Off The Record: తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు మీద పొలిటికల్ కలర్స్ గట్టిగానే పడుతున్నాయి. భూములు కోల్పోతున్న రైతుల ఆగ్రహావేశాలే కేంద్రంగా పొలిటికల్ పావులు కదుపుతున్నారు. ఇక్కడ అసలైన విషాదం ఏంటంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిన అంశం ఇప్పుడు ఇరకాటంగా మారడమే. త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేశారని, తమ పంట భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆరోపిస్తూ రైతులు హెచ్ఎండీఏ కార్యాలయం నుంచి మొదలుపెడితే… జిల్లాల్లో, నియోజకవర్గాలదాకా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తూ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వాస్తవానికి ట్రిపుల్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రాథమికంగా అలైన్‌మెంట్లు తయారయ్యాయి. వాటి ఆధారంగానే భారత్ మాల పథకం కింద ఉత్తర భాగం పనులను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం.. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భాగం పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు ఆ భాగాన్ని తామే నిర్మిస్తామని ప్రకటించింది. కానీ… కొద్ది రోజుల తర్వాత దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ట్రిపుల్‌ఆర్ దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మిస్తే అందుకు అవసరమైన డీపీఆర్‌లు, ఇతరత్రా కార్యక్రమాలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పూర్తిచేస్తారు.
Read Also: Off The Record: జగ్గారెడ్డి మౌనం వ్యూహాత్మకమేనా..? అసలు వేరే ఉందా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ట్రిపుల్‌ఆర్ నిర్మాణ బాధ్యత ఎన్‌హెచ్‌ఏఐదే. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో పాటు అందుకయ్యే ఖర్చులో సగం భరిస్తే సరిపోతుందని, డీపీఆర్‌లు రూపొందించాల్సిన అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెప్తున్నారు. కాగా, గతంలో రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం ట్రిపుల్‌ఆర్ దక్షిణ భాగం పొడవు 182.23 కిలోమీటర్లు. ఆ తర్వాత అలైన్‌మెంట్‌ను మార్చడంతో ఇది 201 కిలోమీటర్లకు పెరిగినట్టు సమాచారం. ఎన్‌హెచ్-65 మీదుగా చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్- ఆమన్‌గల్ సమీపం నుంచి చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు రింగును కలపాల్సి ఉంది. గతంలో అధికారికంగా విడుదల చేసిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మ్యాపులోనూ ఇదేరీతిన అలైన్‌మెంట్ ఉంది. కానీ కొంతకాలం కిందటి నుంచి అలైన్‌మెంట్‌లో మార్పులపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గతంగా తర్జనభర్జనలు జరిగినట్టు తెలిసింది. ఈ మేరకు కిలోమీటర్ల మేర పొడిగింపుతో పలుచోట్ల అలైన్‌మెంట్స్ మారాయట. చౌటుప్పల్ దగ్గర గతంలోని పాయింట్ నుంచి 5 కిలోమీటర్ల అవతలకు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా తక్కళ్లపల్లి, చినమాడ్గుల, ఆమన్‌గల్, కొందుర్గు, చెంగోముల్, చేవెళ్ల, కొండాపూర్, సంగారెడ్డి వరకు ఉండే అలైన్‌మెంట్ దూరం జరిగిందని అంటున్నారు రైతులు. భట్లపల్లి దగ్గర మొదలై కొద్దిదూరం గత అలైన్‌మెంట్ మాదిరిగానే కొనసాగినా…నల్లగొండ జిల్లాలో తక్కళ్లపల్లి నుంచి కిష్టరాంపల్లి వైపునకు జరిగిందంటున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలో కూడా… భారీ ఎత్తున మార్పులు చేశారన్న ఆరోపణలున్నాయి.
Read Also: Off The Record: లిక్కర్ కేసులో చెవిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయా..?
ఎక్కడికక్కడ ఊళ్ళకు ఊళ్ళే మారిపోయాయని అంటున్నారు. కొన్ని చోట్ల ముందు చెప్పినదానికంటే…. నాలుగైదు కిలోమీటర్ల అవతలికి మారిపోయాయంటున్నారు. 8 జిల్లాలు, 33 మండలాలకు ఈ అలైన్‌మెంట్ విస్తరించగా… డిజిటల్ మ్యాప్‌లు, సర్వే నంబర్లను హెచ్‌ఎండిఏ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈనెల 15వ తేదీలోపు ఏదైన అభ్యంతరాలు, సూచనలు ఉంటే హెచ్‌ఎండిఏ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులు కోరారు. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే… ఈ మార్పులన్నీ కాంగ్రెస్ నాయకుల కోసం చేసినవేనన్నది ప్రతిపక్షం ఆరోపణ. గతంలో ఫైనల్ చేసిన అలైన్మెంట్‌ను మార్చి కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన భూములకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నారని, అదేసమయంలో ఆ భూములకు విలువ పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. సామాన్య ప్రజలకు చెందిన భూములు, రైతుల పంట భూములు కోల్పోవడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం తక్కువ చెల్లిస్తోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. దీంతో…మార్పు వల్ల నష్టపోతున్న బాధితులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా… రైతులకు అనుకూలంగా మాట్లాడారు. అలైన్మెంట్ మారడంతో రైతులు నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరగడంతో.. ఉన్నతాధికారులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి సెక్రటేరియట్‌లో. మరి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేస్తారా? రైతుల పోరాటం ఉధృతం అవుతున్న క్రమంలో ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.