Off The Record: వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక…. ఇటు ఇంటికి, అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న కేడర్ చెల్లాచెదురవుతోందట. దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ కేడర్‌ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తలకెత్తుకున్నారట. వైసీపీ దూరం పెట్టాక… అడపదడప మినహా… టెక్కలికి దూరంగానే ఉంటున్నారట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అందుకే… ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేలా ఆయన భార్య పావులు కదుపుతున్నట్టు సమాచారం. గతంలో… ఒకే పార్టీలో ఉన్నా… పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఎవరికి వారే అన్న తీరుగా ఉండటంతో పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పుడు దువ్వాడ రాజకీయాలకు దూరమైనా…. గతంలో ఢీ అంటే ఢీ అనుకున్న వైసీపీలోని రెండు వర్గాలు ఒకే ఒరలో ఇమడలేకపోతున్నాయి. రెండు వర్గాల మధ్య విభజన రేఖ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఇక కుటుంబ గొడవలతో… భర్తకు దూరం ఉండటం మొదలయ్యాక… దువ్వాడ వాణి కూడా…. రాజకీయంగా పేరాడ తిలక్‌కు మద్దతిస్తూ వచ్చారు. తిలక్‌కు వరుసకు సోదరి అవుతారు వాణి. ఇప్పుడు అక్కా తమ్ముడు కలిసి టెక్కలి వైసీపీని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట. పేరాడకు కేడర్ బలం లేదని కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న సంగతి తెలిసిన వాణి… ఇక తన బ్యాక్‌గ్రౌండ్ తిలక్‌కు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కుటుంబ సమస్యలతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దువ్వాడ వాణి… తన భర్త, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌తో కోర్ట్‌లో పోరాడుతూనే.. ఆయన్ని ప్రజా కోర్ట్‌లో దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారట. ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవుతూనే… నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్‌గా ఉన్న పేరాడ తిలక్‌కు సాయం చేస్తానంటున్నారట వాణి. రాజకీయ ఎత్తుగడల్లో అనుభవం ఉన్న వాణి… తన భర్త దూరం అయ్యాక వచ్చిన గ్యాప్‌ని ఫిల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇన్ని రోజులు రెండు మూడు వర్గాలుగా ఉన్న టెక్కలి వైసీపీని ఒక్క తాటి మీదికి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టినట్టు సమాచారం.
మనలో మనకు విభేదాలు కాదు…. బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వెళ్ళాలని కేడర్‌కు సూచిస్తున్నారట. సీరియస్ పాలిటిక్స్‌ని పక్కనపెట్టి… వేరే వ్యవహారాల్లో మునిగి తేలుతున్న దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. అటు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నా… పేరాడ తిలక్‌కు ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదట. దీంతో… సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దువ్వాడ వాణి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇటు పార్టీకి, అటు వ్యక్తిగతంగా ఆమె ఇప్పుడు అక్కరకొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. భర్తతో విభేదించిన దువ్వాడ వాణి… సైలెంట్ అవుతారని భావించారు అంతా. కానీ… కొద్దిరోజులు ఇంటికే పరిమితం అయిన ఆమె…. తిలక్‌కు కేడర్ సహాయనిరాకరణ, వర్గాలతో పార్టీ బలహీనపడటం లాంటి వ్యవహారాలతో తిరిగి యాక్టివ్ అయినట్టు చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు. ఇక మెల్లిగా శ్రీనివాస్ అనుచరులు కూడా వాణి వెంట నడిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జడ్పీటీసీగా ఉన్న వాణి… తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి రావడం, మొదటి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు పంటికింద రాయిలా మారిన పేరాడ తిలక్‌తో కలిసి పనిచేయడం ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్ళు టెక్కలి నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షంలా ఉండేవి వైసీపీలోని రెండు గ్రూపులు. ఇప్పుడు వాణి ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నందున… అదే జరిగితే తమకు తిరుగుండదని అనుకుంటున్నారట కార్యకర్తలు. పార్టీ ఇన్ఛార్జ్‌గా ఎవరుంచే వాళ్ళకు సపోర్ట్ చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు వాణి అనుచరులు. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ తిరిగి యాక్టివ్ అయితే…. టెక్కలి వైసీపీలో ముందు ముందు ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు.