గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వీడియోల్లో ఒక వర్గాన్ని దూషించినట్టు తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. అయితే, ఆ విమర్శలు కేవలం ప్రత్యర్థులు, ఇతర మతాల వాళ్లు మాత్రమే చేయలేదు. స్వయంగా ఆయన పార్టీ అధిష్టానం కూడా ఆ వీడియోలను సీరియస్‌గానే తీసుకుంది. అప్పుడప్పుడే నూపుర్ శర్మ వివాదం నుంచి తేరుకుంటున్న బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ వ్యవహారం మరో తలనొప్పిగా మారకూడదని నిర్ణయించుకుంది. అందుకే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వివరణ అడిగింది.
Read Also: Off The Record: వైసీపీ ఓపెన్ ఆఫర్..! ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారా?
తెలంగాణ ప్రభుత్వం కూడా రాజాసింగ్ అంశాన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించింది. ఏకంగా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. తర్వాత హైకోర్టు పీడీ యాక్ట్‌ను కొట్టేసింది. ఆయన జైలు నుంచి బయటకొచ్చారు. అయినప్పటికీ రాజాసింగ్ కదలికలపైనా, మాటలపైనా, సోషల్ మీడియా యాక్టవిటీ పైనా ఆంక్షలను పెట్టింది న్యాయస్థానం. ఇటు బీజేపీ అధిష్టానానికి రాజాసింగ్ ఇచ్చిన వివరణలో ఆయన ఎలాంటి పశ్చాత్తాపాన్నీ వ్యక్తం చేయలేదు. అసలు తన వీడియోలకి మతానికి సంబంధంలేదని ఆ వివరణలో చెప్పారు. ఆ వివరణ ఇచ్చి కూడా నెల 15 రోజులు అవుతుంది. ఇప్పుడు బంతి కేంద్ర బీజేపీ కోర్టులో ఉంది. ఆయనపై సస్పెన్షన్ ఇంకా ఎత్తేయలేదు. ఈ మధ్యలో రాజాసింగ్ భార్య కూడా బిజెపి నేతలతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెకు భరోసా ఇచ్చారు.
Read Also: Off The Record: రసకందాయంలో నల్లగొండ రాజకీయం.. రూటు మార్చేసిన ఎమ్మెల్యే..
బీజేపీ నేతలు చెప్పినట్టు.. వారి సూచనల మేరకే రాజాసింగ్ రిప్లయ్ ఇచ్చారని.. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని కొందరు రాష్ట్ర నేతలు అంటున్నారు. మునుగోడు పోలింగ్ కన్నా ముందే సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆ వర్గం ఆశపడింది. ఈ నెల 28 నుండి బండి సంజయ్ ఐదో విడత సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఆ యాత్రను హిందూ సెంటిమెంట్ ప్రభావం ఉన్న భైంసా నుండి ప్రారంభం అవుతున్న తరుణంలో మరోసారి రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం చర్చకొచ్చింది. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం రాజాసింగ్ అంశాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని అర్థమవుతోంది. నూపుర్ శర్మ సస్పెన్షన్‌తో రాజాసింగ్ ఇష్యూ కూడా ముడిపడి ఉండడం.. దేశానికి అంతర్జాతీయ సంబంధాలతో లింక్ ఉండడంతో రాజాసింగ్ చేసిన పని చిన్నదేం కాదని జాతీయపార్టీ భావిస్తోందని అనుకోవాలి.