Site icon NTV Telugu

Off The Record: బీఆర్‌ఎస్‌లో భారీ ప్రకంపనలు రాబోతున్నాయా..? బీజేపీ నేతకు ముందే ఎలా తెలిసిపోతున్నాయి?

Maheshwar Reddy

Maheshwar Reddy

Off The Record: కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, ఇక నుంచి ఆ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటూ కొద్ది రోజులుగా రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఒకరు, శాసనసభాపక్షం చీలిపోతుందని మరొకరు మాట్లాడుతున్నారు. దీంతో… బీఆర్‌ఎస్‌ కేడర్‌లో ఏదో తెలీని ఆందోళన, అంతకు మించిన గందరగోళం. అదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ సైతం నడుస్తోంది. బీజేపీ లీడర్స్‌ చెబుతున్నారు సరే… అసలు దానికి ప్రాతిపదిక ఏంటి? గాల్లో బాణాలు వేస్తున్నారా? లేక బీఆర్‌ఎస్ వైపు నుంచే లీకులు వస్తున్నాయా అన్న అనుమానాలు ఇటు రాజకీయ వర్గాల్లో సైతం పెరుగుతున్నాయట. అన్నిటికీ మించి బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యల మీదే ఎక్కువగా ఫోకస్‌ పెరుగుతోంది. కేసీఆర్‌, కేటీఆర్, హరీష్, కవిత మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం చీలిపోతుందని చెప్పారు మహేశ్వర్ రెడ్డి. అంతటితో ఆగకుండా… ఇతరత్రా చాలా వ్యవహారాల మీద చాలా మాట్లాడారాయన. హరీష్‌రావు, కవితకు సహకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని కూడా మరో బాంబు పేల్చారు.

Read Also: Theatres Closure : థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు నిర్మాతల ఒత్తిడి.. రంగంలోకి ఏపీ మంత్రి

తాజాగా బయటికి వచ్చిన కవిత లేఖ విషయాన్ని కూడా వారం క్రితమే ప్రస్తావించారు మహేశ్వర్‌రెడ్డి. కేసీఆర్‌ కుమార్తె తిరుగుబాటు బావుటా ఎగరేశారని ఆ సందర్భంలో ప్రస్తావించారాయన. కానీ… అప్పుడు ఆ మాటల్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు చాలామంది. రాజకీయ ఎత్తుగడల్లో ఇలాంటివన్నీ సాధారణమేనని, ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు చాలా మాట్లాడుతుంటారని అనుకున్నారట అంతా. కానీ… ఇప్పుడు స్వయంగా తండ్రికి కవిత రాసిన లేఖ బయటకు రావడంతో అంతా అవాక్కయినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు బీజేపీ నేతలకు ముందే ఎలా తెలిసిపోతున్నాయి? ప్రత్యేకించి తండ్రీ కూతుళ్ళ మధ్య ఉన్న లేఖ గురించి అందరికంటే ముందే మహేశ్వర్‌రెడ్డి ఎలా మాట్లాడగలిగారు? ఆయనేమన్నా బీఆర్‌ఎస్‌ జాతకాలు చెబుతున్నారా అంటూ… చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. అటు కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత విషయాలపై మాట్లాడుతున్నారు మహేశ్వర్‌రెడ్డి. అయన గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా పనిచేశారు. ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఈ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండవచ్చు, ఆ సోర్స్‌లో విషయాలు తెలియవచ్చుగానీ…. బీఆర్ఎస్‌లో, అందునా కేసీఆర్‌ కుటుంబంలో జరిగే వ్యవహారాల గురించి మహేశ్వర్‌రెడ్డికు ముందే ఎలా తెలిసిపోతోందని ఆరా తీస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Read Also: Ex CM Photo Controversy: ఫొటో వివాదం..! జడ్పీ సీఈవోపై వేటు

ఈ క్రమంలోనే ఒకరిద్దరికి కీలక సమాచారం తెలిసినట్టు చెప్పుకుంటున్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీలోని ఓ కీలక నేత మహేశ్వర్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఆ నేతతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలనే బీజేఎల్పీ లీడర్‌ బయట మాట్లాడి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే… బీఆర్‌ఎస్‌లో బలమైన కోవర్ట్‌లు ఉండి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్‌. ఇక కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత కూడా మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె తన సొంత అభ్యర్థుల్ని పెడుతుందంటూ… బీఆర్ఎస్‌ మీదికి ఒక మిసైల్‌నే వదిలారు. అలాగే… అతి త్వరలోనే ఆ పార్టీలో మరో ప్రకంపన రాబోతోందంటూ జోస్యం చెప్పేస్తున్నారాయన.పైగా…. నేను గాలి మాటలు మాట్లాడటం లేదు. సాలిడ్‌ సమాచారంతోనే చెబుతున్నానని అనడం కలకలం రేపుతోంది. ఇలా మహేశ్వర్‌రెడ్డి ముందే కారు పార్టీ జాతకం మొత్తాన్ని చదివేస్తుండటంతో… ఈయన ఏమన్నా… ఆ పార్టీ ఆస్థాన జ్యోతిష్యుడా అంటూ సెటైర్స్‌ సైతం పేలుతున్నాయి. మొత్తం మీద మహేశ్వర్‌రెడ్డి చెప్పిన ఆ ప్రకంపన ఏంటోనని ఇటు బీఆర్‌ఎస్‌ కేడర్‌, అటు తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Exit mobile version