Off The Record: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ ఓ వెలుగు వెలిగిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ దెబ్బతో డీలాపడిపోయింది. ఇక… గడిచిన పదేళ్ళలో రాష్ట్రం నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్‌ఎస్‌లోకి తర్వాత కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. 2014లో జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు కొన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిచిప్పటికీ పార్టీలో ఇమడలేకపోయారు. అదే టైంలో… అటు ఏపీలో పార్టీకి అధికారం రావడంతో… తెలంగాణ టీడీపీ నుంచి ఒకరిద్దరు నేతలు స్ట్రాంగ్‌గానే ఉండేవారు. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తరువాత తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. తర్వాత 2024లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ అధిష్టానం…. తిరిగి తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుతో కూటమి ఏర్పాటవగా.. తెలంగాణలో సైతం అదే కాంబినేషన్‌లో పూర్వ వైభవం దిశగా అడుగులేయాలమని తపిస్తోందట టీడీపీ. తెలంగాణలో ఒకప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, ఆధిపత్యకులాలవారు అధికారం చెలాయించారు. ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేశాక… అప్పటి వరకు అణచివేతకు గురైన బీసీ కులాల్ని ప్రోత్సహించారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఆ ఊపులో పలువురు బీసీ నాయకులు మంత్రులు అయ్యారు. ఆ విధంగా బీసీల్లో రాజకీయ చైతన్యం రావడానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణం. ఇక పరిణమామ క్రమంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బలపడటం, అలాగే.. రెండు కళ్ళ సిద్దాంతంతో చంద్రబాబుకు రెండు ప్రాంతాలు సమానమే అన్న భావన పెరగడంతో ఆయన మీద తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర వేయగలిగారు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్. దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీన పడింది. అదంతా గతం. ఇప్పుడిక తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉండడం, కేంద్రంలో చక్రం తిప్పగలిగిన స్థాయికి చేరుకోవడంతో… తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. 8 ఎంపి సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్న బిజెపితో టీడీపీకి పొత్తు ఉంది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇక్కడ కూడా మంచి పాలోయింగ్ ఉంది. ఈ కాంబినేషన్‌తోపాటు… అణచివేతకు గురవుతున్నామని ఫీలవుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నేతలను తెలుగుదేశం వైపునకు తిప్పుకుని బలోపేతం కావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకున్నా… వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా కూటమిగా పోటీచేయాలని భావిస్తోందట టీడీపీ.అందుకే ఇప్పటి నుంచి బీసీ కులాల నుంచి వచ్చే నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవాలని వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నవాళ్లు, కులగణన సక్రమంగా జరుగలేదని భావిస్తున్న బీసీ సంఘాల నేతలను తన వైపు తిప్పుకోవడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటిని బిజెపి, జనసేన మద్దతుతో రంగంలోకి దిగితే… జీహెచ్‌ఎంసీతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా పార్టీకి ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారట తెలుగుదేశం అధినేత. ఇదే జరిగితే కేసీఆర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తెలంగాణ నుంచి పారిపోయిన తెలుగుదేశం తిరిగి అడుగుపెట్టిందనే ఆరోపణలకు పదునుపెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు పరిశీలకులు.