Off the Record: లావు శ్రీకృష్ణదేవరాయలు….. పార్టీలు వేరైనా…వరుసగా రెండు సార్లు నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు. 2019లో తొలిసారి వైసీపీ తరపున, 2024లో టీడీపీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారాయన. అంతవరకు బాగానే ఉన్నా… తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు కనిపించినా…. కొన్నాళ్ల తర్వాత ఎంపీ పేరు వివాదాల్లో వినిపించింది. పార్టీలో వర్గాలను ప్రోత్సహించినట్టు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనితో ఎంపీ లావుకు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. శ్రీకృష్ణదేవరాయులు వినుకొండకే చెందిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావును ప్రోత్సహిస్తూ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించేవారు బొల్లా. ఇక విడదల రజనితో అయితే ఈ విబేధాలు మరింత రచ్చకెక్కాయి. ఏకంగా ఆమె ఫోన్ పై నిఘా పెట్టడంతోపాటు… ఓ డీఎస్పీ సాయంతో… కాల్ లిస్ట్‌ను కూడా తెప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది.
Read Also: Off The Record: కవిత ఫోన్ కూడా ట్యాపింగ్? అందుకే కామ్గా ఉన్నారా?
అలాగే ఆమెకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను ప్రోత్సహించారని కూడా రజనీ వర్గీయులు ఆరోపించారు. ఇక గురజాలలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించినట్టు చెప్పుకున్నారు. ఇలా అప్పట్లో సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు లావు. అలా ఐదేళ్ళు గడిచిపోగా… 2024 ఎన్నికలకు ముందు సీటు విషయంలో తేడా వచ్చి… వైసీపీని వీడి టీడీపీలో చేరారు లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేట నుంచే టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు. పార్టీ మారే సమయంలో తనతోపాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చారు ఎంపీ. ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఎంపీ లావును టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. ఇక తనతోపాటు వచ్చిన అనుచరులకు కూడా పార్టీలో గుర్తింపులభించేలా జాగ్రత్తలు తీసుకున్నారాయన. జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డ్ మెంబర్ పదవి దక్కడంలో ఎంపీ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు మక్కెన మల్లిఖార్జునరావుకు కూడా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పదవిని ఇప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను వైసీపీ నుంచి టీడీపీలోకి రప్పించడంలో కూడా లావుదే కీలకపాత్ర అంటారు.
Read Also: Mumbai: రన్నింగ్ ట్రైన్‌లో డోర్ దగ్గర నిలబడి.. రక్తం వచ్చేలా కొట్టుకున్న యువతులు(వీడియో)
అంతవరకు బాగానే ఉన్నా…. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇటీవల పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును విమర్శించారు. వైసీపీ నేత శంకరరావు టీడీపీలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ప్రయత్నించారని, ఓటమి తర్వాత కూడా ఆయన ఓ ట్రయల్ వేసినట్టు చెప్పారు ప్రవీణ్. కొద్ది రోజుల ముందు కూడా టీడీపీలో చేరేందుకు కొంత మంది నాయకులతో మాట్లాడినట్టు ఆరోపించారాయన. ఈ ఆరోపణలే ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు నంబూరు శంకరరావుకు, శ్రీకృష్ణదేవరాయులుకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ కోణంలోనే…శంకరరావును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ ద్వారా ప్రయత్నాలు జరిగాయన్నది టీడీపీ నేతల మాట. వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీ లావుకు విబేధాలు ఉండేవి. టీడీపీలోకి వెళ్ళాక కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారని, ఎమ్మెల్యే ప్రవీణ్ ఆరోపణలతో ఈ విషయం బోధపడుతోందని చెప్పుకుంటున్నాయట టీడీపీ శ్రేణులు. ఇక్కడ కూడా అలాగే మళ్ళీ విభేదాలు మొదలవుతాయా అన్న భయాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని అంటారు. దీంతో…. ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయోనన్న ఆందోళన పెరుగుతోందట టీడీపీ కేడర్‌లో.