Off The Record: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు…. కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే…త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు కాగా… అధికార పార్టీగా… ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో… ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. అభ్యర్థులు ఎవరన్న విషయంలో కూడా ఇప్పటికే రాజకీయవర్గాల్లో రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే… ఫలానా వ్యక్తి అని పైకి చెప్పకున్నా…. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఏ వర్గానికి ఇవ్వాలో ఒక అవగాహనకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మేం పక్కా లోకల్ అంటోంది అధికార పార్టీ. అభ్యర్థి ఎవ్వరైనా సరే… స్థానికుడికే టిక్కెట్ ఇవ్వాలని డిసైడైంది కాంగ్రెస్. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తూ….కార్యాచరణ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. అటు పార్టీ పరంగా నియోజకవర్గ బాధ్యులను నియమించే పని కూడా చకచకా జరుగుతోంది.
ఈ క్రమంలోనే… క్యాండిడేట్‌కు సంబంధించి కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ. ప్రస్తుతం పార్టీ టిక్కెట్ కోసం చాలామంది నాయకులు రేస్‌లో ఉన్నారు. ఎవరికి వాళ్ళు తమ బలాలను చెప్పుకుంటూ లాబీయింగ్ మొదలుపెట్టారు. దీంతో… గందరగోళం పెరుగుతోందని భావిస్తున్న నాయకత్వం దానికి చెక్‌పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే… గతంలో జూబ్లీహిల్స్ నుంచి పార్టీ తరపున చేసిన అజారుద్దీన్, ఈసారి టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్‌లను పక్కనే కూర్చోబెట్టుకుని మరీ… మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం. అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్తూనే…. జూబ్లీహిల్స్ స్థానికులకు మాత్రమే ఈసారి టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చేశారు. నియోజకవర్గం బయటి వాళ్ళకు జూబ్లీహిల్స్ టిక్కెట్ లేదని చెప్పడం ద్వారా…ఆయన అజారుద్దీన్‌కు స్పష్టత ఇచ్చారా లేక నవీన్ యాదవ్‌కా అన్న డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం సీటు చర్చ ఈ ఇద్దరి మధ్యనే ఎక్కువగా జరుగుతోంది.
Read Also: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అయితే…తాజాగా అజారుద్దీన్ కోసం మైనార్టీ నేతల లాబీయింగ్ మొదలైంది. ఇప్పటి వరకు కేబినెట్‌లో మైనార్టీలకు చోటు దక్కలేదని, అలాంటి పరిస్థితుల్లో కనీసం గతంలో పోటీ చేసిన సీటును కూడా మైనార్టీలకు ఇవ్వరా అంటూ వత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో… అభ్యర్థి విషయమై ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. మామూలుగా అయితే…. చనిపోయిన మాగంటి గోపీనాథ్ కుటుంబంలోనే ఎవరికో ఒకరికి టిక్కెట్ ఇస్తారు. కానీ… ఆ విషయంలో పార్టీ వైపు నుంచి ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే…తాజాగా మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు అన్న మాటల్ని బట్టి చూస్తే మాత్రం… కచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికే ఇస్తారని తెలుస్తోంది. పైగా ఆయన వేరే ఎక్కడో కాకుండా… నేరుగా బీఆర్‌ఎస్ ఆఫీస్‌లోనే ఆ ప్రస్తావన చేయడంతో… అది వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండకపోవచ్చని, ఈసారి కూడా బీఆర్‌ఎస్ టిక్కెట్ కమ్మ సామాజికవర్గానికే ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రకరకాల వాదనలు తెర మీదికి వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పక్కా లోకల్ అంటుంటే…అదే పార్టీలోని మరో వర్గం మాత్రం మైనార్టీలకు అంటోంది. బీఆర్‌ఎస్ అయితే… కమ్మ సామాజికవర్గానికేనని క్లారిటీ ఇచ్చేసింది. బీజేపీ వైపు నుంచి కూడా ఏదన్నా ప్రకటన వస్తుందేమోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
