NTV Telugu Site icon

Off The Record: దానం నాగేందర్ ఆగమాగం అవుతున్నారా..?

Danam

Danam

Off The Record: దానం నాగేందర్… గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనది డిఫరెంట్‌ పొలిటికల్‌ స్టైల్‌. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటని చెప్పుకుంటారు. పార్టీలు, లాయల్టీలు జాన్తానై.. పని జరగడమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎథిక్స్‌, యాలక్కాయలు తర్వాత సంగతి…. ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్రా భై… అంటారన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం అట. అందుకు తగ్గట్టే… తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి… గులాబీని పట్టేశారాయన. ఇక 2023లో కాంగ్రెస్‌కు పవర్‌ రాగానే… కారు దిగేసి… గులాబీ కండువాను ఓ మూలన విసిరేసి పాత పార్టీకే తిరిగి జై కొట్టారు. అసలు అందరి కంటే ముందు ఆయే క్యూలో నిలబడ్డారన్నది రాజకీయ వర్గాల మాట.

Read Also: Gujarat: పాపులర్ స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక.. తిన్న బాలికకు అస్వస్థత

కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరడానికి అప్పట్లో సీనియర్ నేతల చుట్టూ నానా ప్రదక్షిణలు చేశారట. రకరకాలుగా మంతనాలు జరిపి… నానా తంటాలు పడ్డట్టు చెప్పుకుంటారు. పార్టీ మారినా… టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే ఉన్న నాగేందర్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడం రచ్చకు దారి తీసింది. అలాగే ఎలక్షన్‌లో ఆయన సరిగా వర్కౌట్‌ చేసుకోలేకపోయారన్న అభిప్రాయం సైతం ఉంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. గట్టి పోటీ మాత్రం ఇవ్వగలిగారన్నది కాంగ్రెస్‌ వర్గాల ఫీలింగ్‌. అంత వరకు ఓకే….. అదో రకం రాజకీయం అనుకున్నా… మెల్లిగా దానం వ్యవహారశైలి తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు కంట్లో నలుసులా తయారవుతోందన్న అభిప్రాయం పెరుగుతోందట. ఏం… ఎందుకలా…? మిగతా నేతలకు భిన్నంగా ఆయన ఏం చేస్తున్నారని అంటే…. ఎందుకు లేదు…. చాలా డ్యామేజ్ చేస్తున్నారన్నది సదరు వర్గాల మాటగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తీసుకునే చర్యల మీద… మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకం అనుకున్న వాటి విషయంలో నాగేందర్‌ వైఖరి బాగా ఇరుకున పెడుతోందని ఫీలవుతున్నారట కాంగ్రెస్‌ పెద్దలు. చెరువుల పరిరక్షణ కోసం… రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను గొప్పగా ప్రొజెక్ట్‌ చేసింది. కానీ.. ఆ విషయంలో మొదట గొడవ మొదలుపెట్టింది దానం నాగేందర్. ప్రతిపక్ష పార్టీ కంటే ముందుగా…. హైడ్రా కమిషనర్ మీద ఓ రేంజ్‌లో ఫైరయ్యారని, అది ప్రత్యర్థులకు మంచి అస్త్రంగా మారిందని భావిస్తున్నారట కాంగ్రెస్‌ నేతలు.

Read Also: Balakrishna : మీరు ఊహించిన దానికంటే మించే ఈ సినిమా ఉంటుంది

అప్పట్లో అది పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పి అవగా… సీఎంని కలిశాక మెత్తబడ్డారాయన. ఆ తర్వాత… అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో కూడా…అదే తరహా ఇబ్బంది ఎదురైందట. అరెస్ట్‌ సరికాదని, పార్టీకి నష్టమని అంటూ… ఒక రకంగా అల్లు అర్జున్‌కి మద్దతుగా నిలబడి ప్రతిపక్షాలతో గొంతు కలిపినట్టయిందంటున్నారు. ఇక తాజాగా… కేటీఆర్, ఫార్ములా e రేసింగ్‌పై చేసిన కామెంట్స్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఫార్ములా e రేసింగ్‌తో హైదరాబాద్‌ ఇమేజ్‌ పెరిగిందని, కేటీఆర్‌ ఆ విషయాన్ని క్లారిటీగా చెబుతున్నారంటూ… దానం మీడియాకు ఎక్కడంతో అవాక్కయ్యారట కాంగ్రెస్‌ ముఖ్యులు. ఓ వైపు ఆ వ్యవహారంలో అవినీతి జరిగిందని, దాన్ని నిరూపించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటే… అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే నాగేందర్‌ మాత్రం ప్రతిపక్ష నేతకు మద్దతుగా మాట్లాడ్డం ఏంటన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. అసలాయన కాంగ్రెస్‌లో ఉన్నారా? లేక ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టు ఫీలవుతున్నారా అని గాంధీభవన్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో కీలకమైన అంశాలపై ఇష్టానికి మాట్లాడేసి ప్రభుత్వ, పార్టీ పెద్దల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా జరుగుతోందట. అందులో భాగంగానే రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌.

Read Also: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్‌లో బంగ్లాదేశ్..

పార్టీలో చేరే ముందు… తన వ్యక్తిగత సమస్యలు కొన్నిటిని పరిష్కరించమని అడిగారని, ఇప్పుడా పనుల్ని ప్రభుత్వం చేయకపోవడంతోనే దానం ఇలా రివర్స్‌ గేర్‌ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో తాను ఎంత ఇరుకున పెడితే… ప్రభుత్వ పెద్దలు అంత త్వరగా పని చేస్తారని ఆయన అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య మరో రకమైన చర్చ జరుగుతోందట. ఆయనేదో అనుకుంటున్నారుగానీ… వాతావరణం ఇంతకు ముందులా లేదు. మాట్లాడిన ప్రతీసారి పిలిచి బుజ్జగించే సీన్‌ ఉండదని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే వైఖరి కొనసాగి… తెగేదాకా లాగితే…. అదే కంటిన్యూ చేసుకోమని వదిలేసే ప్రమాదం ఉందని కూడా అనుకుంటున్నారు. ఎక్స్‌ట్రా చేస్తే.. ఎందుకైనా సిద్ధమని సంకేతాలు పంపాలనుకుంటున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ఎలాగూ దగ్గరికి రానివ్వదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా హ్యాండ్సప్‌ అంటే… దానం రెంటికీ చెడ్డ రేవడిలా మారతారా అన్న డౌట్స్‌ కూడా ఉన్నాయట కాంగ్రెస్‌ వర్గాల్లో. ఏదేమైనా… దానం నాగేందర్‌… వ్యవహార శైలి పంటికింద రాయిలా మారిందన్నది కాంగ్రెస్‌ పెద్దల భావనగా తెలుస్తోంది. దీన్ని ఎలా సెటిల్‌ చేస్తారో చూడాలి మరి.

Show comments