Off The Record: నకిలీ మద్యం ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్‌ని ఓ కుదుపు కుదిపేస్తోంది. దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. గట్టిగా మాట్లాడుకుంటే… ఇప్పుడు రాష్ట్రంలో వేరే ఏ సమస్యా లేదా అన్నంత రేంజ్‌లో దాని చుట్టూ రాజకీయం కుమ్ముకుంది. అయితే…. ఇంత జరుగుతున్నా… కూటమిలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటున్న బీజేపీ వైపు నుంచి నో రియాక్షన్. తప్పు జరిగిందనో, జరగలేదనో… అదీ ఇదీ కాదంటే… ఎట్‌లీస్ట్ రొటీన్‌గా చెప్పే… చట్టం తనపని తాను చేసుకుపోంతుదన్న డైలాగో… ఏదో ఒక రూపంలో రియాక్షన్ అన్నది కనిపించకుండా, అస్సలు స్పందనలు లేకుండా ఉండటం కాషాయ దళం ఎందుకు ఉంటోందటన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. మద్యం వ్యవహారం గ్రామ స్థాయి నుంచి ప్రభావం చూపగలిగేది అయినా, ఈ రచ్చ క్షేత్ర స్థాయికి వెళ్ళినా కూడా కమలనాథుల్లో కదలిక లేకపోవడం ఏంటో అర్ధంకావడం లేదు ఎక్కువ మందికి. అలాగే… పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం మీద కూడా పెద్ద దుమారమే రేగింది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారంటూ వైసీపీ, అసలు పీపీపీ అంటే అర్ధం తెలుసునా అంటూ టీడీపీ రాజకీయ యుద్ధం చేసుకుంటున్నాయి. అయినా సరే… అది వాళ్లకు సంబంధించిన వ్యవహారం తప్ప మాకవసరం లేదన్నట్టుగా ఉంటోంది బీజేపీ నాయకత్వం. రాజకీయంగా కాకున్నా…. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా పీపీపీ విధానం అస్సలు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండటం దేనికి సంకేతమన్న చర్చ నడుస్తోంది. ఇక భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రి సీరియస్ అయిన వ్యవహారం అధికార వర్గాల్ని కుదిపేసింది.
Read Also: Geyser Safety Tips: గీజర్ వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి!
డీఎస్పీని పవన్ తప్పు పట్టడం, అదే డీఎస్పీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు క్లీన్‌చిట్ ఇవ్వడం లాంటివి కలకలం రేపాయి. ఆ విషయమై కూటమిలోని రెండు ప్రధానమైన పార్టీల నాయకుల మధ్య ఒక రకమైన ప్రత్యేక వాతావరణం ఏర్పడ్డా… అస్సలు తమకే మాత్రం సంబంధం లేదన్నట్టు సైలెంట్‌గా ఉన్నారు బీజేపీ నేతలు. ఏపీ కూటమిలో ఉన్నది మూడు పార్టీలు. అలాంటిది ఇద్దరి మధ్య వివాదం రేగినప్పుడు కనీసం బీజేపీ వైపు నుంచి సర్దుబాటు చేసే ప్రయత్నం జరక్కపోవడం ఏంటన్నది కొందరి క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బలం తక్కువ కావచ్చుగానీ… కేంద్రంలో తిరుగులేని శక్తిగానే ఉంది. ఆ దన్నుతో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినా… వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేసినా….. కాదనే శక్తి మిగతా రెండు పార్టీలకు లేదన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. అది వదిలేసి… పరిష్కారం సంగతి తర్వాత, కనీసం స్పందించకపోవడం చూస్తుంటే… ఏదో తేడా కొడుతందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇదంతా చూస్తున్న వాళ్ళకు అసలు ఏపీ కూటమిలో తాము భాగస్వాములమని బీజేపీ లీడర్స్ భావిస్తున్నారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. అవన్నీ వదిలేసి రాష్ట్రంలో మన బలం తక్కువ కదా…. మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకుందామని అనుకుంటూ తమను తాము తక్కువ చేసుకుంటున్నారా అన్నది ఇంకొందరి అనుమానం. క్షేత్ర స్థాయిలో బలపడేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వినియోగించుకోకుండా, కేవలం సిద్ధాంతాల్ని వల్లెవేస్తూ… ఏం జరిగినా పెద్దల పేర్లు చెప్పి తప్పించుకుంటూ పోతుంటే…ఇక రాష్ట్రంలో బలపడే ప్రసక్తే ఉండబోదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి.