Site icon NTV Telugu

Off The Record: హిందూపూర్‌లో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తుందా?

Hindupur

Hindupur

Off The Record: పార్టీ అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలు.. లీడర్లకు మేలు చేయకపోయినా.. క్యాడర్‌కు మాత్రం కీడు చేయకూడదని అంటారు. కానీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం కేడర్‌కు కీడే చేస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకు పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ అంటూ…. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూపిస్తున్నారు పరిశీలకులు. ఇక్కడ వైసీపీ ఆవిర్భావం నుంచి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే వరుసగా మూడు సార్లు ఓడిపోయిందన్న అభిప్రాయం ఉంది. పార్టీ వేవ్ బలంగా ఉన్న 2019ఎన్నికల్లో కూడా హిందూపురంలో దారుణ పరాభవం చవి చూసింది వైసీపీ. మొదటి నుంచి ఇక్కడ పార్టీలో వర్గ విబేధాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న నవీన్‌ నిశ్చల్‌ వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయానికి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. ఆయన వచ్చాక ఇక్కడ గ్రూపులు పెరిగిపోయాయి.

Read Also: Ganja Case : మత్తుకు బానిసలైన మెడికోలు..

ఓ వైపు నవీన్ నిశ్చల్ వర్గం, ఇంకోవైపు ఇక్బాల్ వర్గం, ఇంకోవైపు హత్యకు గురైన చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గం ఇలా… మూడు ముక్కలాట నడిచింది. అయితే…. 2024 ఎన్నికల సమయానికి ఇక్బాల్‌ పార్టీ నుంచి వెళ్లిపోగా… అంతకు ముందే కురుబ దీపికను సీన్‌లోకి తీసుకువచ్చారు వైసీపీ అధినేత జగన్. అయినా సరే… దీపికకు కూడా ఓటమి తప్పలేదు. ఇక్కడ టీడీపీ బలంతో పాటు వైసీపీ గ్రూప్స్‌ కూడా అందుకు కారణం అంటారు. ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాల్ని కూడా మూడు వర్గాల నేతలు ఎవరికి వారే నిర్వహించుకున్నారు. దీపికకు అధిష్టానం నుంచి ఆశీస్సులు ఉండగా.. ఇటు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి వేర్వేరుగా తమ బలం నిరూపించుకునేందుకు వైఎస్ఆర్ జయంతిని వేదికగా చేసుకున్నారు. ఇక 2029 ఎన్నికల్లో కచ్చితంగా తాను అభ్యర్థిగా నిలబడతానని ప్రకటించారు నవీన్. అటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. దీని మీద సమన్వయకర్తగా ఉన్న దీపికతో పాటు పార్టీ అబ్జర్వర్ రమేష్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

Read Also: KTR : బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి

దీంతో అధిష్టానం నవీన్ నిశ్చల్ తో పాటు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆ నిర్ణయం హిందూపురం వైసీపీలో తీవ్ర కలకలం రేపుడంతో పాటు క్యాడర్‌ను గందరగోళంలో పడేసింది. సస్పెన్షన్ పై ఇద్దరు నేతలు చాలా ఘాటుగా స్పందించారు. తాము పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో చెబుతూనే…. అధిష్టానం నిర్ణయాన్ని లెక్కచేసే పరిస్థితుల్లో లేమన్న సంకేతాలు పంపారు. వాళ్ళు సస్పెండ్‌ అయ్యాక క్యాడర్ లో నిస్తేజం, నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలా.. లేక నవీన్, కొండూరు లాంటి నాయకుల వెంబడే తమ ప్రయాణాన్ని కొనసాగించాలా అన్న గందరగోళంలో ఉన్నారట. విషాన్ని పసిగట్టిన ఇన్ఛార్జ్‌ దీపిక అందర్నీ తన దారికి తెచ్చుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక్కడ ఎవరేం చేస్తున్నారో అధిష్టానం గమనిస్తోందని, పెద్దల నిర్ణయాన్ని మేం గౌరవిస్తామని చెబుతున్నారామె. ఏదేమైనా అధిష్టానం తీసుకున్న నిర్ణయం మాత్రం హిందూపురంలో వైసీపీలో గందరగోళం పెంచుతోందన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం.

Exit mobile version