Off The Record: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమించింది పార్టీ అధిష్టానం. ఆ పోస్ట్ విషయంలో ఆయన అంత సుముఖంగా లేకున్నా… పార్టీ పెద్దల వ్యూహం మాత్రం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే….. అందులో కొందరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకుల మధ్య కూడా సమన్వయం కొరవడుతోందట.ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పార్టీలోని ఇంటర్నల్ వార్‌ను బయటపెట్టాయి. ముఖ్యంగా రేషన్ మాఫియా వ్యవహారం పార్టీ పరువును రోడ్డున పడేసింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇలాంటివి రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి. కానీ… విభేదాలను పరిష్కరించడంలో ఇంతకు ముందు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన అజీజ్ విఫలమయ్యారన్నది పెద్దల అభిప్రాయం. పైగా… ఆయన్ని పార్టీ నాయకులు కూడా లెక్కచేసే వాళ్ళు కాదట. అందుకే… అనుభవజ్ఞుడైన బీద రవిచంద్ర వైపు మొగ్గినట్టు తెలుస్తోంది. 2012 – 2020 మధ్య ఎనిమిదేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు బీద. అందరికీ సుపరిచితుడు, పరిస్థితుల్ని డీల్ చేస్తారన్న నమ్మకమే ఆయన ఎంపికకు కారణమంటున్నారు.
Read Also: YS Jagan: సత్యమేవ జయతే.. టీడీపీ, జనసేన నేతలపై వైఎస్ జగన్ ఫైర్..
జిల్లా ఎమ్మెల్యేల్లో కొందరు రాజకీయాలకు కొత్త కావడం, మరికొందరు నాయకులు పార్టీకి కొత్త కావడంతో ఎవరూ వాయిస్ గట్టిగా వినిపించలేకపోతున్నారట. దీనికి తోడు ఒకే నియోజకవర్గంలో ఉండే తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు కూడా టీడీపీకి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఇటీవల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సైతం పార్టీలో ఉండే కొందరు తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ చేశారు. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఇప్పుడు టీడీపీ పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఊపును ఇలాగే కొనసాగించాలంటే… ముందు నేతల మధ్య సమన్వయం ముఖ్యమని భావించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బీద రవిచంద్రవైపు మొగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ఆయనే స్వయంగా పిలిచి జిల్లా పార్టీ పగ్గాలు తీసుకోమన్నారన్నది నెల్లూరు టాక్. జిల్లాలో వైసీపీ దూకుడుగా ఉందని, ఒక్కోసారి ఒక్కో ఎమ్మెల్యేపై ఎదురుదాడి చేస్తుంటే.. అధికార పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందట. నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులిద్దరూ లోకల్ పాలిటిక్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదన్నది రాష్ట్ర నాయకత్వం అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అధినేత ఏరికోరి రవిచంద్రను ఎంపిక చేశారట.
కానీ… అక్కడే అసలు సమస్య మొదలైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పడం, నీవల్లే అవుతుందని భజం తట్టడం వరకు బాగానే ఉన్నా… అసలు … పని చేయాల్సిన బీద రవిచంద్ర మాత్రం ఆ విషయంలో వెనకాముందాడుతున్నట్టు తెలుస్తోంది. ఇష్టం లేకపోపోయినా.. బాధ్యతలు మోయాల్సి వస్తోందని సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారట ఆయన.
నేనసలు రాష్ట అధ్యక్ష పదవి రేస్‌లో ఉంటే… తీసుకొచ్చి జిల్లాలో పడేశారంటూ అత్యంత సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోపక్క బీద ఎంపికపై ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా రాజకీయాల్లో బీద జోక్యాన్ని సహించలేని మంత్రులు ఆయన్ని రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేస్తే.. ఇప్పుడు అధిష్టానం తిరిగి జిల్లాకు తీసుకు రావడంతో వాళ్ళిద్దరి సహకారం ఎంతవరకు ఉంటుందన్న అనుమానాలు సైతం ఉన్నాయి. గతానికి, ఇప్పటికి జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోవడంతో నేతల మధ్య సమన్వయం తీసుకురావడం కష్టమేనన్న ఆలోచనలో ఉన్నారట రవిచంద్ర. దానికి తోడు కావలి ఎమ్మెల్యేకి, రవిచంద్రకు మధ్య విభేదాలు ఉన్నాయి. రవిచంద్ర తనను ఇబ్బంది పెడుతున్నారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పలు సందర్భాల్లో తన అనుచరులు దగ్గర చెప్పుకుని బాధపడ్డారట. ఈ క్రమంలో బీదకు ఆయన సహకరిస్తారా అన్న అనుమానం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా టీడీపీని స్ట్రీమ్ లైన్ చెయ్యడం కాస్త కష్టమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రవిచంద్రకు ఈసారి అంత ఈజీ కాదన్నది సింహపురి పొలిటికల్ టాక్.