Site icon NTV Telugu

Off The Record: కోనేరు కోనప్ప హస్తం పార్టీకి హ్యాండ్‌ ఇచ్చేసినట్టేనా?

Koneru Konappa

Koneru Konappa

Off The Record: కోనేరు కోనప్ప..సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారాయన. ఆ తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో… కూడా… బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయాక పాత గూడు కాంగ్రెస్ దరికే చేరారు కోనప్ప. కానీ…. చేరినప్పటి నుంచే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారాయన. ఆ క్రమంలో మెల్లిగా నియోజకవర్గంలో ప్రాధాన్యత కూడా తగ్గుతూ వస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో… సొంత పార్టీ మీద తిరుగు జెండా ఎగరేశారు మాజీ ఎమ్మెల్యే. ఇక కాంగ్రెస్‌తో తెగతెంపులేనని లీకులిచ్చారు. పైగా గ్రూప్ వార్ పై కార్యకర్తల సమావేశంలో ఆయన అన్న మాటలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఒకసారి ఇలాంటి స్టేట్‌మెంటే వచ్చినా… అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి సర్దిచెప్పడంతో మెత్తబడ్డారాయన. ఇక ఈసారి మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సైతం నెరవేరలేదని, నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ హయాంలో సాధించుకున్న పనుల్ని ఇప్పటికీ మొదలుపెట్టకపోగా… అడుగు ముందుకు పడకుండా కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయంటూ సంచలన కామెంట్స్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే. కౌటాల వంతెన, నియోజక వర్గంలో 11 రోడ్లు బీఆర్ఎస్ హయాంలో మంజురయ్యాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వంలో రద్దు చేశారని కోనప్ప చేసిన కామెంట్స్ పార్టీలో చర్చ, రచ్చకు కారణం అవుతున్నాయట. ఇలాంటి వ్యాఖ్యలతోనే తాజాగా ఆయన చింతల మానేపల్లి మండలంలో తిరగుబాటు బావుటా ఎగరేశారు. సిర్పూర్‌లో పార్టీకి అయ్యా..అవ్వా ఎవ్వరూ లేరు. పరిస్థితి చాలా ఘోరంగా ఉందంటూ.. కార్యకర్తల సమావేశంలో కుండబద్దలు కొట్టడంతో పార్టీ మార్పు తధ్యమని సంకేతాలిచ్చినట్టయిందని అంటున్నారు.

Read Also: Off The Record: విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందా..?

తన కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్‌తో కలిసి నడిచే ప్రసక్తే లేదని కూడా తేల్చేశారు కోనప్ప. ప్రస్తుతానికి ఇండిపెండెంట్‌గానే ఉంటానని, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే… వేరే చోటికి వెళతాను తప్ప కాంగ్రెస్‌ గురించి మాత్రం ఇక ఆలోచించే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే అనడం సంచలనమైంది. అధికారంలో ఉన్న పార్టీకి దూరంగా ఉంటానని అనడంపైనే చర్చ జరుగుతోంది. అంటే… నియోజకవర్గ కాంగ్రెస్‌లో విభేదాలు ఆ స్థాయిలో ఉన్నాయా అని మాట్లాడుకుంటున్నారు పరిశీలకులు. గత ఫిబ్రవరిలో పార్టీ టార్గెట్ గా ,ఎమ్మెల్సీ దండే విఠల్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోనప్ప. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి బహిరంగ మద్దతు ప్రకటించారాయన. ఆ వ్యవహారాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఆయన మానసికంగా దూరమైనట్టు చెప్పుకుంటున్నారు. 9 నెలలుగా తాను పార్టీలో ఉన్నానంటే ఉన్నానన్నట్టుగా ఉంటున్నారు కోనప్ప. దానికి తోడు పార్టీ కార్యక్రమాలు వేటికీ ఆయనకు పిలుపు రావడం లేదట. ఇవన్నీ చాలదన్నట్టు ఇటీవలి కాలంలో కోనప్ప అనుచరులను ఓనేత తన వైపు తిప్పుకోవడం ప్రారంభించినట్టు సమాచారం. తన బలాన్ని, బలగాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాక అలర్ట్‌ అయిన మాజీ ఎమ్మెల్యే… తాజాగా గరం రగం వ్యాఖ్యలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక నుంచి తెల్ల జెండా, పోరాటామే అజెండాగా పనిచేస్తానన్నారాయన. కౌటాల బ్రిడ్జి, నియోజకవర్గంలో 11 రోడ్ల నిర్మాణం రద్దు లాంటి వాటిపై జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి సీతక్క,సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్పందించకపోవడం వల్లే… ఇక కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందా..?

బీజేపీ, బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళే పరిస్థితులు లేకపోవడం, హస్తంపార్టీలో గ్రూప్ వార్ విపరీతంగా ఉండడం లాంటి కారణాలతో ప్రస్తుతానికి తాను ఇండిపెండెంట్‌ అంటున్నారట కోనేరు కోనప్ప. అదే సమయంలో తాజా మీటింగ్‌కు వచ్చిన కార్యకర్తలతో ఆయన బలప్రదర్శన చేసినట్టయిందని కూడా విశ్లేషిస్తున్నారు కొందరు. అటు బీజేపీ ఎమ్మెల్యే, ఇటు కాంగ్రెస్‌ టార్గెట్‌గా విమర్శలు చేసిన కోనప్ప… బీ ఆర్ ఎస్ కి , కేసీఆర్ కుటుంబానికి అనుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీ ఆర్ ఎస్ లోకి తీసుకోవడం వల్లే….బయటకు రావాల్సి వచ్చిందని, అది మినహా మిగతా అన్ని విషయాల్లో కేసీఆర్ దేవుడని, ఆయనతో పార్టీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కోనప్ప అన్న మాటలు కొత్త అనుమానాలను రేపుతున్నాయి. ముందు ముందు ఆయన ఒంటరి ప్రయాణమే చేస్తారా? లేక కారెక్కుతారా? ఒకవేళ అదే నిజమైతే… తాను శత్రువుగా భావిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో ఎలా సర్దుకుపోతారన్నవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే.

Exit mobile version