Off The Record: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే… అవి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాదు. అలాంటి పోరు ఉంటే… అది షరా మామూలే. కానీ… ఇక్కడ మాత్రం కాస్త తేడాగా ఉందట. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేంద్రంగా నడుస్తున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు దువ్వాడ. కానీ… కొన్నాళ్ళుగా… వ్యక్తిగత వివాదాలు, కుటుంబ వ్యవహారాలతో కిందా మీదా పడుతున్నారాయన. ఆ క్రమంలోనే… వైసీపీ అధిష్టానం దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఒకప్పుడు వైసిపి అధినేత జగన్ అంటే… తన ప్రాణం అని, ఆయన దేవుడంటూ ఆకాశానికెత్తిన ఎమ్మెల్సీ… పార్టీ నుంచి దూరం పెట్టేసరికి మాట మార్చేశారన్నది లోకల్ టాక్. నాటి దేవుడే నేడు దయ్యమైనట్టున్నారని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. అదే సమయంలో మంత్రి లోకేష్‌ను పొగిడేయడం, లవ్వాస్త్రాలు సంధించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది.
Read Also: Off The Record: అరెరె.. ఛాన్స్ మిస్సయిందే..!
వైసీపీలో ఉంటుండగానే.. లోకేష్‌ని పొగడం కూడా ఆయన్ని పార్టీకి దూరం చేశాయని అంటారు. సరే… జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దువ్వాడ రాజకీయ భవిష్యత్ ఏంటని అంటే… ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే అన్నది ఆయన సన్నిహితుల మాట. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా, ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటంతో మొదట్లో…. నైరాశ్యంలో ఉండిపోయారట. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గంభీరంగా డైలాగ్స్ చెప్పినా…రాజకీయం తప్ప వేరే వ్యవహారం, వ్యాపారం తెలియని దువ్వాడకు మొదట్లో అగమ్యగోచరంగానే ఉండేదట. మంత్రి లోకేష్‌ని పొగిడినా… టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఉన్నారు. జనసేనతో టామ్ అండ్ జెర్రీ వార్ ఎలాగూ ఉంది. అందుకే గందరగోళంలో ఉండేవారని, మెల్లిగా కోలుకున్నాక ఇప్పుడు ఇండిపెండెంట్ ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు టెక్కలిలో. ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ పదవీ కాలం 2027 మార్చి వరకూ ఉంది. వైసీపీ హయాంలో చేసిన పోర్ట్ కాంట్రాక్ట్‌లతో గట్టిగానే వెనకేసుకున్నారన్నది లోకల్ టాక్.
Read Also : Nandigam Suresh: జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్.. వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ క్రమంలోనే… దువ్వాడ సన్నిహితురాలు మాధురి వస్త్ర వ్యాపారంలోను, ఆయన రాజకీయాల్లోను కొనసాగాలని అనుకుంటున్నారట. వైసీపీ దూరం పెట్టింది, టీడీపీ, జనసేనల్లో ఛాన్స్ లేదు. అందుకే… ఆయన ఇండిపెండెంట్ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. చేతిలో డబ్బుంది, నియోజకవర్గంలో జనం బలం ఉంది. ఇక నాకు పార్టీలతో పనేముందని ఆయన అంటున్నట్టు సమాచారం. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేసుకుంటున్నారట. గ్రౌండ్ లెవల్‌లో ఉన్న స్థానిక నేతలు, అనుచరులకు ఆవిధంగా హింట్ ఇచ్చేసినట్టు సమాచారం. మాధురి, దువ్వాడ దగ్గర డబ్బు దండిగా ఉందన్నది టెక్కలి పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని ప్రతి వ్యవహారం దువ్వాడ శ్రీనివాస్ కనుసన్నలలోనే నడిచింది. ఇప్పుడు ఆయన బలం కూడా ఆ డబ్బేనని, వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఆలోచనలు రావడానికి అదే కారణం అన్నది లోకల్ వాయిస్.తమ నాయకుడు రాజకీయాలను వదిలేసే ప్రసక్తే లేదని అంటున్నారట ఆయన మనుషులు. మాధురి వ్యాపారంలో, శ్రీనివాస్ రాజకీయంలో ఉండాలని ఫిక్స్ అయిపోయి అడుగులేస్తున్నారన్నది టెక్కలి టాక్. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే కాబట్టి… నాలుగేళ్ళ పాటు ఈ నిర్ణయాలు ఇలాగే ఉంటాయా? మధ్యలో మారతాయా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.