Site icon NTV Telugu

Off The Record: టీడీపీ అధిష్టానానికి దూరంగా కోట్ల.. ఎందుకు టచ్‌ మీ నాట్‌..?

Kotla Surya Prakash Reddy

Kotla Surya Prakash Reddy

Off The Record: కోట్ల సూర్య ప్రష్‌రెడ్డి… ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. గతంలో కాంగ్రెస్ తరపున 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబం కోట్లది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సూర్య ప్రకాష్‌రెడ్డి. తర్వాత 2024 ఎన్నికల్లో డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారాయన. కానీ, కొంత కాలంగా టీడీపీ అధిష్టానానికి దూరంగా ఉన్నారట కోట్ల. ఈ విడత పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దల్ని కలిసిన సందర్భాలు చాలా తక్కువేనట. మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు మొదట్లో చెప్పుకున్నారు. కానీ… ఏడాది గడచినా ఆయన అధిష్టానంతో అంటీ ముట్టనట్టుగా ఉండటంతో…. అంతకు మించిన కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు.

Read Also: Kurnool : వివాహేతర బంధం.. వేట కొడవళ్లతో దాడి చేసి దారుణ హత్య..

ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది. డోన్ నియోజకవర్గంలో మాత్రం చురుగ్గా ఉంటుూ పార్టీ పెద్దల దగ్గరికి వచ్చేసరికి టచ్‌ మీ నాట్‌ అన్నట్టు ఉండటం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్బంగా విజయవాడలో నిర్వహించిన వేడుకల్లోనూ ఆయన పాల్గొనలేదట. మహానాడు కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే భార్య కోట్ల సుజాత మాత్రమే మహానాడుకు అటెండ్‌ అయ్యారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవాడలో పెద్ద ఎత్తున నిర్వహించినా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వెళ్లకపోవడంపై స్థానికంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీనియర్‌ నాయకుడిగా… అటు సీఎం చంద్రబాబునుగాని, మంత్రి లోకేష్‌నిగాని కలిసిన సందర్భాలు లేవంటున్నారు. దీంతో… అధిష్టానం అపాయింట్ మెంట్ దొరకలేదా, లేక అధిష్టానాన్ని కలవడానికి ఆయన ఆసక్తిగా లేరా అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రస్తుతం టీడీపీలో ఉన్న పరిస్థితులపై ఎమ్మెల్యే కోట్ల అసంతృప్తితో ఉన్నారన్నది లోకల్ టాక్. జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన తనను కేవలం డోన్ నియోజకవర్గానికి పరిమితం చేశారని కోట్ల ఫీలవుతున్నట్టు సమాచారం.

Read Also: Ameerkhan : ‘కూలీ’లో అమీర్ ఖాన్.. ట్విస్ట్ ఇస్తారా..?

ఇటు డోన్ నియోజకవర్గంలోనూ కొన్ని వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారని, ముఖ్యంగా తనతో విభేదిస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి చికాకు పెడుతున్నా నియంత్రించడం లేదనే అసంతృప్తి ఉందట సూర్యప్రకాష్‌రెడ్డికి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఫైనల్ అని, కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాలని అధిష్టానం విధాన నిర్ణయం తీసుకున్నా…, డోన్‌లో మాత్రం మలు కావడం లేదని, అయినా… అధిష్టానం పట్టించుకోవడం లేదన్నది కోట్ల వర్గీయుల వాదనగా ఉంది. సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో వేయడం లేదని చెబుతున్నారట. కోట్ల వర్గానికి, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గానికి అస్సలు పడడం లేదంటున్నారు. ఏ కార్యక్రమం అయినా… ఎవరికి వారు తప్ప కలిసి నిర్వహించిన సందర్భాలు లేవన్నది లోకల్‌ కేడర్‌ వాయిస్‌. అటు నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు కదలిక లేదట.

Read Also: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!

డోన్ పాత ప్రభుత్వాస్పత్రిని పునరుద్ధరించాలని, నిలిచిపోయిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారట కోట్ల. క్లస్టర్ యూనివర్సిటీలో అవకతవకలపై సీఐడి కి ఫిర్యాదు చేసినా కదలిక లేదని అసంతృప్తిగా ఉన్నారట ఆయన. నామినేటెడ్ పదవుల సిఫారసులు అమలు కాలేదని, కొందరు అధికారుల బదిలీలు తాను చెప్పినట్టు జరగలేదని ఎమ్మెల్యే అసహనంగా ఉన్నట్టు సమాచారం. గుండ్రేవుల, వేదవతి రిజర్వాయర్లు నిర్మించాలనే పాయింట్‌ మీద టీడీపీలో చేరారని, శంకుస్థాపనలు చేసినా ఆ ప్రాజెక్టులపై కదలిక లేకపోవడం, దానికి సంబంధించి జరిగే సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడంపై తమ నాయకుడు అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు కోట్ల అనుచరులు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా వున్నా….అధిష్టానంతో దూరంగా ఉండడానికి ఇలాంటి చాలా కారణాలున్నట్టు చెప్పుకుంటున్నారు. సుదీర్ఘ కాలం జాతీయ పార్టీలో ఉండి… అక్కడ ఉన్న ప్రాధాన్యత ప్రాంతీయ పార్టీలో దక్కడం లేదని బాధపడుతున్నారా? లేక లోకల్‌ పాలిటిక్స్‌లో అమడలేకపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది డోన్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Exit mobile version