Ganja Case : వాళ్లంతా మెడికోలు… !! మూడు నాలుగేళ్లలో బయటకొచ్చి డాక్టర్లుగా మారి వైద్యం అందించాల్సిన వాళ్లు !! కానీ.. అడ్డదారులు తొక్కారు. స్టెత్ పట్టాల్సిన చేతితో గంజాయి పట్టారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును చేతులారా చిత్తు చేసుకుంటున్నారు. ఓ డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకుని తీగలాగితే మెడికోల డొంక కదిలింది. ఇద్దరో ముగ్గురో కాదు… ఏకంగా ఒక్క కాలేజ్‌కి చెందిన 100 మంది మెడికోలు గంజాయి కన్‌జూమర్లుగా మారారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్లందరికీ గంజాయి సప్లై చేస్తుంది కూడా అక్షరం ముక్క రాని ఓ లేడీ డాన్. పోలీసుల రెగ్యులర్ తనిఖీల్లో.. అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ యువకుడిని గుర్తించారు. బైక్‌ను ఆపి తనిఖీ చేయగా.. గంజాయి లభ్యమైంది. 50 వేల రూపాయల విలువైన 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది 2 కేజీలే కావడంతో.. చోటామోటా పెడ్లర్‌గా భావించారు పోలీసులు. కానీ.. యువకుడి మొబైల్ తనిఖీ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడ్డ 23 ఏళ్ల యువకుడిని అర్ఫత్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. యువకుడిది సికింద్రాబాద్ పరిధిలోని రిసాలా బజార్. అహ్మద్ ఖాన్ లిస్ట్‌లో ఏకంగా 84 మంది గంజాయి కన్జూమర్లుగా ఉన్నట్లుగా ఆధారాలు సేకరించారు పోలీసులు.
కన్జూమర్ల లిస్ట్‌ను బట్టి వివరాలు సేకరించగా పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. 84 మంది కన్జూమర్ల లిస్ట్‌లో ఏకంగా 26 మంది మెడికోలు ఉన్నట్లు గుర్తించారు. ట్విస్ట్ ఏంటంటే… ఈ 26 మందీ మేడ్చల్ పరిధిలోని మెడిసిటీ కాలేజ్‌కి చెందిన మెడికో స్టూడెంట్సే !! ఈగల్ టీమ్ నేరుగా మెడిసిటీ కాలేజ్‌కి చేరుకుని 26 మంది విద్యార్థులకు గుర్తించి గంజాయి టెస్ట్‌లు చేసింది. ఇందులో 9 మందికి గంజాయి పాజిటివ్‌గా వచ్చింది. నెగిటివ్‌గా వచ్చిన వాళ్లంతా సుద్దపూసలేం కాదు… టెస్ట్ చేసే సమయానికి నెగిటివ్‌గా వచ్చింది అంతే !! కొన్ని రోజుల ముందు వరకు గంజాయి తీసుకుని ఉండరు అంతే..
Read Also : War-2 : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?
అర్ఫత్ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న విద్యార్థుల నుంచి మరింత సమాచారం సేకరించింది ఈగల్ టీమ్. గత మూడేళ్లుగా అర్ఫత్ నుంచి ఏకంగా 100 మందికి పైగా విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో.. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కాలేజ్‌కి పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. గంజాయి పెడ్లర్లపైనే కాదు.. కన్జూమర్లపైనా ఎన్‌డీపీఎస్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. కేవలం మెడికో స్టూడెంట్స్‌నే టార్గెట్‌గా చేసుకుని అర్ఫత్ గంజాయి అమ్ముతున్నారు. కాలేజ్‌లో కూడా సీనియర్లు… జూనియర్ స్టూడెంట్స్‌కు బలవంతంగా గంజాయి అలవాటు చేస్తున్నారు. మెల్లమెల్లగా జూనియర్ అడిక్ట్ ఐన తర్వాత.. అర్ఫత్ కాంటాక్ట్ ఇచ్చి.. తమకు కూడా జూనియర్ డబ్బుల ద్వారానే గంజాయి తెప్పించుకుంటున్నారు సీనియర్లు. అర్ఫత్ ఖాన్‌కు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కూపీ లాగింది ఈగల్ టీం. బీదర్‌కి చెందిన జరీనా ఖాన్ నుంచి అర్ఫత్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. జరీనా ఖాన్‌కు అర్ఫత్ లాంటి పెడ్లర్లు సిటీ వ్యాప్తంగా 50 మంది పైనే ఉంటారని సమాచారం. ఏమాత్రం చదువుకోని పూర్తి నిరుద్యోగురాలుగా ఉన్న జరీనా ఏకంగా కూర్చున్న చోట నుంచే గంజాయి నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తోంది. బీదర్ నుంచి బల్క్‌లో గంజాయి కొంటున్న జరీనా.. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి.. హైదరాబాద్‌లోని పెడ్లర్లకు చేరవేస్తుంది. ఇలా ఏడాదిలో ఏకంగా కోటి నుంచి కోటిన్నర సంపాదిస్తోంది జరీనా. జరీనా బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు… జరీనాకు చెందిన పలు అకౌంట్లలో పెద్ద ఎత్తున్న డబ్బు ఉన్నట్టు గుర్తించారు. వాటి గుట్టు విప్పుతున్నారు పోలీసులు. జరీనా భర్త కూడా పలు క్రైమ్‌లలో ఇరుక్కుని జైలు జీవితం అనుభవించి ఇటీవలే బయటకు వచ్చాడని తెలుస్తోంది. గంజాయి దందా ద్వారా ఏడాదికి కోటి నుంచి కోటిన్నర టార్గెట్ పెట్టుకుని మరీ జరీనా దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
Read Also : Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..