Off The Record: ఐఏఎస్ అధికారి గిరిషా పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి మోగిపోతోంది. ముఖ్యంగా టీడీపీ సర్కిల్స్‌లో ఆయన గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దొంగ ఓటర్ కార్డుల కేసులో ఆయనకు క్లీన్‌చిట్ రావడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నికలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన పీఎస్ గిరిషాకు తాజాగా ఉపశమనం లభించింది. ఇందులో ఆయన పాత్ర ఏం లేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారట విచారణాధికారి. దీంతో ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేసింది కూటమి సర్కార్. ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, నేతల్లో హాట్ టాపిక్ అయింది. అప్పట్లో ఓటరు కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేశారంటూ.. వైసిపిపై చంద్రబాబు సహా… కూటమి నేతలంతా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అలాంటిది… అప్పుడు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఆఫీసర్ మీద చర్యలను నిలిపివేయడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2021లో జరిగిన తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో ఓటరు కార్డుల అక్రమంగా డౌన్‌లోడింగ్ కేసులో సస్పెండ్ అయ్యారు గిరిషా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో తొలుత గిరీషా సస్పెండ్ అయ్యారు. తర్వాత వరుసగా పలువురు కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల మీద సైతం వేటు పడింది.
Read Also: Vice President Bungalow: ఉపరాష్ట్రపతి బంగ్లా ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మరోవైపు పోలీసు దర్యాప్తు జరుగుతుండగానే ఐఎఎస్ మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా జిల్లాలో చర్చనీయాంశం అయింది. విచారణ సమయంలో సాంకేతిక ఆధారాలతో సంజాయిషీ ఇచ్చారట గిరీషా. అప్పటికే లోతుగా విచారించిన ఈసీ సైతం ఈ సంజాయిషీతో సంతృప్తి చెంది సస్పెన్షన్ ఎత్తేసినట్టు చెప్పుకుంటున్నారు. అటు కూటమి ప్రభుత్వం నియమించిన అధికారి కూడా… క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి… దొంగ ఓటరు కార్డుల వ్యవహారంలో గిరిషా పాత్ర లేదని తేల్చడంతో… ప్రభుత్వ పరంగా కూడా తదుపరి చర్యలను నిలిపేసినట్టు తెలిసింది. అయితే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోలేని కూటమి నేతలు కొందరు…అనుమానపడుతున్నారట. తిరుపతి కూటమి నేతలైతే… ఒక అడుగు ముందుకేసి అప్పట్లో ఈ విషయమై…. మనం గట్టిగానే పోరాడాం…. అలాంటిది ఇప్పుడు ఉపశమనం ఎలా ఇస్తారు అంటూ బహిరంగంగానే చర్చలు పెట్టారట. కొందరైతే… సోషల్ మీడియాలో ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. దొంగ ఓట్ల వ్యవహారంలో భూమన కుటుంబం పాత్ర ఉందని చెప్పాం… అలాంటిది ఇప్పుడు మేమేం సమాధానం చెప్పాలంటూ కొందరు టీడీపీ సీనియర్స్ ఫీలైపోతున్నారట. దాంతో కంగారుపడ్డ పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది.
Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..
గిరిషాకు క్లీన్‌చిట్ ఇచ్చినంత మాత్రాన కేసు ఎక్కడికి పోలేదని, అది కొనసాగుతుందని, అక్రమంగా ఓటర్ కార్డుల డౌన్‌లోడ్ వెనక వైసిపి నేతలే ఉన్నారన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుందని అంటున్నారట. ఈ కేసులో భూమన కుమారుడు అభినయ్ పాత్ర ఉందని టిడిపి సీనియర్ నేత పట్టాభి సైతం చెప్పారని, ఆ వ్యవహారంలో వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయమని కూడా అంటున్నారు. క్లీన్‌చిట్‌పై కూటమి నేతల్లో ఇలాంటి చర్చ జరుగుతుంటే…వైసీపీలో మరో రకంగా ఉందట. ఐఎఎస్ మీద చర్యలు నిలిపేశాక కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన తప్పుల గురించి గిరిషా ఈసీకి, ప్రభుత్వానికి సమాచారం ఇస్తారని అనుమానిస్తున్నట్టు తెలిసింది. ఆ డౌట్ వచ్చాక లోకల్ వైసీపీ నాయకుల్లో కాస్త అలజడి పెరిగిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కేసు నుంచి బయటపడ్డ అధికారి గిరిషా అసలు అప్పుడేం జరిగిందో… పూసగుచ్చినట్టు ప్రభుత్వానికి వివరాలు చెబితే… కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందోన్న భయాలు వైసీపీలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముందు ముందు ఇందులో ఊహించని మలుపులు కూడా ఉండవచ్చంటున్నారు.
