Site icon NTV Telugu

Off The Record: సీఎం వార్నింగ్‌ ఇచ్చినా మారడం లేదా..? ఎమ్మెల్యేలే కూటమి కొంప ముంచబోతున్నారా?

Nda Mlas

Nda Mlas

Off The Record: ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళు, వాళ్ల అనుచరుల వ్యవహారాలు, ప్రవర్తనను బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు ఓ అభిప్రాయం కలుగుతుంది. కానీ… ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు… పదే పదే హెచ్చరిస్తున్నారు. అమరావతికి పిలిచి వన్‌ టు వన్‌ మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఇలా 30 మంది ఎమ్మెల్యేలని పిలిచి ముఖాముఖి మాట్లాడారట. వారి మీద వస్తున్న ఆరోపణలు, సరి చేసుకోవాల్సిన అంశాలను, సరిదిద్దుకోకుంటే ఏం అవుతుందో కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు సీఎం. ఎంత చెప్పినా… కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో… ముఖ్యమంత్రిలో అసహనం పెరుగుతోందట. లిక్కర్, అక్రమ ఇసుక రవాణా, పేకాట క్లబ్బులు, అడ్డగోలురియల్ ఎస్టేట్ దందాల్లాంటి వాటిలో కొంతమంది ఎమ్మెల్యేలు పీకల్లోతున కూరుకుపోయారన్న ఆరోపణలున్నాయి. ప్రతి జిల్లాలో కొంతమంది ఇబ్బందికరంగా మారారు. అదేమంటే… గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు తిరిగి రాబట్టుకోవాలి, వచ్చే ఎలక్షన్స్‌లో పెట్టుబడులు పెట్టాలి… ఏమీ చేయకుంటే డబ్బులు ఊరికే రావు కదా అంటూ… సెటైర్స్‌ సైతం వేస్తున్నారట కొందరు.

Read Also: China Supports India: భారత్‌కు మద్దతు ఇచ్చిన చైనా..? అమెరికాపై తీవ్ర విమర్శలు.. ఇక్కడే అసలు ట్వీస్ట్..!

ఈజీగా డబ్బులు వచ్చే లిక్కర్, ల్యాండ్, శాండ్‌ మాఫియాలు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది నియోజకవర్గాల టాక్‌. ఆ సమాచారం మొత్తం సీఎం టేబుల్‌ మీదికి చేరిందట. దాన్ని చూసి ఉలిక్కిపడ్డ సీఎం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలోనే రోజూ కొందర్ని పిలిచి మాట్లాడుతున్నారు. మారాలి.. మీరు మారాలని చెబుతున్నారు. ఈ మధ్య ఇద్దరు నేతల మధ్య ఫోన్‌ సంభాషణలో ఓ ఎమ్మెల్యే ఏడాదిలో వంద కోట్లు సంపాదించారని మాట్లాడుకున్న మాటలు బయటికి వచ్చి కలకలం రేపాయి. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా…. నిప్పు లేకుండానే పొగ వచ్చిందా అన్నది కొందరి ప్రశ్న. ఇక కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలకు ప్రతి పనిలో వాటాలు ఇవ్వాల్సి వస్తోందట. కొత్త వెంచరా..వాటా..ఇచ్చెయ్..లిక్కర్ షాపా..సిండికేట్‌లోకి తోసేయ్…..అన్న పరిస్థితులే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కూటమిలో టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేలు కూడా బాగా హైపర్‌గా ఉన్నారట. ఇది కూడా సీఎం కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మీద ఇంత భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

Read Also: Street Vendor: ఈ పకోడీలు వద్దు బాబోయ్.. వేడి నూనెలో ఆయిల్ ప్యాకెట్లు ముంచుతున్న వీధివ్యాపారి (వీడియో)

సాధారణంగా రెండు మూడేళ్ళ తర్వాత శాసనసభ్యుల మీద అసంతృప్తులు పెరుగుతుంటాయి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరో నెల నుంచే పరిస్థితి తేడాగా ఉందట. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే… ఇక ముందు ముందు ఎలా అన్న టెన్షన్‌ కూడా టీడీపీ, జనసేన అధిష్టానాలను వెంటాడుతున్నట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు ఒక వైపు పెరుగుతుంటే… చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, జనానికి మధ్య ఉన్న లింక్ కూడా తెగిపోతోందట. ఈ విషయంలో కూడా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఎమ్మెల్యేలు మారకుంటే… కొంప మునగడం ఖాయమని ఆయన అంచనాకు వచ్చేశారట. అందుకే నిత్యం వాళ్ళని హెచ్చరిస్తున్నట్టు చెబుతున్నారు.ఎమ్మెల్యే లు మారకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో సీఎంకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఆందోళనగా ఎమ్మెల్యేల్ని ఒకింత కఠిన స్వరంతోనే హెచ్చరిస్తున్నట్టు చెబుతున్నారు. కొత్తగా ఎన్నికైన వాళ్ళు సైతం చెలరేగుతున్నారని, అందుకే వన్‌ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని కూడా హెచ్చరిస్తున్నట్టు సమాచారం.

Read Also: No Trump Effect: నో ట్రంప్ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్..!

మరోవైపు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టినట్టు తెలిసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని డైరెక్ట్‌గా ఎమ్మెల్యేల ముందు పెట్టి ఏం చేద్దామో మీరే చెప్పండని ప్రశ్నిస్తున్నారట. మీరు సరి చేసుకోకుంటే నేను వదిలేసుకుంటానని కూడా చంద్రబాబు తేల్చి చెప్తున్నట్టు సమాచారం. తాను ఎలాగైతే తమ ఎమ్మెల్యేలతో మాట్లాడి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నానో… బీజేపీ, జనసేన కూడా అలాగే చేయాలని ఆ పార్టీ పెద్దలకు చెప్పారట చంద్రబాబు. కూటమిలో ఏ పార్టీ మీద ఆరోపణలు వచ్చినా మొత్తం ప్రభుత్వం మీదే ప్రభావం పడుతుంది కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండాలన్నది సీఎం అభిప్రాయం. తాజా కేబినెట్‌ మీటింగ్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి మంత్రులకు సైతం గట్టిగా చెప్పినట్టు తెలిసింది. మంచి పనులు, శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నా… కొంత మంది చేస్తున్న వ్యవహారాల వల్ల ఆ అభివృద్ధి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని, అలా జరక్కుండా ఉండాలంటే అంతా మారాల్సిందేనని క్లారిటీగా చెప్పేస్తున్నారట సీఎం.

Exit mobile version