Site icon NTV Telugu

Off The Record: అసెంబ్లీకి గవర్నర్‌ తమిళిసై.. గవర్నర్‌, సర్కార్‌ మధ్య స్నేహం బలపడేనా?

Governor Tamilisai

Governor Tamilisai

Off The Record: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌ ప్రసంగిస్తారు.అయితే గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక ఈ మధ్య కాలంలో గవర్నర్‌కు, రాష్ట్ర సర్కార్‌కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య విమర్శల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రసంగంపై కుదిరిన సయోధ్యతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్ ఉండటంతో ఏమి జరగబోతుంది అన్నఆసక్తి సర్వత్రా నెలకొంది. పలు రాష్ట్రాల్లో గవర్నర్, రాష్ట్ర సర్కార్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇక తాజాగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తీరుపై అక్కడి అధికార డీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే… మధ్యలోంచే గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇటు తెలంగాణలో గవర్నర్ స్పీచ్‌కు సంబంధించి రాజ్‌భవన్, రాష్ట్ర సర్కార్‌ ఒక అభిప్రాయానికి వచ్చాయన్న చర్చలు జరుగుతున్నాయి.

Read Also: Off The Record: నెల్లూరు వైసీపీలో లుకలుకల రచ్చ.. డబుల్‌ గేమ్‌ నేతలపై హైకమాండ్‌ సీరియస్‌

ఇక చాలా గ్యాప్‌ తర్వాత గవర్నర్ తమిళిసై అసెంబ్లీకి వస్తుండటంతో అధికార BRSలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్‌ను మాత్రమే గవర్నర్ ఇవ్వాల్సి ఉంటుందనీ, సొంతంగా చెప్పడానికి ఉండదనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే గవర్నర్‌ తమిళిసై, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో… ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్‌ను ఆమె యథాతథంగా ఇస్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని మార్పులు చేసుకుని చెప్పినా ఆశ్చర్యపోనక్కర లేదని కూడా వాదనలున్నాయి. మొత్తంమీద గవర్నర్‌ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగం సందర్భంగా చోటుచేసుకునే పరిణామాల ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో చాన్నాళ్ల తర్వాత అసెంబ్లీకి వస్తున్న గవర్నర్ తమిళిసై, రాష్ట్ర సర్కార్ మధ్య స్నేహం బలపడుతుందా… భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

Exit mobile version