NTV Telugu Site icon

Off The Record: మెగా కాంపౌండ్ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా రాజుకుంటోందా..? కథ మళ్లీ మొదటికొచ్చిందా?

Mega Family Vs Allu Family

Mega Family Vs Allu Family

Off The Record: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తగ్గేదే లే… అంటున్నారా? తన పాపులర్‌ సినిమా డైలాగ్‌ని ప్రాక్టికల్‌గా కూడా ఆచరించి చూపిస్తున్నారా? నిజ జీవితంలో కూడా నేనింతే.. నా స్టైల్‌ అదే.. తగ్గేదే లేదంటున్నారా? అదే విషయాన్ని అవతలి వాళ్ళకు డైరెక్ట్‌గా.. క్లియర్‌గా అర్ధమయ్యేలా చెబుతున్నారా? అంటే.. ఎస్‌ అన్నదే విశ్లేషకుల సమాధానం. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి, ఇష్టపడేవాళ్ళ కోసం నిలబడాలి, మనసుకు నచ్చితే వస్తా. ఇదే… మూడు ముక్కలుగా చెప్పిన ఈ ఒక్క మాటే… ఇప్పుడు వంద ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఆల్రెడీ ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా సమాధానాలు చెబుతున్నట్టుగా ఉందంటున్నారు అనలిస్ట్‌లు. ఈ మాటలు విన్నవాళ్ళందరికీ ఇప్పుడు అల్లు అర్జున్‌ మెగా కాంపౌండ్‌కి డైరెక్ట్‌ సందేశం పంపారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట. మెల్లిగా తెరలు తొలుగుతున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

దీంతో మెగా కాంపౌండ్‌ వర్సెస్‌ అల్లు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. రెండు కుటుంబాల మధ్య పైకి కనిపించని అగాధమేదో పెరిగిపోతోందని చాలా రోజులుగా ఊహాగానాలున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అదే ఇండికేషన్‌ ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలో అది పీక్స్‌కు చేరి రచ్చ అయింది. నాడు ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న టైంలో అల్లు అర్జున్‌ నంద్యాల టూర్‌పై వంద సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ ఎన్నికల్లో డూ ఆర్‌ డై అన్నట్టుగా పోరాడాయి వైసీపీ, కూటమి పార్టీలు. అందులోనూ.. ఈసారి వైసీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వబోనని శపథం చేసి తాను ఎక్కడ తగ్గాలో తెలుసుకుని మరీ… చివరికి నెగ్గారు పవన్‌కళ్యాణ్‌. ఆయన పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో పలువురు టాలీవుడ్‌, టీవీ నటులు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. పవన్‌ తరపున ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం గతానికి భిన్నంగా ఈసారి ఓపెనైపోయి పవన్‌కు బాసటగా నిలబడింది.అయితే… అదే టైంలో అల్లు అర్జున్‌ వ్యవహార శైలి మీద రకరకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన పిఠాపురం వైపు చూడలేదు సరే… జనసేన ప్రత్యర్థిగా భావించే వైసీపీ తరపున నంద్యాలలో పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించారు. పోలింగ్‌కు ముందు ఆయన ఇంటికి వెళ్ళిమరీ హంగామా చేశారు.

తనవాళ్ళు ఎక్కడున్నా వెళ్తానని, వాళ్ళ మేలు కోరుకుంటానని అప్పుడు అన్నారు అల్లు అర్జున్‌. అక్కడే అందరికీ డౌట్‌ కొట్టింది. అంటే … పవన్‌కళ్యాణ్‌ ఆ… తనవాళ్ళ లిస్ట్‌లో లేరా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. శిల్పా రవి కోసం నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్‌… పవన్‌కు మద్దతుగా కేవలం ఒక ఎక్స్‌ మెస్సేజ్‌తో సరిపెట్టడం ఏంటన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తం అయ్యాయి. అంటే.. ఇద్దరి మధ్య పైకి కనిపించని అగాధం ఉందా? ఆధిపత్య పోరు నడుస్తోందా అన్న ప్రశ్నలు సైతం వచ్చాయి. దానికి కొనసాగింపుగా నాగబాబు పెట్టిన మరో మెస్సేజ్‌ ఇంకా కాక రేపింది. మేలు కోరే వాడు పరాయివాడైనా మనోడే.. కోరని వాడు మనోడైనా పగోడేనంటూ పెట్టిన మెస్సేజ్‌తో లోలోపల ఏదో జరిగిపోతోందన్న డౌట్స్‌ ఇంకా పెరిగిపోయాయి. తర్వాత నాగబాబు డిలీట్‌ చేసినా జనంలో పెరగాల్సిన డౌట్స్‌ మాత్రం పెరిగిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు మేటర్‌ మర్చిపోయారు అంతా. కానీ.. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ అగ్గి అంటుకుందని అంటున్నారు. డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య సమర్పణలో రిలీజ్‌ అవబోతున్న సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాజా వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్‌.

మనసుకు నచ్చితే వస్తా, ఇష్టపడేవాళ్ళ కోసం నిలబడాలి అన్న అల్లు వ్యాఖ్యల చుట్టూనే తిరుగుతోంది చర్చ మొత్తం. నాడు ఎన్నికల టైంలో పవన్‌ పక్కన ఆయన నచ్చకనే నిలబడలేదా? అందుకే మరీ బాగుండదనుకుని మామకు మద్దతుగా జస్ట్‌ ట్వీట్‌ చేసి వదిలేశారా? ఇష్టమైన శిల్పా రవి దగ్గరికి నేరుగా వెళ్ళారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల పవన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తున్నాయి. గతంలో అడవుల్ని కాపాడేవాళ్ళు హీరోలని, ఇప్పుడు సినిమాల్లో హీరోలు అటవీ సంపదను స్మగ్లింగ్‌ చేస్తున్నారని అన్నారాయన. ఆ మాటల వెనక పవన్‌ ఉద్దేశ్యం ఏదైనా…. నేరుగా వెళ్ళి అల్లు అర్జున్‌ సినిమా పుష్పకే తగిలాయి. ఆ మాటల్ని, ఇప్పుడు అల్లు మాటల్ని కలిపి చూస్తే…. అగాధం చాలా లోతుగానే ఉందనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, మీరు అనవసరంగా ట్రోలింగ్‌ చేయవద్దని ఆ మధ్య అన్నారు నటుడు హైపర్‌ ఆది. మెగా కాంపౌండ్‌కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఆది మాటలతో మేటర్‌ సెటిల్‌ అయిపోయి ఉండవచ్చని అనుకున్నారు అంతా. కానీ… మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట రాజకీయ వర్గాల్లో. మరి ఈ మాటలు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయో, ఇందుకు మెగా కాంపౌండ్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.