడర్ గురించే. పార్టీ వ్యవహరాల్లో కీలకంగా ఉన్న ఆ నాయకుడి వల్లే.. ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్న చర్చ నడుస్తోందట. ఇది అనుకోకుండా జరుగుతోందా.. లేక కావాలని చేస్తున్నారా అనేది అంతు చిక్కడం లేదట. ఇంతకీ టీడీపీలో చర్చగా మారిన ఆ నేత ఎవరు? ఆయనేం చేస్తున్నారు?
విమర్శలకు కేంద్రంగా మారుతున్నారా?
అచ్చెన్నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో అచ్చెన్న పాత్ర లేకుండా ఏదీ జరగదనే భావన దాదాపుగా ఏర్పడింది. అయితే తక్కువ టైమ్‌లోనే కీలక పొజిషన్‌కు ఎలా చేరారో.. అంతేస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అచ్చెన్నాయుడు.
పాదయాత్రలో పోలీసులపై కామెంట్స్
గతంలో టీడీపీ గురించి ఓ లీడర్‌తో అచ్చెన్న కామెంట్ చేసింది మొదలు.. వివిధ సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీలకు.. సోషల్ మీడియాకు ఈజీగా దొరికిపోతున్నారనే చర్చ సాగుతోంది. ఒకటికి రెండు సందర్భాల్లో టీడీపీపై అచ్చెన్న చేసిన కామెంట్స్ పార్టీని ఇరుకున పెట్టాయి కూడా. తన పేరు లేకుండానే ప్రెస్‌నోట్ ఇచ్చేశారని అసెంబ్లీ కమిటీకి సమాధానం ఇచ్చారు. ఇటీవల పాదయాత్రలో పోలీసులను ఉద్దేశించిన వ్యాఖ్యలు.. ఒకటి రెండు సందర్భాల్లో అధికారంలోకి వచ్చినా అధినేతను నమ్మలేం అంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాజాగా పార్టీ నేత చేస్తున్న పాదయాత్రకు చిత్తూరు పట్టణంలో లభించిన ఆదరణపై టీడీపీలోనే చర్చ ఉంది. దాని మీద పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు పడింది టీడీపీ అధిష్ఠానం.
పాదయాత్రపై టెలికాన్ఫరెన్స్‌లో అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వైరల్
అచ్చెన్న కారణంగా చిత్తూరు వ్యవహారం కూడా బయటకు వచ్చిందని టీడీపీలో లేటెస్ట్ టాక్. ఏపీ టీడీపీ చీఫ్ హోదాలో ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాదయాత్ర ఫెయిల్యూర్ బాటలో ఉందన్న వైసీపీ విమర్శలకు మరింత బలం చేకూరేలా అచ్చెన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారనేది ఆ చర్చ సారాంశం. ఆ టెలీకాన్ఫరెన్స్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాదయాత్రలో పాల్గొంటున్న నేతతోపాటు పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందనే వాదన వినిపిస్తోందట. పార్టీ అధినాయకత్వం నిర్వహిస్తున్న టెలీకాన్ఫరెన్సులు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అచ్చెన్న టెలికాన్ఫరెన్స్ ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చిందనేది ప్రశ్న. ఇది బయట వ్యక్తుల పనా.. లేక ఇంటి దొంగల కుట్ర అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అచ్చెన్న వ్యవహార శైలి.. గతంలో బయటకొచ్చిన ఆయన ఆడియో.. వీడియో క్లిప్పులు.. ఆయన చేసిన కామెంట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో ప్రస్తావిస్తూ.. వాటికీ వీటికి ఏదైనా లింక్ ఉందా అని ప్రశ్నిస్తున్నారట.