Site icon NTV Telugu

Off The Record: కుప్పంలో వైసీపీ పరిస్థితి ఏంటి? మీసాలు మెలేసినోళ్లంతా ఇప్పుడు ఏంచేస్తున్నారు..?

Kuppam

Kuppam

Off The Record: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారాయన. అయితే… 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ…పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ… ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన పది నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నాలుగు మండలాల్లో ఎంపీపీలను, కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి ఇప్పుడు సీన్‌ పూర్తిగా రివర్స్‌ అవుతోందట. 2024 ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజారిటీని సాధించడం, సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో… ఇప్పుడు కుప్పంలో వైసీపీ అని చెప్పుకునేందుకు లీడర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు అజ్ఞాతంలోకి వెళితే, మరికొందరు పార్టీ కండువా మార్చేశారు. ఇంకొందరు కేసులతో జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Read Also: Off The Record: బీఆర్ఎస్ విషయంలో బీజేపీ గేమ్ ప్లాన్ మారిందా? సడన్ గా బీజేపీ ఈ రాగం ఎందుకు అందుకుంది..!

ఇప్పుడైతే… ఇలా ఉందిగానీ…. తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కుప్పంలో టీడీపీని ఖాళీ చేయడానికి పెద్ద స్కెచ్చే వేసింది వైసీపీ. ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారని, తాము సంచలన విజయం సాధించపోతున్నామంటూ ముందస్తు ప్రచారం మొదలుపెట్టేశారు. ఆ క్రమంలోనే నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలు కుప్పం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అప్పట్లో స్వయంగా జగన్ కుప్పం పర్యటనకు వచ్చి ఇన్ఛార్జ్‌ భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ కూడా ఇచ్చి వెళ్లిపోయారు. వై నాట్ 175 నినాదాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టడం, ఎన్నికలకు ముందు హంద్రీనీవా నీళ్ళ విడుదల పేరుతో నానా హంగామా చేయడం, 65 కోట్ల నిధుల ఇచ్చేశామని కుప్పంలో ఇన్నాళ్లు జరగని అద్భుతమేదో జరగబోతోందంటూ భారీ బిల్డప్పే ఇచ్చింది వైసీపీ. కట్‌ చేస్తే… ఎన్నికల్లో ఆ ఎత్తులన్నీ చిత్తయ్యాయి. వైసీపీ వ్యూహం బూమరాంగ్ అయి వరుసగా ఎనిమిదోసారి కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు నాయుడు. రకరకాల కేసులు దాడులతో ఒకప్పుడు కుప్పంలో టీడీపీ జెండా పట్టుకోవాలంటేనే భయపడేలా చేయాలనుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కానీ… ఇప్పుడు అదే తిరగబడి…. వైసీపీ జెండా పట్టుకునే వాళ్ళే కరవయ్యారన్నది లోకల్‌ వాయిస్‌.

Read Also: CM Chandrababu: రేపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

నాడు కొందరు వైసీపీ నాయకులు, మరి కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుతో నిజంగానే టీడీపీ కేడర్‌ భయపడిపోయిందట. ఎమ్మెల్సీ శ్రీకాంత్ వచ్చే వరకు కార్యకర్తలంతా అయోమయంలో ఉండి పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చని ఇప్పటికీ అంటారు స్థానిక టీడీపీ నాయకులు. అయితే… రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత… నాడు చంపుతాం, నరుకుతామని మాట్లాడిన వారంతా అడ్రస్‌ లేకుండా పోయారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గం మీద చంద్రబాబు స్పెషల్‌ ఫోకస్‌ పెంచడం, ఇక్కడే ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం, చంద్రబాబు భార్య భువనేశ్వరి తరచూ కుప్పం టూర్‌కు వస్తుండటంతో… ఇక్కడి టీడీపీ కేడర్‌ ఫుల్‌ రీ ఛార్జ్‌ అయిపోగా… చివరికి వైసీపీ జెండా పట్టుకునే వాళ్ళు కరవయ్యారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ముందు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌ వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత మండల స్థాయి నేతలు కూడా సైలంట్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేకులంటూ… ఇన్ఛార్జ్‌ భరత్ కొంతమందిని సస్పెండ్ చేశారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

తాజాగా జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ మరింత బలహీనపడింది. కొందరు నాయకులు రాజీనామాలు చేశారు, మరికొందర్ని పార్టీనే సస్పెండ్‌ చేసింది. చివరికి నియోజకవర్గంలో పార్టీకి కేరాఫ్‌ కూడా కరవైంది. దీని గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాయట స్థానిక రాజకీయ వర్గాలు. రాజకీయంగా ఇక్కడ చంద్రబాబును టార్గెట్‌ చేస్తే చేశారుగానీ….అది ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అన్న చర్చ జరుగుతోందట ఇక్కడ అడపా దడపా మిగిలిన పార్టీ కేడర్‌లో. ఆయన్ని నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, క్యాడర్‌ను ఇబ్బంది పెట్టడం లాంటివి వ్యతిరేక ప్రభావం చూపాయంటున్నారు. మరీ ముఖ్యంగా నాడు పెద్దిరెడ్డి అండతో రెచ్చిపోయిన నాయకులంతా ఇప్పుడు తాము వైసిపి రాజీనామా చేస్తున్నామని ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటేనే… కుప్పంలో పార్టీ పరిస్థితి ఏంటో అర్ధమవుతోందని అంటున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం నాడు కుప్పంలో వైసీపీ వాపును చూసి బలుపు అని భ్రమపడ్డారంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Exit mobile version