Site icon NTV Telugu

Off The Record: ఈటల రాజేందర్‌ బీజేపీలో ఒంటరి అయ్యారా?

Etela Rajender

Etela Rajender

Off The Record: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తన సహజ శైలికి భిన్నంగా వీధి భాష వాడుతున్నారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. తన నియోజక వర్గంలోని ఒక ప్రాంతంలో ప్రజలకి స్థానిక తహశీల్దార్‌ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు ఎంపీ. ఆ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ… నోరు జారారు. సీఎంని అనకూడని మాట అనేయడంతో… ఫైర్‌ అవుతున్నారు కాంగ్రెస్‌ నాయకులు. ఈటల ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చింది అధికార పార్టీ. అదంతా ఒక ఎత్తయితే…. అసలు ఆ ఎపిసోడ్‌ మొత్తంలో… అడపా దడపా ఒకరిద్దరు తప్ప… తెలంగాణ బీజేపీ సీనియర్‌ లీడర్స్‌ ఎవరూ ఎంపీకి మద్దతుగా మాట్లాడలేదు. కేవలం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి నియోజకవర్గ నాయకులు మాత్రమే మాట్లాడారు. అసలు సంగతి ఎటోపోయి ఇప్పుడు దీని మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Read Also: Off The Record: ఎమ్మెల్సీల రాజీనామాలను ఎందుకు ఆమోదించడం లేదు..? ఎండ్‌ కార్డ్‌ పడేదెన్నడు?

ఈటల అన్నదాంట్లో తప్పేమీ లేదంటూ పార్టీ ఎమ్మెల్యేలు ఒక ప్రకటనతో సరిపెట్టగా… సహచర ఎంపీలు మాత్రం ఆ పని కూడా చేయలేదు. దీంతో… తెలంగాణ బీజేపీలో ఈటల ఒంటరి అయ్యారా అన్న చర్చ మొదలైంది. ఈటల మాట్లాడింది పార్టీ యాంగిల్‌లోనే కదా..? అయినా సరే…. మిగతా ఎంపీలు ఎవరూ ఆయనకు మద్దతుగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ ముఖ్యమంత్రి విషయంలో పరుష పదజాలం వాడారన్న విషయంలో అభ్యంతరాలున్నా…. ఆ సబ్జెక్ట్ వదిలేసి ఏదోరకంగా ఆయనకు మద్దతుగా నిలవాలిగానీ… అలా గాలికి వదిలేస్తారా అని పార్టీలోనే ఓ వర్గం ప్రశ్నిస్తోందట. మీడియా ముందు రియాక్షన్‌ సంగతి తర్వాత…. కనీసం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకపోవడం వెనక వేరే కారణాలున్నాయా అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఎంపీలు, ముఖ్య నేతలు ఎవరూ నోరు తెరవకపోవడం వెనక రాజకీయం ఏంటని ఆరా తీస్తున్నారట కొందరు. ఆయన సీఎంని అన్నది ఒక్కసారేగానీ… కాంగ్రెస్‌ నేతలు మాత్రం ముప్పేట దాడితో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని, అయినా సరే… పట్టించుకోకుండా పార్టీ ఈటలను వదిలేసిందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

Read Also: Off The Record: పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయం ఎలా మారబోతుంది..?

ఇదే సమయంలో గత పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు కొందరు. పాత, కొత్త వివాదాలు, ఇతరత్రా సమస్యలు ఉంటే ఉండవచ్చుగానీ…. బయటి నుంచి దాడి జరుగుతున్నప్పుడు కూడా డిఫెన్స్‌ చేసుకోలేకపోతే…. అంతిమంగా అది పార్టీ మీద కూడా ప్రభావం చూపుతుంది కదా అని మాట్లాడుకుంటున్నాయట బీజేపీ వర్గాలు. లోలోపల ఎన్నిఉన్నా… ఇలాంటప్పుడు తోడుగా ఉండాలి కదా అన్నది కొందరి అభిప్రాయం. అసలు తెలంగాణ బీజేపీలోని పెద్ద తలకాయలన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నాయన్న ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోందని అంటున్నారు. గతంలో కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద వేరే పార్టీలు తీవ్ర విమర్శలు చేసినప్పుడు పార్టీ ముఖ్య నేతలు పెద్దగా స్పందించలేదని, ఇది కూడా ఆ కేటగిరీలోకే వెళ్ళిందా అని ప్రశ్నించుకుంటున్నారట పార్టీ లీడర్స్‌. ప్రస్తుతం ఈటల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్నారు. ఆ యాంగిల్‌లోనే తాను సాఫ్ట్‌ కాదు, ఫైర్‌… వైల్డ్‌ ఫైర్‌ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఎగ్రెసివ్‌ లీడర్‌ ముద్ర కోసమే ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ మాటలు అని ఉండవచ్చన్నది విస్తృత అభిప్రాయం. మల్కాజ్‌గిరి ఎంపీని ఎంతమంది సపోర్ట్‌ చేస్తారో చూడాలి మరి.

Exit mobile version