Site icon NTV Telugu

Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్‌కు కేసులు కామనా..?

Gummanur Brothers

Gummanur Brothers

Off The Record: వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే… గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా… వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట. వైసీపీ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు జయరామ్‌. అప్పట్లో ఆయన మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, లోకేష్‌ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. బెంజ్‌ కారు వ్యవహారం, సొంతూరులో భారీగా పేకాట డెన్, వైసీపీ కార్యకర్తల మీదే దాడులు….ఇలా అప్పట్లో ప్రతి అంశంలోనూ వివాదాస్పదంగా నిలిచారాయన. లోకేష్‌కు వార్డ్‌ మెంబర్‌ పదవి ఇస్తానంటూ… అప్పట్లో వైసీపీ నేతగా గుమ్మనూరు అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి. ఇక బాబు, లోకేష్‌ని రాయలేని భాషలో దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే… టీడీపీని, అధిష్టానాన్ని బండబూతులు తిట్టిన గుమ్మనూరు తిరిగి అదే పార్టీలో చేరి గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా సంచలనమే. అయితే… పార్టీ మారినాసరే…గుమ్మనూరు బ్రదర్స్‌ వివాదాస్పద తీరు మాత్రం మారడం లేదంటున్నారు.

Read Also: Film Federation: చిరంజీవి ఏం చెబితే అది వింటాం..!

అప్పుడు, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయట. తాజాగా ఆదోని పీఎస్‌లో జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణపై కేసు నమోదయింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్‌తో కలిసి నారాయణ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగాల కోసం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఐదుగురితో ఒప్పందం చేసుకున్నారట. తొలివిడతగా తలో లక్ష చొప్పున ఐదు లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో రాశారు బాధితులు. ఇక అంతకు ముందు కూడా గుమ్మనూరు నారాయణ మీద చాలా కేసులు బుక్‌ అయ్యాయి. జయరామ్‌ మంత్రిగా ఉన్నప్పుడు సొంతూరు గుమ్మనూరులో ఉన్న భారీ పేకాట శిబిరంపై అప్పటి ఆడిషినల్ ఎస్పీ గౌతమి శాలి దాడి చేశారు. అప్పుడు అక్కడున్న వాళ్ళు పోలీసుల మీదే రివర్స్‌ అటాక్‌ చేశారు. దానికి సంబంధించి నారాయణ మీద కేసు బుక్‌ అయింది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయారాయన. వైసీపీలోనే తమ వ్యతిరేక వర్గీయులను బెదిరించడం, దాడిచేయడంలాంటివి జరిగాయి. ఇక గుమ్మనూరు జయరాం తన సోదరులతో కలసి టీడీపీలో చేరి గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలిచాక… గుత్తి ఇన్చార్జ్‌గా ఉన్న నారాయణ అక్కడా సెటిల్ మెంట్లు, బెదిరింపులతో వివాదాస్పదమయ్యారు.

Read Also: Dhanush Found His Real-Life Seeta?: హీరో ధనుష్‌కు రియల్ లైఫ్ సీత దొరికేసిందోచ్…?

కారణం ఏదైనాగానీ…. నారాయణను గుత్తి ఇన్ఛార్జ్‌ పదవి నుంచి తప్పించారు జయరామ్‌. ఆలూరు నియోజకవర్గంలో రెండు నెలల క్రితం ఎమ్మార్పీఎస్ రాయలసీమ కన్వీనర్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌ లక్ష్మీనారాయణ హత్య కేసులో కూడా జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణపై కేసు నమోదయింది. ఆ హత్య ఫ్యాక్షన్‌ తరహాలో జరగడం తీవ్ర కలకలం రేపింది. ఆలూరు, గుంతకల్లు నియోజకవర్గాల మధ్య టిప్పర్‌తో లక్ష్మీనారాయణ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత వేట కొడవళ్ళతో నరికి చంపేశారు. ఆ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే గుమ్మనూరు నారాయణపై ఉద్యోగాల పేరుతో వసూళ్ళ కేసు నమోదవడం చర్చనీయాంశమైంది. నారాయణను గుత్తి టీడీపీ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించాక జనసేనలో చేరాలనుకున్నట్టు ప్రచారం జరిగింది. ఆలూరు జనసేన ఇంచార్జిగా ఉంటే ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చని అనుకున్నట్టు చెప్పుకున్నారు. కానీ… ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ పడిందట. గుమ్మనూరు నారాయణ జయరాంకు వరుసకు సోదరుడు. జయరాం మంత్రిగా ఉన్నపుడు సర్వం తానై వ్యవహరించారాయన. దీంతో జయరామ్‌ ప్రమేయం ఉన్నా, లేకున్నా… నారాయణ చేసే పనుల ప్రభావం మొత్తం మాజీ మంత్రి మీద పడుతోందంటున్నారు పరిశీలకులు. ఆయన జోక్యం చేసుకుని సోదరుడిని కంట్రోల్‌ చేయకుంటే… మొత్తానికే డ్యామేజ్‌ అవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో.

Exit mobile version