NTV Telugu Site icon

Off The Record: టీడీపీ ఆ నేతల విషయంలో అప్పుడు సై సై..! ఇప్పుడు నై నై..?

Tdp

Tdp

Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొందరు టీడీపీ నాయకుల పరిస్థితి న ఘర్‌ కా… న ఘాట్‌ కా అన్నట్టు తయారైందట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా పవర్‌లోకి తీసుకు రావాలంటూ… పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటూ… ఉన్న ఊళ్ళను, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి వచ్చారట కొందరు. పార్టీ పవర్‌లోకి వచ్చి ఆరునెలలైనా… ఎలాంటి అవకాశాలు దక్కక అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నారైలు…. విదేశాల్లో ఉద్యోగాలను వదులుకొని ఇక్కడికి రాగా…. ఓ జిల్లా స్థాయి అధికారి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారట వాళ్ళు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ…. మేధావులు, ఎన్నారైలకు ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారం మొదట్లో జరిగింది. ఆ మేరకు శృంగవరపుకోట నియోజకవర్గం కోసం వచ్చారు గొంప కృష్ణ. స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించి జనంలో ఉండటం కోసం కుటుంబంతో సహా అమెరికా నుంచి దిగిపోయారు ఎన్నారై గొంప. అలాగే అమెరికాలో అన్ని వ్యాపారాలు, ఉద్యోగం వదులుకొని చీపురుపల్లి నియోజకవర్గం నాకే అనుకుంటూ…వచ్చి పార్టీ కోసం పనిచేశారు కిమిడి నాగార్జున. ఇక అడల్ట్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో డీడీగా పని చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు కోట్ల సుగుణాకర్. ఈ ముగ్గురూ ఎన్నికలకు ముందు, ఆ టైంలో పార్టీ కోసం గట్టిగానే పని చేశారన్నది స్థానిక నాయకుల మాట.

Read Also: Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్‌కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!

కానీ… ఇప్పుడు మా ముఖం చూడ్డానికి కూడా పార్టీ పెద్దలు ఇష్టపడటం లేదని తీవ్ర ఆవేదనలో ఉన్నారట ముగ్గురూ. మన పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి… నీకు ఎమ్మెల్సీ గ్యారంటీ అంటూ… అప్పట్లో గొంప కృష్ణకు చెప్పారట. కానీ… ఇప్పుడు ఆ ఊసే లేదంటూ ఆవేదనగా ఉన్నట్టు సమాచారం. ఇక నాగార్జునకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన అధిష్టానం‌ ఇప్పుడు అసలు మాట్లాడడం లేదన్నది ఆయన అనుచరుల మాట. ఇదేం ఖర్మరా బాబూ అని గగ్గోలు పెడుతున్నారట నాగార్జున అనుచరులు. ఇక కోట్ల సుగుణాకర్‌కు ఇంకా రెండేళ్ల సర్వీస్‌ ఉంది. అయినా సరే…వీఆర్‌ఎస్‌ తీసుకున్నారాయన. వెంటనే టీడీపీ అధినేతను కలిసి తన మనసులో మాట చెప్పారట. ఆయన ఆదేశంతోనే…. పూర్తి స్థాయిలో పార్టీ గెలుపుకోసం పని చేశానని, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సుగుణాకర్‌. కుటుంబానికి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నందున తొందర పడ్డానని ఇప్పుడు ఫీలవుతున్నారట సుగుణాకర్‌. పార్టీ అధికారంలోకి రావడం ఆనందంగానే ఉన్నా…. తమను కనీసం పట్టించుకోకుండా… పూచికపుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ముగ్గురూ.

Show comments