NTV Telugu Site icon

Off The Record: కేసీఆర్ మారిపోయారా..? ఇక ముందు కూడా ఇలానే ఉంటారా..?

Kcr

Kcr

Off The Record: బీఆర్‌ఎస్‌ చరిత్రలో తొలిసారిగా ఈ విడత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు చేసిన గాయం పార్టీ అధిష్టానాన్ని ఓవైపు సలుపుతుండగానే… దాని మీద కారం చల్లాయి ఎంపీ ఎలక్షన్స్‌. పార్టీ పెట్టాక తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర అంతర్మధనంలో పడ్డారట గులాబీ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ముందుకు సాగుతామని ప్రకటించింది అధిష్టానం. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయంతో… దిమ్మ తిరిగిపోయిన అగ్ర నాయకత్వం… మరింత లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టిందట. దీని మీద పార్టీలో అంతర్గత చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నట్టు తెలిసింది.

Read Also: Off The Record: పీసీసీ చీఫ్‌ విషయంలో హైకమాండ్‌కు క్లారిటీ వచ్చిందా..?

కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ని కలుస్తున్న నేతలు, కార్యకర్తలు ఎవరి దృష్టికి వచ్చిన వివరాలు వారు చెబుతున్నారట. మరోవైపు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్‌ స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి లంచ్‌ మీటింగ్‌లు పెడుతున్నారు. దాంతో పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వస్తున్న పార్టీ శ్రేణులను కలుస్తున్నారాయన. గులాబీ దళంలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయింది. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతను కలవాలంటే… అదో తతంగంలా ఉండేదని, అసలు ఎమ్మెల్యేలకు సైతం ఆయన దర్శన భాగ్యం కలగడం అపురూపంగా ఉండేదని, ఇప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉందని మాట్లాడుకుంటున్నారు నాయకులు.

Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..

ఇప్పుడు కలిసినట్టు, మాట్లాడినట్టు గతంలో కూడా మాట్లాడిఉంటే.. పరిస్థితులు వేరుగా ఉండేవన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. సార్‌.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని కేడర్‌ గుసగుసలాడుకుంటోందట. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఎలాంటి భేషజాలు లేకుండా అందర్నీ కలిస్తే… పూర్వ వైభవం రావడానికి ఎక్కువ టైం పట్టబోదన్న అభిప్రాయం కేడర్‌లో వ్యక్తం అవుతోందంటున్నారు. తాజాగా ఆర్మూరు, హుజూరాబాద్ నుంచి వచ్చిన పార్టీ నాయకులను కలసి.. వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. ఇక ముందు కూడా ఆయన పార్టీ శ్రేణులను ఇలాగే కలుస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. మొత్తం మీద కేడర్‌, లీడర్స్‌తో కేసీఆర్‌ మీటింగ్‌లు బీఆర్‌ఎస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. అదే టైంలో ఇంకో మాటా గట్టిగానే వినిపిస్తోంది. కేసీఆర్‌ కలవాలనుకున్నారు, లీడర్స్‌ కలుస్తారు. కానీ… ఇద్దరి మధ్య శిఖండుల్లా అడ్డుపడే బ్యాచ్‌ని దూరం పెడితేనే వ్యవహారం సవ్యంగా సాగుతుందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఈ మార్పు తాత్కాలికమా? లేక శాశ్వతమా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.