విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా డే.. లక్షల మందితో ప్రధాని యోగాసనాలు.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష..
‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు.. ‘జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని.. కనీసం రెండు కోట్లమందికి ఈ కార్యక్రమం చేరాలన్నారు.. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలిలని.. దీని కోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు సీఎం చంద్రబాబు… ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని. . దీని కోసం ప్రైవేటు వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. నెలరోజుల పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలన్నారు సీఎం.. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలని.. అదే విధంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు.. యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఐదు కేసులో వల్లభనేని వంశీ మోహన్‌కు.. బెయిల్, ముందస్తు బెయిల్‌లు ఉండగా.. ఇప్పుడు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వంశీకి బెయిల్ వచ్చేసింది.. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా.. వేరే కేసులో రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది.. కాగా, వల్లభనేని వంశీకి మరోసారి కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే.. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై కేసు నమోదైంది. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది.. వంశీ పై మొత్తం 8 కేసులు ఉండగా అందులో ఐదు కేసుల్లో ఇప్పటికే బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులోనూ ఈ రోజు బెయిల్ వచ్చింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసు, తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ.. కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యారు. ఇప్పటికే 93 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా కేసుల్లో బెయిల్ వచ్చే వరకు వల్లభనేని వంశీ జైల్లో ఉండక తప్పదన్నమాట..
శాంతి వచనాలు పని చేయవు.. పాకిస్తాన్‌లో ఇళ్లలోకి దూరెళ్లి కొడతాం..
పాకిస్తాన్ విషయంలో శాంతి వచనాలు పని చేయవు.. పాకిస్తాన్‌లో ఇళ్లలోకి దూరెళ్లి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు పవన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీతో త్రివిధ దళాలకు మద్దతు తెలిపింది కూటమి ప్రభుత్వం.. జాతీయ జెండాలు చేతబట్టి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తిరంగా యాత్రకు విజయవాడలో మద్దతు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు.. దేశ విభజన జరిగినప్పటి నుంచి ప్రశాంతత చూడలేదు.. అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని వెనక్కి నెట్టాలనే ప్రయత్నాలు చూశాం అన్నారు. కసబ్ లాంటి వారు 72 గంటలు ఎలాంటి దాడులు చేశారు తెలుసు.. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్, జామా మసీదు పేలుళ్లలో ఉగ్రవాదుల హస్తం ఉన్న ఘటనలు చూశామన్నారు పవన్ కల్యాణ్.. జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హర్యానాలలో మనకు ఉన్నంత ప్రశాంతత ఉండదు.. అనునిత్యం సైనికులు మనల్ని కాపాడుతున్నారు.. అందుకే సైనికులకు మన ఉన్నాం అనే ధైర్యం ఇవ్వాలన్నారు.. సెక్యులరిజం పేరిట సూడో సెక్యులరిస్టులు వ్యాఖ్యలు చేస్తే.. ఏ స్ధాయి వ్యక్తులైనా సమాధానం చెప్పాలన్నారు పవన్.. ఇక, మురళీ నాయక్ భారత్ మాతాకీ జై అని మాత్రమే చెప్పాడు.. అంటూ.. వీరజవాన్ మురళీనాయక్‌కు నివాళులర్పించారు.. సినిమాలు రావచ్చు. పోవచ్చు… బాలీవుట్, టాలీవుడ్ హీరోలు మాట్లాడటం లేదంటే.. వాళ్లు జస్ట్ ఎంటర్‌టైనర్స్ మాత్రమే అని వ్యాఖ్యానించారు.. సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలి.. ప్రధాని మోడీకి మద్దతుగా ఉంటామని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసశారు సిట్ అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు సిట్ అధికారులు.. మరోవైపు.. లిక్కర్ స్కామ్ కే సులో ఈ ఇద్దరి నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే.. లిక్కర్ స్కామ్ కేసులో మొత్తంగా ఏడుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ8 చాణక్య, ఏ30 దిలీప్, ఏ33 గోవిందప్ప బాలాజీని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. ఈ రోజు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.. మొదట డిస్టలరేస్ నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది సిట్.. ఇక, మూడు రోజులుగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారిస్తున్న సిట్.. మూడో రోజున ఇద్దరిని అరెస్టు చేస్తున్నట్టు వెల్లడించింది.. అయితే, లిక్కర్ స్కాం కేసును మొదట విచారించిన సీఐడీ.. తర్వాత సిట్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే..
మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతాం.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు.. విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు పవన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీతో త్రివిధ దళాలకు మద్దతు తెలిపింది కూటమి ప్రభుత్వం.. జాతీయ జెండాలు చేతబట్టి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ ర్యాలికి నాతో వచ్చారు.. 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్రకి ప్రజలే శ్రీకారం చుట్టారు.. ఇది ప్రజా ఉద్యమం.. ఉగ్రవాదంపై పోరాడిన సైనికులకు సెల్యూట్ అన్నారు.. జాతీయ జెండా చూడగానే అత్యంత ఉత్సాహం.. జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య కృష్ణాజిల్లాకి చెందిన వారే అని గుర్తుచేశారు చంద్రబాబు.. గుర్తింపు కలిగిన ఏకైక జెండా భారతీయ జెండా.. పెహల్గామ్ అనగానే మనం ఖబడ్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తాం.. ప్రధాని మోడీ ఆడబిడ్డల నుదుట తిలకం తీసేసిన ఉగ్రవాది ఉండకూడదని ఆపరేషన్ సిందూర్ చేపట్టారు.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది ఉగ్రవాదం.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అన్నారు.. జాతీయ జెండా కట్టుకుని మరణించిన అమరజీవి మురళీ నాయక్.. మురళీ నాయక్ అమర్ రహే.. అంటూ నినాదాలు చేశారు.. బోర్డర్‌లో మన సైనికులు పోరాడుతున్నారు.. మనం మద్దతిస్తున్నాం అన్నారు.. ప్రధాని మోడీ సంకల్పం ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడ దక్కున్నా అంతమొందించడం అని స్పష్టం చేశారు.. ప్రతీ ఒక్కరూ అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవ్వాలి.. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే నాయకుడు నరేంద్ర మోడీయే అన్నారు.. 2045 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా భారతదేశం అవుతుంది.. భారతదేశం నంబర్ 1 అవ్వాలంటే.. అందరం కలిసి పని చేయాలి.. జాతి పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.. ఆపరేషన్ సిందూర్ లాంటి కార్యక్రమాలు చాలా అవసరం.. ప్రపంచ ఉగ్రవాదులు అందరూ ఆపరేషన్ సిందూర్‌ను గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ కేసులో సంచలన విషయాలు..
హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు. ఫేక్ లొకేషన్ ను సదరు నిరుద్యోగులకు పంపించినట్లు గుర్తించారు. ఆ ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసిన టీంలో మాజీ ఐటీ ఉద్యోగులు, హెచ్ఆర్ లు ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. ప్రొఫెషనల్ గా ఐడీ కార్డ్స్, అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులకు ఇచ్చారు మోసగాళ్ళు.. నిజమేనని నమ్మి లక్షల రూపాయలు కట్టారని పోలీసులు తెలిపారు. అయితే, ఒక్కొకరి నుంచి సుమారు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 200 మంది వరకు బాధితులు ఉన్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు కాజేసి ఆ కేటుగాళ్లు బోర్డు తిప్పేసినట్లు పేర్కొన్నారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. కంపెనీ ఏర్పాటు చేసిన మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. బోర్డు తిప్పేసి ఇప్పటికే వేర్వేరు ప్రాంతాలకు ఆ మోసగాళ్లు పారిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తుంది..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సీపీఐ మండల మహాసభలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచశాంతికి శుభ పరిణామం అన్నారు. నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణి వైఖరితో కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం అన్నారు. ఇప్పటికే వందల మంది మావోయిస్టులను చంపడం రాజ్యాంగ విరుద్ధం.. అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.. వామపక్ష పార్టీలన్నీ ఖగర్ ఆపరేషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి.. నక్సలైట్లతో ప్రధాని మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలి అని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
పాక్‌ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఇప్పటికే, ఈ ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే, భారత్ వీటిన్నింటిని పట్టించుకోకుండా సింధు, దాని ఉపనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్‌లోని రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులైన రాటిల్, దుల్ హస్తి ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఉన్న అడ్డంకుల్ని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటల్ దల్లూ కిష్ట్వార్ జిల్లాలోని రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులపై పాకిస్తాన్ పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, ఈ ప్రాజెక్టులు ఇండస్ వాటర్ ట్రీటీకి అనుగుణంగా ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని భారత్ వాదించింది. అయితే, ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో పాకిస్తాన్ అభ్యంతరాలను పట్టించుకునే పరిస్థితి లేనే లేదు.
బలూచిస్తాన్ పరిణామాల నేపథ్యంలో.. పాక్‌లోని ఈ రెండు హిందూ ఆలయాలపై చర్చ..
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిణామాలు కీలకంగా మారాయి. చాలా ఏళ్లుగా ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు చేస్తున్న ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ ఇటీవల స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. తాము పాకిస్తానీలము కాదని, తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కోరింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. వరస దాడుల్లో వారిని హతమారుస్తున్నారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన హిందూ ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని ‘‘హింగ్లాజ్ మాతా’’ ఆలయంపై ఆసక్తి నెలకొంది. హిందూ మతంలోని 51 శక్తి పీఠాల్లో హింగ్లాజ్ శక్తిపీఠ్ కూడా ఒకటి. బలూచిస్తాన్ ప్రావిన్సులోని మారుమూల కొండల్లో ఈ ఆలయం నెలకొని ఉంది. సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని హిందువులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏడాదిలో మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ మూడు రోజులు ఆలయానికి హాజరైన వారి పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. భారత్-పాక్ విభజన ముందు ఈ ఆలయానికి ఉపఖండంలోని హిందువులు వెళ్లేవారు. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా హింగ్లాజ్ మాతని ‘‘నానీ మందిర్’’గా ఎంతో గౌరవంగా చూస్తారు.
బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్.. 5 వేల మందిని వెనక్కి పంపిన సౌదీ..
తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా అపకీర్తిని సొంతం చేసుకుంది. అయితే, తాజాగా సౌదీ అరేబియాలో పాక్ కు చెందిన 5,033 మంది బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా తిరిగి పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించేసింది. ఈ విషయాన్ని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించినట్లు డాన్ పత్రిక కథనంలో రాసుకొచ్చింది. ఇక, 2024 జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను ఇప్పటి వరకు 5,402కు చేరుతుంది. వీరిని సాగనంపిన వారిలో సౌదీ, ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ దేశాలు ఉన్నాయి. ఈ మొత్తంలో సింధి ప్రావిన్స్‌కు చెందినవారు సుమారు 2,795 మంది ఉండగా.. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1,437, కేపీ నుంచి 1,002, బలూచిస్థాన్ 125, పీవోకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారని తేలింది. ఏప్రిల్ 19న సియాల్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడుతూ.. దేశంలో బిచ్చగాళ్లు ఓ పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు. దీంతో ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ లో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు తేలింది.. వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్థానీ రూపాయిలు అని అతడే అందరి ముందు వెల్లడించారు. సియాల్ కోట్ నుంచి వారిని రెండుసార్లు పంపించగా.. మళ్లీ తిరిగి వచ్చారని అన్నాడు.
హిట్టర్ల సమరంలో గెలిచేదెవరు?
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగింది. పోటాపోటీగా తలపడిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బోణి కొట్టింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రజిత్ పాటిదార్ 34 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు ఆర్సీబీని ఢీకొట్టలేకపోయారు. డికాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. సునీల్ నరైన్ 44, కెప్టెన్ అజింక్య రహానే 56, అంగ్రీస్ రఘువంశీ 30 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఐపీఎల్ పునప్రారంభంలో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ 12 మ్యాచుల్లో 5 గెలిచి ఆరో స్థానానికి పరిమితమైంది. ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందంజలో ఉంది. మరో మ్యాచ్ గెలిచి దర్జాగా ప్లేఆప్స్ కి చేరుతుంది. కేకేఆర్ ప్లేఆప్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి.
ముంబైలోకి భారీ హిట్టర్.. రోహిత్ ప్లానేనా..?
ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఫారిన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అందుబాటులోకి వచ్చారు. ముంబై ఆటగాడు విల్ జాక్స్ లీగ్ మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో జాక్స్ ప్లేఆప్స్ కి ముందే ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్, బీసీసీఐ సడలించిన ఐపీఎల్ రిప్లేసెమెంట్ నిబంధనలను సరిగ్గా వాడుకుంది. విల్ జాక్స్ స్థానంలో భారీ హిట్టర్ ని బరిలోకి దించేందుకు రోహిత్ మాస్టర్ స్కెచ్ వేశాడు. దానికి కెప్టెన్ హార్దిక్ కూడా ఒకే చెప్పాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం 12 మ్యాచులకు ముందు ఒక ఆటగాడిని రీప్లేస్ చేసుకోవాలి. అయితే తాజాగా బీసీసీఐ రీప్లేస్మెంట్ నిబంధనలను సడలించడంతో ముంబైకి కలిసొచ్చింది. ముంబై ఇప్పటికే 12 మ్యాచులు ఆడేసింది. సో .. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే విల్ జాక్స్ స్థానంలో జానీ బెయిర్‌స్టో తాత్కాలికంగా ముంబై ఇండియన్స్‌లో చేరతాడు. ఇప్పటికే ముంబై జానీ బెయిర్‌స్టో చర్చలు జరిపింది. అయితే జానీ బెయిర్‌స్టో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి NOC పొందితేనే అతను ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం ముంబై ఇండియన్స్‌లో చేరడానికి వీలుంటుంది.
హనుమాన్ నిర్మాతతో వి.ఐ.ఆనంద్ మల్టీ స్టారర్
యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైలెంటుగా జరుగుతున్నాయి. నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. హనుమాన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన నిరంజన్ రెడ్డి, ఆ తర్వాత డార్లింగ్ సినిమా చేశాడు, కానీ అది విజయం సాధించలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు, అది కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. దానితో పాటు ఈ కొత్త సినిమాపై కూడా దృష్టి పెడుతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వారిని ఒప్పించే పనిలో ఉన్నారు. వారు ఒప్పుకున్న తర్వాత అధికారిక ప్రకటనతో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. వి.ఐ. ఆనంద్‌తో పాటు నిరంజన్ రెడ్డి కూడా తన పరిచయాలను ఉపయోగించి స్టార్ హీరోలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.
భైరవం ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
మోస్ట్ హైప్ ఉన్న రీసెంట్ మూవీల్లో భైరవం ఒకటి. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించారు. ఈ మూవీ మొదటి నుంచి మంచి అంచనాలు బాగానే పెంచుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి ఈ మూవీని మే 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్ ను ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ముగ్గురు హీరోలు, హీరోయిన్లతో పాటు కీలక పాత్రలు చేసిన వారంతా ఈవెంట్ కు వస్తున్నారు. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో వస్తోంది. ఇప్పటికే హీరోలు ఇంటర్వ్యూతో హైప్ ఇస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా ప్లాన్ చేస్తున్నారు. ఇక నుంచి వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఉంటాయంట.