Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ దూకుడు పెంచుతుంటే… ప్రతిపక్షం మాత్రం తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతోందట. అలా ఎందుకంటే… పార్టీలో గ్రూపు రాజకీయలేనన్నది కేడర్ సమాధానం. నేతలు తలో దిక్కులా ఉంటే….కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా అంత చురుగ్గా లేకపోయినా…. ఆయన కొడుకు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి యాక్టివ్ రోల్‌లో ఉన్నారు. బుట్టా రేణుకకు జగన్మోహన్‌కు తీవ్ర విబేధాలు ఉన్నాయట. ఇద్దరి మధ్య పంచాయతీని తెంచడానికి నేతలు చేసిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతున్నట్టు తెలుస్తోంది. నేతలు విబేధాలు వీడితేనే పార్టీ బలంగా తయారవుతుందని, మా వాళ్ళే బలహీన పరుస్తున్నారంటూ క్యాడర్ మొత్తుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు. బుట్టా రేణుక , ఎర్రకోట జగన్ వర్గాలు ప్రతీ సందర్భంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… అవకాశం కల్పిస్తామని జగన్‌కు హామీ ఇచ్చిందట వైసీపీ అధిష్టానం.
Read Also: Special Focus : పవన్ కళ్యాణ్ – బోండా ఉమా మధ్య ఘర్షణ వెనుక నిజం ఏంటి?
అయితే… అది జరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో… విభేదాలు పెరిగినట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, వైఎస్సార్ వర్ధంతి, చలో అదోని మెడికల్ కాలేజి వంటి కార్యక్రమాలన్నిటినీ ఎవరికి వారు వేర్వేరుగానే నిర్వహించారు. అటు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బుట్టా రేణుక సొంతంగా 8 మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణను ఈ కమిటీ సమన్వయం చేస్తోంది. ఇది జగన్‌మోహన్ వర్గానికి మింగుడు పడడం లేదట. అధిష్టానం ప్రమేయం లేకుండా బుట్టా రేణుక సొంత కమిటీని ఎలా వేస్తారన్నది ఆయన క్వశ్చన్. మరోవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయ నిరాకరణ చేస్తున్నారంటూ జగన్ వర్గంపై మండిపడుతున్నారు బుట్టా రేణుక. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో వైసీపీకి బలం ఉన్నా… సమన్వయం లేక గ్రూపులుగా విడిపోయి బలహీనపడ్డట్టు చెప్పుకుంటున్నారు. తాము అధికారపార్టీతో పోరాడుతున్నా… పార్టీపరంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు బుట్టా వ్యతిరేకవర్గం కౌన్సిలర్లు. ఈ గొడవల కారణంగానే… నియోజకవర్గంలో మరో బలమైన నేత, లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సైలెంట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. మాజీ ఎంపీ బుట్టాతో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి మొదట్నుంచి పడడం లేదు. 2024 ఎన్నికల్లో రేణుకను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆ గ్యాప్ మరింత పెరిగిందట. ఎన్నికల్లో చెన్నకేశవ రెడ్డి వర్గీయులు కొందరు ఆమెతో కలిసి పనిచేసినా… పెద్దాయన మాత్రం అంటీ ముట్టనట్టుగానే వున్నారట. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కొందరు ఏకంగా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కొందరు అంతర్గతంగా రేణుకకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. ఈ సమన్వయలేమి కారణంగానే… గత ఎన్నికల్లో బుట్టా రేణుక ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది పార్టీలో.
నాయకుల మధ్య వివాదాల కారణంగా పార్టీ నష్టపోతోందని అర్ధం చేసుకున్న పెద్దలు రెండు వర్గాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నా… పెద్దగా రిజల్ట్ రావడం లేదంటున్నారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుట్టా రేణుక, చెన్నకేశవ రెడ్డి వర్గాలను కలపాలన్నదే ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యం. నాయకులు ఇద్దర్నీ వ్యక్తిగతంగా ఇంటికి పిలిపించి వాళ్ళతో మాట్లాడి మరీ… ఆ మీటింగ్ పెట్టారట ఎస్వీ. కానీ… తీరా డయాస్ మీదికి వచ్చేసరికి చెన్నకేశవ రెడ్డి యధావిధిగా బుట్టా రేణుకను విమర్శించారట. ఎమ్మిగనూరులో తను ఎవరితో ఎలా పోరాడిందీ చెబుతూ… రేణుక అందరినీ కలుపుకొని పోవడం లేదని అన్నారు. చుట్టూ వున్న వాళ్ళ కారణంగానే ఆమె అలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. వెంటనే మాజీ ఎంపీ లేచి తాను అందరిని కలుపుకుని వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఫైనల్‌గా మీటింగ్‌లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నా… కలిసి పనిచేసిన దాఖలాలు మాత్రం లేవు. స్థానిక ఎన్నికల దాకా… ఇలాగే కొనసాగితే పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం కేడర్‌ని వెంటాడుతోంది. ఎమ్మిగనూరు వైసీపీ దశ, దిశ ఎలా ఉంటాయో చూడాలి.