Off The Record: తెలంగాణలో అమృత్ టెండర్స్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నాయి బీఆర్‌ఎస్, బీజేపీ. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది విపక్షాల ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే.. తానము ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ విమానం ఎక్కారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. దాంతో ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఓ రేంజ్‌లో హైప్ వచ్చింది. ఈ విషయంలో తమ అధినాయకత్వం చాలా సీరియస్‌గా ఉందని, సంగతేందో.. ఢిల్లీలోనే తేల్చుకుంటారంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఉత్కంఠగా చూశాయి. కట్ చేస్తే… అసలు కేటీఆర్ టూరే వివాదాస్పదం అవడం ఇక్కడ కొసమెరుపు. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? ఏం చేసి వచ్చారంటూ చర్చించుకుంటున్నాయట రాజకీయ వర్గాలు.
Read Also: IT Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
అసలు కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిశారా? లేదా? అన్న అనుమానం రావడమే అన్నిటికీ మించిన వివాదం అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సంబంధిత శాఖ మంత్రిగా ఖట్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశామని, ఇక ఢిల్లీకి తరచూ వస్తాం… రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తుంటామని చెప్పారు కేటీఆర్. కానీ.. కేంద్ర మంత్రితో అసలు కేటీఆర్ భేటీ జరగలేదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలతో కొత్త వివాదం రేగింది. మాజీ మంత్రి ఢిల్లీ వెళ్లిన ఉద్దేశ్యం వేరని, అమృత్ టెండర్స్‌పై మేం ఇప్పటికే మాట్లాడాం.. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పేదేం లేదన్నది తెలంగాణ బీజేపీ నేతల వెర్షన్‌గా తెలిసింది. అసలు కొందరు నాయకులైతే.. ఇంకో అడుగు ముందుకేసి కేటీఆర్ ఎప్పుడు, ఎవర్ని కలిసి ఫిర్యాదు చేశారు? అందుకు సాక్ష్యం ఏంటి? కనీసం ఫోటో ఉంటే చూపించాలంటూ సవాల్ చేస్తుండటంతో.. పొలిటికల్ హీట్ పెరిగిపోవడంతో పాటు మేటర్ కొత్త టర్న్ తీసుకుంటోంది.
Read Also: PM Modi : దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గిరిజనుల గొప్ప సహకారం ఉంది : ప్రధాని మోడీ
కేటీఆర్‌కు కనీసం కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, అయినాసరే.. కలిసి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం చేసేసుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు కాషాయ నేతలు. పైగా.. ఈ కల్పిత సమావేశం గురించి మాట్లాడే బదులు అసలు కేటీఆర్ ఏ అజెండాతో ఢిల్లీ వెళ్ళారో, అక్కడ కేంద్ర మంత్రులకు బదులు ఏ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారో చెక్ చేసుకుంటే మంచిదని రివర్స్ అవుతుండటంతో.. దాల్ మే కుఛ్ కాలా హై అన్న డౌట్స్ పెరుగుతున్నాయంటున్నారు పరిశీకులు. కేటీఆర్ మీద చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందని, దాన్నుంచి రక్షణ కోసమే ఆయన కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్ళారన్నది బీజేపీ నేతల ఆరోపణ. అసలు ఢిల్లీ నిర్మాణ్ భవన్‌లో నాలుగైదు మంత్రిత్వ శాఖలు ఉంటాయని, కేటీఆర్ ఏ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారో చెప్పాలని సవాల్ చేస్తున్నారట బీజేపీ లీడర్స్. మంత్రి ఖట్టర్ సంగతి తర్వాత కనీసం ఆయన ఆఫీసులోని ఒక అధికారితో దిగి ఫోటోనైనా బయటపెట్టమన్నది కాషాయ నేతల సవాల్. ఈ సవాళ్ళలో కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై సరికొత్త చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో.