గద్వాల.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలిచే ప్రాంతం. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల రాజకీయం మరోలా ఉంటుంది. గతంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. తాజాగా స్వపక్షంలోనే విపక్షం పుట్టుకొచ్చింది. అదను చూసి అప్పర్ హ్యండ్ కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికారపార్టీలో కనిపిస్తోంది. అయితే నేతల మధ్య ఆధిపత్యపోరులో నియోజకవర్గంలోని అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యల మధ్య విభేదాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జడ్పీటీసీగా గెలిచిన సరితను టీఆర్ఎస్ జడ్పీ ఛైర్‌పర్సన్ చేసింది. ఆ తర్వాత గద్వాలలో పట్టు పెంచుకునేందుకు సరిత ఆమె భర్త తిరుపతయ్య ప్రయత్నించడం వర్గపోరు బీజం వేసింది.
ఎమ్మెల్యేకు వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చింది. సొంత నియోజకవర్గం అలంపూర్ ఎస్సీ రిజ్వర్డ్ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు చూస్తున్నారట. వీళ్లకు జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి అండగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్‌పర్సన్ వర్గాల మధ్య ఉప్పు నిప్పులా మారింది రాజకీయం. గద్వాలలో తమ వర్గాన్ని పెంచుకునేందుకు సరితా తిరుపతయ్యలు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పనిలో పనిగా తమకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారట. తమ సామాజికవర్గాన్ని ఓన్ చేసుకోవడం.. ఎమ్మెల్యేతో విభేదించే వారిని చేరదీయడం.. స్థానిక అధికారులపై పెత్తనం ఇలా చాలా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. అటు ఎమ్మెల్యే.. ఇటు జడ్పీ ఛైర్సన్ ఆదేశాల మధ్య గద్వాలలోని యంత్రాంగం నలిగిపోతోంది. తరచూ ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కంటే జడ్పీ ఛైర్‌పర్సన్‌కే ప్రొటోకాల్ ఎక్కువ. అది కూడా రెండువర్గాల మధ్య మరింత నిప్పు రాజేస్తున్నట్టు సమాచారం.
తాజాగా గురుకుల పాఠశాల భవనం ఓపెనింగ్ రగడ ఆ కోవలోనిదేనని చెబుతున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ ముందుగా వచ్చి భవనం ప్రారంభించేశారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారి గల్లా పట్టుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని గులాబీ దళపతి కేసీఆర్ చెప్పారు. ఆ మాట తర్వాత ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. కానీ.. సరితాతిరుపతయ్యలు చేస్తున్న హడావిడే కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. మరి… ఎన్నికల నాటికి ఈ వర్గపోరు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.