Off The Record: నంద్యాల….. ఏ సీజన్‌లోనూ పొలిటికల్ హీట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ…. ఇక్కడి టీడీపీలో అయితే… ఆ డోన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే… తెలుగుదేశంలోని గ్రూప్‌వారే ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ…. అప్పుడప్పుడూ వీధికెక్కుతూ ఉంటుంది కూడా. మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై… పార్టీ పరువు రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు. ఈ విడత కొత్త కేరక్టర్ ఎంటరవడంతో… వ్యవహారం రక్తి కడుతోందట. తాజాగా నంద్యాలలో మంత్రులు వర్సెస్ భూమా ఫ్యామిలీగా మారిందట వ్యవహారం. రెండు గ్రూప్స్ మధ్య ప్రోటోకాల్ రగడ తెరపైకి వచ్చింది. నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్థానంలో ఆమె సోదరుడు, ఆళ్ళగడ్డ టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి హాజరవడమే లడాయికి ప్రధాన కారణంగా తెలిసింది.
జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌తో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌కు జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరిత అటెండ్ అయ్యారు. కారణం ఏదన్నాగానీ.. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల మీటింగ్‌కి రాకపోగా… ఆమెకు బదులు తమ్ముడు విఖ్యాత్ వచ్చారు. సరే… వచ్చిన వ్యక్తి మామూలుగా ఉన్నారా… అంటే ఏదీ లేదు. ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా.. మంత్రులు , ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చుని వివిధ అంశాలపై అధికారుల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారట. ఇక్కడే మిగతా వాళ్ళకి మండిపోయిందని అంటున్నారు. అక్క రాకుంటే ఆమెకు బదులు తమ్ముడు రావడానికి ఇదేమన్నా… కుటుంబ కార్యక్రమమా? లేక పేరంటమా? ఎలాంటి అధికారిక హోదా లేకుండా విఖ్యాత్‌రెడ్డి వేదిక మీద కూర్చుని అధికారుల్ని ఎడాపెడా ఎలా ప్రశ్నిస్తారంటూ… మంత్రులు సహా మిగతా నేతలంతా ఫైరైపోతున్నట్టు సమాచారం. ఇదే విషయమై ముఖ్యమంత్రి ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారట మంత్రులు. అలాగే విఖ్యాత్ విషయమై జిల్లా కలెక్టర్ కూడా ఒకింత నొచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద నిఘావర్గాల సమాచారం కూడా సీఎంవోకు చేరినట్టు తెలుస్తోంది.
నంద్యాల జిల్లా టీడీపీలో ఈ వివాదం మొదటిది కాదు, చివరిది అంతకంటే కాదు అనే టాక్ టీడీపీ వర్గాల్లోనే నడుస్తోందని అంటున్నారు. ఇక్కడ మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డికి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. ఫరూక్, అఖిల మధ్య అనేక సందర్భాల్లో విబేధాలు వచ్చాయి. అయితే అవి ఎప్పుడూ టీ కప్పులో తుఫానులా సమసిపోతుండేవి. కానీ… ఇప్పుడు మాత్రం మేటర్ డైరెక్ట్‌గా సీఎంవో దృష్టికే వెళ్ళడంతో… ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. అంతకు ముందు నంద్యాలలో అఖిలప్రియ టీడీపీ ఆఫీస్ ప్రారంభించినప్పుడు కూడా ఫరూక్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ నేతగా ఉన్న అఖిల నంద్యాలలో సొంతగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటని అప్పట్లో ప్రశ్నించారు ఫరూక్. అయితే….టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా తాను ఎక్కడికైనా వెళ్తానని, ఆళ్లగడ్డ నాదే….నంద్యాల నాదే అంటూ ఆమె కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అటు విజయ డైరీ వ్యవహారంలోనూ మంత్రులు ఇద్దరికి, ఎమ్మెల్యేకి మధ్య విబేధాలు మామూలుగా లేవట. విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి కి పరోక్షంగా మంత్రులు సహకరిస్తున్నారంటూ టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట భూమా. ఇలా తరచూ టీడీపీ లో అంతర్గత పోరు తరచూ ప్రత్యక్షంగా, పరోక్షంగా బయటపడుతూనే ఉంది. అయితే తాజాగా మాత్రం అధికారిక సమావేశంలో ఎలాంటి హోదా లేని ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి వేదిక మీద కూర్చోవడం, కలెక్టర్ కూడా హర్ట్ అవడం లాంటి పరిణామాల మధ్య వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి పెరిగింది పొలిటికల్ సర్కిల్స్‌లో.