Off The Record: పెద్దలు ఊరికే చెప్పరు… ఏదైనా అనుభవిస్తేగానీ.. దాని లోతెంతో తెలియదని. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ రైటర్ కమ్ పొలిటీషియన్ పోసాని కృష్ణమురళికి. ఆ ఎదురు కావడం కూడా అట్టా ఇట్టా కాదు.. కేసు మీద కేసులేసి పెట్టిన జైల్లో పెట్టకుండా.. మార్చి మార్చి.. తిప్పి తిప్పి నరకానికి నకలు ఇలా ఉంటుందని చూపించారు. అప్పటికికాని ఆయనకు తత్వంబోధపడలేదు. దాంతో… ఇప్పుడాయన నాకు రాజకీయం వద్దు రాజా అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టేస్తున్నారట. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనగారు తన మూలాల్లోకి రీ ఎంట్రీ ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నాడా..?
మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా తీశారు పోసాని. ఆ సినిమా ఫక్తు ఆయన మనస్తత్వానికి అద్దంపడుతుందనే వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు వంద సక్సెస్ ఫుల్ సినిమాలకు రైటర్ గా పని చేసి ఐదు వందలకుపైగా సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్ గా నటించిన కృష్ణమురళికి రాజకీయాలంటే తెగ ఇది. అప్పట్లో చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఆయన గొప్ప నాయకుడని కొనియాడుతూ లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ పేపర్లకు ఫ్రంట్ పేజీలలో ఫుల్ లెంగ్త్ యాడ్స్ ఇచ్చారు పోసాని. ఆ తర్వాత 2009లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక.. చిరంజీవిని వదిలేసిన పోసాని మనసు వైఎస్ రాజశేఖరరెడ్డి మీదకు మళ్లి ఆయనకు మద్దతుదారుడిగా మారిపోయారు. వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ వైపు టర్న్ తీసుకున్నారు. కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జగన్ తరఫున ప్రచారం కూడా చేశారు. అలా అలా.. వైసీపీ అధ్యక్షుడికి దగ్గరైపోయిన పోసాని ఆ ప్రభుత్వ హయాంలో ఫిల్మ్, నాటకరంగ సంస్థల చైర్మన్ గా నియమితులయ్యారు. వైసీపీ నేత హోదాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు చేసేవారు పోసాని. పవన్ కళ్యాణ్ మీద అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అప్పటి నుంచి సినిమా అవకాశాల్లో ఆయన ఫేట్ తిరగబడిపోయింది. ఒకప్పుడు కాల్ షీట్లకు ఖాళీ లేని పోసాని డైరీలో.. అన్నీ ఖాళీ పేజీలే మిగిలిపోయాయి.
Read Also: Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని మనసా వాచా నమ్మిన వైసీపీ కేడర్ కు నిరాశ ఎదురైతే… పోసానికి కేసులు మిగిలాయి. అప్పట్లో ఆయన చేసిన కామెంట్లపై రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 15 కేసులు నమోదుయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజంపేట పోలీసులు ఫస్ట్ టైం పోసానిని అరెస్ట్ చేస్తే… ఆ తర్వాత గుంటూరు, కర్నూల్, విజయవాడ, నరసరావుపేట పోలీసులు వరుసకట్టారు. స్టేసన్ల మీద స్టేసన్లలో కేసులు నమోదు కాగా… జైళ్ల మీద జైళ్లు మార్చి దాదాపు 20 రోజులపాటు ఆయన్ను రాష్ట్రంలో సగ భాగం తిప్పారు పోలీసులు. జగన్ ఓటమి తర్వాత కూడా పోసాని కూటమి నేతల మీద యధావిధిగా రెచ్చిపోయారు. ఆ తర్వాత కేసులు పెడతారనే ఉప్పందిందో ఏమో… ఒక రోజు హటాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని… ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అయినా కేసులు ఆగలేదు. కట్ చేస్తే జైల్ జీవితం నుంచి బయటపడి కోలుకున్న కృష్ణమురళి ఇప్పుడు మళ్లీ కలం పట్టారట. జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో సినిమా తీయడానికి కథ రెఢీ చేసుకున్నట్టు సమాచారం. వచ్చే నెల 22న ఈ సినిమాకి క్లాప్, కొబ్బరికాయ కొట్టబోతున్నారట పోసాని. ఈ సంగతి తెలిసిన వాళ్లు ఎవరైనా… సినిమా తీస్తున్నారట కదా… అని అడిగితే అవునన్నా అంటూనే అందులో రాజకీయాలేమీ ఉండవన్నా… ఏ నాయకుడి గురించి సినిమాలో ప్రస్తావన రాదన్నా… అని జాలిగా చెబుతున్నారట. అంతకు ముందు జాలీగా మాట్లాడే పోసాని ఇప్పుడు జాలిగా మాట్లాడ్డం చూసి పాత జ్ఞాపకాలు బాగా వెంటాడుతున్నట్టున్నాయ్… అందుకే రాజకీయాల్లేవ్ అని అడగక ముందే చెబుతున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారట టాలీవుడ్‌లో.
Read Also: Nara Lokesh: కేటీఆర్‌ని ఎందుకు కలవకూడదు..? దానికి రేవంత్‌రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా..?
మాంచి రచయితగా పేరున్న పోసానికి కేరక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రావడంతో కలానికి క్యాప్ పెట్టి పక్కన పడేశారు. పవన్ ఎపిసోడ్ తర్వాత వేషాలు లేకపోవడంతో తనకు ఫుడ్ పెట్టిన పెన్ ను మళ్లీ చేతబట్టారట పోసాని. ఆపరేషన్ అరుణా రెడ్డి సినిమాకు కథా, స్క్రిన్ ప్లే, డైరెక్షన్లతోపాటు ఒక కేరక్టర్ కూడా వేస్తున్నట్టు తెలిసింది. అంతా కొత్త నటీనటులేనట. సినిమాలో ఎక్కువ భాగం రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనే షూటింగ్ ఉంటుందంటున్నారు. చూడాలి పోసాని సెకండ్ ఇన్నింగ్స్ హిట్ కొడుతుందో ఫ్లాప్ అవుతుందో….. తిట్టే నోరు తిరిగే కాలు తిన్నగా ఉండవంటారు. పోసాని వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.
