NTV Telugu Site icon

Off The Record: బీజేపీ వైపు మెగాస్టార్ అడుగులు..? డిసైడయ్యారా..? కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?

Chiranjeevi

Chiranjeevi

Off The Record: అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో చెప్పిన ఈ డైలాగ్‌ చిరంజీవి ఇప్పుడు వేస్తున్న పొలిటికల్‌ స్టెప్స్‌కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్‌. కాశీకి వెళ్ళకున్నా… కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని అంటున్నారు. కాకుంటే… ఇది రాజకీయ కాషాయం. ఇక వారణాసిలో బతకకున్నా… తన రాజకీయ వరస మాత్రం మార్చుకోబోతున్నారట. గడిచిన కొద్ది రోజులుగా మెగాస్టార్ వేస్తున్న అడుగులు చూస్తుంటే… అవి బీజేపీ వైపునకు పడుతున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. తమ్ముడు పొత్తు కుదుర్చుకున్న పార్టీతో దోస్తానీ వెనక అసలు కథేంటన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఈ మధ్య కాలంలో ఎక్కడా బహిరంగంగా రాజకీయాలు మాట్లాడకున్నా… బీజేపీ నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో పాల్గొనడం చూస్తుంటే… పొలిటికల్‌ రీ ఎంట్రీ దిశగా చిరంజీవి ఒక లైన్ తీసుకున్నట్టు కనబడుతోందని అంటున్నారు పరిశీలకులు.

Read Also: H-1B Visas: అమెరికన్‌ ఉద్యోగులకు హెచ్‌-1బీ వీసా ముప్పు.. చట్ట సవరణకు ప్రతిపాదన

సొంత పార్టీ పెట్టుకుని చేరుకోలేని లక్ష్యాన్ని తమ్ముడితో పొత్తున్న పార్టీలో చేరి సాధించాలని చిరంజీవి అనుకుంటున్నారా అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హాట్‌. అదీకూడా అలా ఇలా కాదు. యమయమా హాట్‌హాట్‌గా నడుస్తోందట. ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చిరంజీవి హాజరవడం, అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పొత్తున్న పవన్‌తో పాటు చిరంజీవితో కూడా సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో… ఇక మెగాస్టార్‌ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారానికి ఊతమిచ్చినట్టు అవుతోందని అంటున్నారు. తన సొంత పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశాక ఆ పార్టీ తరపున కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి. ఇక కాంగ్రెస్ అధికారం నుంచి దూరమవగానే.. ఆయన కూడా దశలవారీగా దూరమవుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో అయితే… అసలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం గాని.. ఆ పార్టీ కూడా ఆయన్ని పిలిచిన దాఖలాలు గాని లేవు. పవన్ కళ్యాణ్ ఏపీలో యాక్టివ్ అయ్యాక కాంగ్రెస్ కూడా చిరంజీవిని పెద్దగా రాజకీయ కార్యక్రమాలకు ఆహ్వానించింది లేదు. ఇక పవన్‌ కూటమిలో భాగస్వామి అయ్యాక కాంగ్రెస్‌ వైపు చూడటం పూర్తిగా మానేశారట చిరంజీవి. కొన్నాళ్లు సినిమాలపై దృష్టి పెట్టిన మెగాస్టార్‌ ఇప్పుడు తిరిగి పాలిటిక్స్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Read Also: Pushpa -2 : నేటి నుంచి థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్ వెర్షన్

అయితే… ఇది ఎప్పుడు? ఎలా ఉంటుందన్న విషయంలో మాత్రం ఇప్పటికింకా క్లారిటీ లేదట. కానీ… తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అండగా ఉంటానని సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పకనే చెబుతున్నారు చిరంజీవి. అందుకే ఏపీ పాలిటిక్స్ లో అన్నదమ్ములిద్దరూ ఒకే వేదిక మీద ఉంటారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. సాధారణంగా చాలా దూరపు ఆలోచనతోనే ఇలాంటి ఎత్తుగడను అమలు చేస్తూ ఉంటుంది ఆ పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ మీద పట్టు బిగించాలని టార్గెట్‌ పెట్టుకున్నారట కమలనాధులు. అందుకు మెగా బ్రదర్స్‌ని ఉపయోగించుకునే ఆలోచన ఉందని, ఆ క్రమంలోనే చిరంజీవి ప్రస్తావన తెస్తున్నట్టు కనబడుతోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం సూచిస్తే… ఆయన తెలంగాణలో కూడా ప్రచారం చేసే అవకాశాలే ఎక్కువ. ఇక చిరంజీవిని కూడా దగ్గరకు తీస్తే…. బ్రదర్స్ ఇద్దరితో తెలంగాణలో రాజకీయం చేయవచ్చని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా…. మెగాస్టార్‌ పొలిటికల్‌ రీ ఎంట్రీపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. రావడం అంటూ జరిగితే అది ఖచ్చితంగా బీజేపీ నుంచేనన్నది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. దీనికి ఆయన వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రచారాన్ని కొన్నాళ్ళ పాటు చిరంజీవి కూడా ఎంజాయ్ చేస్తారా..? లేక తన ఉద్దేశ్యం ఏంటో చెప్పి ఫుల్‌ స్టాప్‌ పెడతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.