Off The Record: కొలికపూడి శ్రీనివాసరావు….. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. స్థానికుడు కాకున్నా… ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందే టికెట్ తెచ్చుకుని కూటమి హవాలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే అసెంబ్లీ మెట్లు ఎక్కేశారాయన. గత మూడు దఫాలుగా టీడీపీకి తిరువూరులో అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని తొలిసారే దక్కించుకోవడంతో… తమకు అండగా ఉంటారని ఆశపడిందట తిరువూరు టీడీపీ కేడర్. అయితే ఎమ్మెల్యే వ్యవహారశైలితో… ఇటు కేడర్, అటు అధిష్టానం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నది లోకల్ టాక్. ప్రతిసారి ఏదో ఒక వివాదంతో కొలికపూడి వార్తల్లోకి ఎక్కటం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. గెలిచిన వెంటనే నియోజకవర్గంలో టీడీపీ వారిని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతల అక్రమాలపై రివెంజ్‌కు ప్రయత్నించటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. స్థానిక వైసీపీ నేత నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా భవనం కడుతున్నా.. కూటమి ప్రభుత్వంలో కూడా అధికారులు పట్టించుకోవటంలేదంటూ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా జేసీబీతో వెళ్ళటం, ఆ వీడియోలు వైరల్ కావటంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ తర్వాత పార్టీకి చెందిన చిట్యాల సర్పంచ్ శ్రీనివాసరావును దూషించటంతో సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేసుకోవటం టీడీపీలోనే కలకలం రేపింది.
కొలికపూడికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ధర్నాలు చేసి మంగళగిరి ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుల దాకా వెళ్ళింది వ్యవహారం. ఆ తర్వాత కూడా తగ్గలేదాయన. ఓ రోడ్డు వ్యవహారంలో వైసీపీకి చెందిన ఎస్టీ సామాజిక వర్గ నాయకురాలి భర్తపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవటంతో ఎమ్మెల్యే మీద సీరియస్ అయింది టీడీపీ అధిష్టానం. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీస్ ఇచ్చి వివరణ కోరింది. ఇలా… వరుస ఘటనలతో సీఎం చంద్రబాబు కూడా కొలికపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. క్రమశిక్షణ కమిటీది కూడా అదే అభిప్రాయం అట. ఇప్పటి వరకు జరిగిందంతా సొంత పార్టీలో వ్యవహారమైతే… తాజాగా మిత్రపక్షం జనసేనకు కూడా మింగుడుపడకుండా తయారైందట ఎమ్మెల్యే తీరు. జనసేన తిరువూరు ఇన్చార్జి మనుబోలు శ్రీనివాసరావు చేసిన ఆరోపణల మీద ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణ హాని ఉందని, తనను అంతం చేయటానికి ఇప్పటికే డేవిడ్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు మనుబోలు. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, గవర్నర్ లకు దీనిపై ఫిర్యాదు చేస్తానని ఆయన అనడం కలకలం రేపుతోంది.
నేరుగా ఎమ్మెల్యేతోనే తనకు ప్రాణహాని ఉందనటం, సుపారీ ఇచ్చారని కూటమి నాయకుడు చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. వీటిపై కొలికపూడి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన రెస్పాన్స్ ఎలా ఉన్నా…. జనసేన నేత ఆరోపణలు వెనుక వేరే కారణం కూడా ఉండి ఉండవచ్చన్న చర్చ కూడా జరుగుతోందట స్థానికంగా. తిరువూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి విషయంలోనే ఈ వివాదం తెరమీదకు వచ్చి ఉండవచ్చంటున్నారు. ఆ విషయంలో జనసేన ఇన్చార్జికి, ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ వచ్చిందన్నది లోకల్ టాక్. ఇదే పదవిని టీడీపీకి చెందిన రమేష్ రెడ్డి కూడా ఆశిస్తున్నారట. అతనికి ఇవ్వడం కూడా కొలికపూడికి ఇష్టంలేదనేది పార్టీ వర్గాల టాక్. ఈ క్రమంలోనే…
రమేష్ రెడ్డి ఓ మహిళతో అసభ్యకంగా మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రమేష్ రెడ్డి, జనసేన నేత మనుబోలు శ్రీనివాస్ రావు స్నేహితులు కావటంతో కావాలనే అసత్య ఆరోపణలు చేయించారనేది ఎమ్మెల్యే వర్గం వాదన. రమేష్ రెడ్డి ఆడియో వైరల్ అవటం వెనుక ఎమ్మెల్యే మనుషులు ఉన్నారని భావించి ఇలా చేశారని కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద తనకు సంబంధం ఉందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా… జరుగుతున్న ప్రతి వివాదానికి లింక్ తిరిగి తిరిగి కొలికపూడి దగ్గరికే వెళ్తుండటం పార్టీకి కూడా తలనొప్పిగా మారుతోందట. తాజా వివాదంపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి మరి.