Off The Record: సంక్రాంతి టైంలో… గోదావరి జిల్లాల్లో… కోడి పందేలు ఎంత ఫేమస్సో… పేకాట శిబిరాలు కూడా అంతే పాపులర్. ఆ మూడు రోజులు కూర్చున్న దగ్గర్నుంచి లేవకుండా ఆడే పేకాట రాయుళ్ళు ఉంటారంటే అతిశయోక్తి కాదు. దాన్ని సరదా అని వాళ్ళంటారు. జూదమని బయటి వాళ్లంటారు. సరే… ఎవరేమనుకున్నా… అదంతా అంతవరకే. పండగ ముచ్చట ముగిశాక అలాంటివి ఉండవు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ… ఇప్పుడు పరిస్థితి మారుతోందట. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్నట్టు… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో… ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా పేకాట శిబిరాల్ని నడిపించేస్తున్నారట. ఇక్కడ ఆడేందుకు ఏకంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలనుంచి వస్తున్నారని, సకల వసతులు కల్పిస్తున్న ఆ శిబిరాలకు పోలీసుల సపోర్ట్ కూడా ఉంటోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. మీరు ఎంత తెచ్చుకునైనా ఆడండి.. ఆపేవాడు ఉండడు.. మీకు మేమే కాదు.. మా నాయకులు కూడా గ్యారెంటీ అంటూ పేకాట శిబిరాల నిర్వాహకులు ప్రచారం చేస్తుండటంతో… ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పేకాట పరిశ్రమ స్థాయికి చేరుకుంటోందన్న సెటైర్స్ వినిపిస్తున్నాయి.
Read Also: Asaduddin Owaisi: పాకిస్తాన్ ఒక విఫల దేశం..
తణుకు, భీమవరం ప్రాంతాల్లో వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఏడాది పొడవునా… నిరాటంకంగా జరిగేలా చూస్తున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒప్పుకోకపోవడంతో… అక్కడి వాళ్ళని కూడా పక్క సెగ్మెంట్స్‌కు రప్పించి మరీ… ముక్కలు కలిపేస్తున్నారట. మీ దగ్గర లేకుంటే ఫర్వాలేదు. మా దగ్గరికి వచ్చేయండి… హ్యాపీగా ఎంజాయ్ చేయండని నిర్వాహకులు ఆఫర్స్ ఇస్తున్నట్టు సమాచారం. నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, గోపాలపురం లాంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒప్పుకోకపోవడంతో… అక్కడి నుంచి వచ్చే పేకాట రాయుళ్ళు తణుకులో మకాం వేస్తున్నట్టు సమాచారం. నాయకుల అండదండలు, పోలీసుల లాలూచీల్లో భాగంగా ఎవరి వాటాలు వారికి అప్పజెప్పేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడుముక్కలాట జోరందుకుంటోందట. పేకాట పర్మిషన్స్ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే… నేరుగా అభయమిచ్చిన నాయకులనే ఫోన్‌లైన్లోకి తీసుకుని మరీ గ్యారెంటీ ఇస్తున్నారట శిబిరాల నిర్వాహకులు. ముఖ్యంగా తణుకు, భీమవరం ప్రాంతాల్లో ఒకపక్క నిర్వాహకులు, మరోపక్క నాయకులు, ఇంకొవైపు కొంతమంది పోలీసులు పేక ముక్కల్లా కలిసిపోయి యాపారం చేసేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: కాపు కులం పొలిటికల్‌గా చీలిపోతోందా..? జనసేనతో పొత్తుతో మారిపోయిన ఈక్వేషన్స్..!
ఇందుకు ఉదాహరణగా తణుకు, భీమవరాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. తమకు లైసెన్స్ ఉందని క్లబ్లులు నడిపిస్తున్నది కొందరైతే.. ఎవరి వాటాలు వారికిచ్చేశాం కాబట్టి అడ్డు లేదనే ధీమాతో మరి కొంత మంది అపార్టుమెంట్లు, గెస్టు హౌసులను పేకాట డెన్‌లుగా మార్చేశారట. ఇటీవల పొలంగట్లు, మైదాన ప్రాంతాల్లో జూదం ఆడుతున్న వారిపై డ్రోన్లతో నిఘా పెట్టిమరీ పట్టుకుంటున్న పోలీసులు ఊరి మధ్యలోనే యధేచ్ఛగా సాగిపోతున్న శిబిరాల జోలికి మాత్రం వెళ్ళడంలేదని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలోని కొంత మంది నాయకులు పేకాట నిర్వహణను ఆదాయ వనరుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. వీటి ద్వారా ఛోటామోటా నాయకులను మెప్పించడం, అదే సమయంలో ఆదాయం సమకూరుతుండటంతో… అసలు కంటే కొసరు వ్యాపారమే బాగున్నట్టుగా భావిస్తున్నారట నేతలు. మద్యం సిండికేట్ల తరహాలోనే జూదం నిర్వాహకులు సైతం సిండికేట్లుగా ఏర్పడి శిబిరాలు నడిపించడం ఇపుడు ట్రెండ్ అయిందంటున్నారు. తణుకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు భీమవరం పరిసరాల్లో నడుస్తున్న ఈ వ్యాపారాన్ని చూసి మరికొన్ని చోట్ల నాయకులు ఇన్‌స్పైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇది ఆదాయ వనరుగా మారడంతో ఇప్పట్లో వీటికి బ్రేక్ పడే అవకాశం ఉంటుందా అన్నది డౌటేనంటున్నారు స్థానికులు. మొత్తం మీద తణుకు, భీమవరం కేంద్రాలుగా ఏడాది పొడవునా… జూదగాళ్లకు రోజంతా మూడుముక్కలు, ఆరు ఆటలు అన్నట్టుగా సాగిపోతోంది.