Off The Record: కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సరిహద్దుల మధ్య హంద్రి నదిపై కాజ్‌వే, రహదారి నిర్మాణం… ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య ఈ వంతెన నిర్మాణం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ పంచాయితీని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్చాల్సి వచ్చిందట. కోడుమూరు మండలం గోరంట్ల- పత్తికొండ నియోజకవర్గం ఎస్.హెచ్. ఎర్రగుడి మధ్య హంద్రీనదిపై 330 మీటర్ల పొడవునా కాజ్ వే, కొత్తపల్లి వరకు 5.9 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 21 కోట్లతో భూమిపూజ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ కాజ్ వే వల్ల పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలో 12 గ్రామాల ప్రజలకు… బళ్లారి, కోడుమూరు, కర్నూలు వెళ్లేందుకు సుమారు 16 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. స్కూలు, కాలేజీలు, ఆసుపత్రి, రైతుల పంటల రవాణాకు ఈ కాజ్ వే నిర్మాణం అవసరమని జగన్ పాదయాత్ర సమయంలో కృష్ణగిరి మండల ప్రజలు కోరారట. అధికారంలోకి వస్తే ఈ వంతెన నిర్మిస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారట. ఆ మేరకు నిధులు మంజూరు చేసి భూమి పూజ చేశారట. ఈ కాజ్ వే కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాలకు సగం సగం వస్తుంది.
Read Also: Off The Record: సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు? కొత్తవారికి అవకాశం ఉంటుందా?
అయితే అంతకుముందే… హంద్రి నదిపై కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పంచాయితీ పెట్టుకున్నారట. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించింది తానంటే.. కాదు తానే అని పేచీకి దిగారట. తానే మంజూరు చేయించుకున్నానని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పట్టుబట్టారు. ప్రతిపాదనలు కూడా కోడుమూరు నుంచే పంపించామని సుధాకర్ వాదనగా ఉంది. అయితే పత్తికొండ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని పాదయాత్ర సమయంలో జగన్‌కు చెప్పి హామీ కూడా తీసుకున్నామనీ, ఈ బ్రిడ్జి అవసరం, ఉపయోగం తమ నియోజకవర్గ ప్రజలకే ఎక్కువగా ఉందనీ పత్తికొండ ఎమ్మెల్యే వాదించారట. జిల్లా అధికారులు కూడా ఈ ఇద్దరి పంచాయితీతో తలలు పట్టుకున్నారట. చివరికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని… కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల వద్ద భూమి పూజ చేసేలా ఒప్పించారని టాక్.
Read Also: Off The Record: రేవంత్ రెడ్డి పాదయాత్ర వేదిక ఎందుకు మారింది? సయోధ్య కుదరలేదా?
కాజ్ వే నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి… శిలాఫలకంపై తన పేరు చిన్న అక్షరాలతో కావాలనే రాయించారని కినుక వహించారట. భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయే ప్రయత్నం చేశారట. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని… ఎమ్మెల్యే శ్రీదేవికి నచ్చజెప్పి సభలో మాట్లాడి వెళ్లాలని కోరారట. ఇప్పటికే కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు… తన నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ కోట్ల హర్షతో తరుచూ ఏదోఒక విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతోనూ సుధాకర్ వివాదం తెచ్చుకున్నారనే చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదానికి కారణం బ్రిడ్జి మాత్రమే కాదని, వేరే కారణాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గీయులే గుసగుసలాడుతున్నారు. మరి అసలు కారణాలేంటో తెలియాలంటే… వేచిచూడాల్సిందే!