Site icon NTV Telugu

Off The Record: కవ్వంపల్లికి మంత్రి పదవి రాకుండా చేసింది ఎవరు..?

Kavvampally Satyanarayana

Kavvampally Satyanarayana

Off The Record: కట్టండ్రా బ్యానర్లు…. కొట్టండ్రా డీజేలు…. చల్లండ్రా గులాల్‌ అన్న రేంజ్‌తో అంతా సెట్‌ చేసి పెట్టుకున్నారట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాణ. ఇంకేముంది… అయిపోయింది. మనకు మంత్రి పదవి వచ్చేస్తుంది. కాల్‌ రావడమే ఆలస్యం కారెక్కి హైదరాబాద్‌ వైపు దూసుకుపోవడమేనని కేడర్‌కు కూడా చెప్పేశారట. సరిగ్గా అక్కడ రాజ్‌భవన్‌లో… కవ్వంపల్లి సత్యనారాయణ అనే నేను అన్న మాట వినపడగానే… నియోజకవర్గంలో దుమ్మురేగిపోవాలంటూ…. అనుచరులకు ఆదేశాలిచ్చేశారట. ఎప్పుడెప్పుడు రింగ్‌ అవుతుందా? అధిష్టానం నుంచి పిలుపు వస్తుందా అని తెగ ఎదురు చూస్తున్న మానకొండూర్‌ ఎమ్మెల్యేకి చివరికి నిరాశే మిగిలింది. ఫోనూ లేదూ…. మంత్రి పదవీ లేదు. దాంతో తన బుగ్గకారుకు అడ్డుపడ్డ ఆ దుష్టులెవరంటూ తెగ ఆరాలు తీసేస్తున్నారట ఆయన. మంత్రి విస్తరణలో ఒక పోస్టు కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి దక్కుతుందని అన్నారు. రకరకాల లెక్కలు వేసుకుంటున్న క్రమంలో… అన్ని సమీకరణలు పోగా ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలారు… అందులో కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది.

Read Also: Minister Vasamsetti Subhash: పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొండి..

సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు కావడం, డాక్టర్‌గా మంచి పేరు ఉండటం ఆయనకు ప్లస్‌ అనుకున్నారు అంతా. పైగా కరీంనగర్ జిల్లాకు ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు. ఇలా… ఎట్నుంచి ఎటు చూసినా… కవ్వంపల్లి కన్ఫామ్‌ అనుకున్నారు అంతా. అందుకే…ఆయా మండలాల్లోని ముఖ్యనేతలు, క్యాడర్ అంతా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వచ్చేసి టపాసులు కూడా సిద్ధం చేశారు. పేరు అనౌన్స్‌ అవగానే…..ధూంధాం చేయాలనుకున్నారట. కానీ… ఏం జరిగిందో… తెల్లారేసరికి సీన్‌ రివర్స్ అయింది…. కవ్వంపల్లిని కాదని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ని వరించింది మంత్రి పదవి. దీంతో ఓ వైపు ఫోన్ కాల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న ఎమ్మెల్యే దంపతులు… మరోవైపు సంబరాలకు సిద్దమైన కార్యకర్తలు… ఇంకోవైపు హైదరాబాద్‌కి వెళ్లేందుకు ప్రయాణం అయిన నియోజకవర్గ నేతలు… ఇలా అంతా ఎక్కడివాళ్ళు అక్కడ నైరాశ్యంలోకి వెళ్లిపోయినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి పదవికి ఒక్క అడుగు దూరం వరకు వెళ్లిన కవ్వంపల్లికి చివరి మెట్టు మీద కాలు అడ్డం పెట్టింది ఎవరనేది… ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది… సీఎం కూడా సుముఖంగా ఉన్న టైంలో సీన్ ఎందుకు రివర్స్ అయింది…? అని ఆరా తీస్తున్నారట కవ్వంపల్లి.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి… ప్రభుత్వంలో నెంబర్‌టూగా వ్యవహరిస్తున్న మరో మంత్రితో కలిసి చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డాక్టర్ సాబ్ వ్యవహార శైలిపై గతంలో వచ్చిన ఆరోపణల్ని మరోసారి తెర మీదికి తీసుకువచ్చి… పక్కన పెట్టినట్టు సమాచారం. అదీగాక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతున్న కోల్డ్ వార్, ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్ కేంద్రంగా సాగుతున్న రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు కవ్వంపల్లి మంత్రి పదవిని కాటేశాయని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారితో విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ… పైకి మాత్రం లౌక్యంగా వ్యవరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు, బాధితులం అయ్యామని మరికొందరు పార్టీ పెద్దలతో మొరపెట్టుకోవడం, వ్యక్తిగత సిబ్బందిలోని ఒకరు షాడో ఎమ్మెల్యేగా మారడం లాంటివి ఆయనకు మైనస్‌గా మారినట్టు సమాచారం. షాడో ఎమ్మెల్యే చెప్పిందే నడుస్తోందని…. పార్టీకి ప్రభుత్వానికి అతని వల్ల చిక్కులు తప్పవని ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా ఉన్నాయట. ఆ షాడో ఎమ్మెల్యే వల్లనే.. గతంలో పాలు నీళ్లలా కలిసి ఉన్న ఓ కీలక నేత… కవ్వంపల్లి ఇప్పుడు ఉప్పు నిప్పులాగా మారారన్నది లోకల్‌ టాక్‌. ఇలా రకరకాల ఈక్వేషన్స్‌ అన్నీ కలగలిసి లాస్ట్‌ మినిట్‌లో దెబ్బకొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా… డాక్టర్‌ సాబ్‌కి పొలిటికల్ తత్వం బోధపడిందో లేదోనని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో.

Exit mobile version