NTV Telugu Site icon

Off The Record: కేసీఆర్‌ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా..? అసలు వ్యూహమేంటి..?

Kcr

Kcr

Off The Record: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12 నుంచి మొదలవబోతున్నాయి. దాంతో…. మాజీ సీఎం కేసీఆర్‌ సభకు వస్తారా? రారా అన్న చర్చ మరోసారి జరుగుతోంది రాజకీయవర్గాల్లో. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందట కాంగ్రెస్. ఆయన పదేళ్ళ పాలనను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్‌ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ… ఇప్పటికే పలుమార్లు విమర్శించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ స్థాయిలో అటాక్‌ వచ్చినా.. సభలో కేటీఆర్‌, హరీష్‌రావే ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల విమర్శలు, ఆరోపణలకు వాళ్ళే ముందుండి సమాధానం చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వైపు నుంచి పట్టుబడుతున్నా… అవసరం లేదు మేమే చెబుతామన్నట్టుగా ఆన్సర్‌ చేస్తున్నారు బావాబావమరుదులు.

అయితే గత బడ్జెట్ సమావేశాలప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి కాక ముందే…. చివర్లో బయటకు వచ్చేశారాయన. నేరుగా మీడియా పాయింట్ దగ్గరకు వెళ్ళి మాట్లాడారు. ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టిందంటూ విమర్శలు గుప్పించారు కేసీఆర్‌. అంతే తప్ప… ఆ తర్వాత బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొనలేదు. ఆ రోజు తప్ప… మిగతా ఏ సందర్భంలోనూ ఆసెంబ్లీ వైపు తొంగి చూడలేదు కేసీఆర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన సమయంలో.. ఆయనకు నివాళి అర్పించి సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది తెలంగాణ శాసనసభ. ఆ సందర్భంలో స్పీకర్ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి సభ కు రావాలని ఆహ్వానించారట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధాని గా ఉన్న మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాన చర్చ కోసం కేసీఆర్ వస్తారని చాలామంది అనుకున్నా… ఆయన మాత్రం అటెండ్‌ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్‌ సమావేశాలకన్నా కేసీఆర్‌ హాజరవుతారా? లేక పాత స్ట్రాటజీ ప్రకారం జస్ట్‌ ఒక్కరోజు,,, అదీకూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజున అటెండైపోయి… ప్రజెంట్‌ సార్‌ అనిపించుకుని ఇక సైలెంట్‌గా ఉంటారా అన్న చర్చ జరుగుతోంది.

ఇక గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేసీఆర్‌ స్కిప్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. కేవలం బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు వచ్చి… గత సమావేశాల్లోలాగే.. మీడియా పాయింట్‌కు వెళ్ళి తాను చెప్పాలనుకున్నది చెప్పేసేయాలనుకుంటున్నట్టు తెలిసింది. అసలు ఈసారి మాత్రమే కాదు.. సభా నాయకుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్‌ అలాగే వ్యవహరిస్తారని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ కేసీఆర్‌ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారని, అలాంటి వాటిని తాను ఎదురుగా ఉండి వినదల్చుకోవడం లేదన్నది బీఆర్‌ఎస్‌ వాయిస్‌. అయితే, రాబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ ఇద్దరు అభ్యర్థుల్ని నిలబెడితే మాత్రం… ఎన్నిక అనివార్యం అవుతుంది…. కేసీఆర్ మరో రోజు సభకు రావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితే వస్తే… ఓటింగ్‌ వరకే పరిమితం అవుతారు తప్ప అంతకు మించి ఏం ఉండబోదన్న విశ్లేషణలున్నాయి. అటు ప్రతిపక్ష నేత సభకు వస్తే హుందాగా ఉంటుందని స్పీకర్ తో పాటు పలువురు సూచిస్తున్నా….. కేసీఆర్‌కు మాత్రం అలాంటి ఉద్దేశ్యాలేం లేవన్నది గులాబీ నాయకులు చెబుతున్న మాట.