Off The Record: కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో…. వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట. కొందరైతే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని డ్యూటీలకు డుమ్మా కొడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మున్సిపల్ కమిషనర్‌కు చిరాకు తెప్పిస్తోందట.ఇక సచివాలయ ఉద్యోగులు అయితే తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఉంటున్నారట. పర్మిషన్ లేకుండా సెలవులు పెట్టడం, అసలు కనీస సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టడం లాంటి పనులు చేస్తున్నట్టు తెలిసింది.
మరీ… ఓవరైపోతున్నారనుకున్న వారి మీద ఆగ్రహించిన కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి… 23 మంది సచివాలయ కార్యదర్శుల్ని సస్పెండ్ చేశారు. అలాగే కార్పొరేషన్ ఆఫీస్‌లోని పలు విభాగాల్లో విధులు సక్రమంగా నిర్వహించలేదంటూ 15 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇలా… ఇంత భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని మాట్లాడుకుంటున్నారు మున్సిపల్ ఎంప్లాయిస్. ఇది కేవలం తమ మీద కోపం ఒక్కటే కాదని, రాజకీయ ఒత్తిళ్లు కూడా పని చేసి ఉండవచ్చని గుసగుసలాడుకుంటున్నారట.
కడప కార్పొరేషన్ మీటింగ్‌లో ఎమ్మెల్యే మాధవికి వేదికపై కుర్చీ వేకపోవడంతోనే వివాదం మొదలైందని, దీంతో ఆమె కార్పొరేషన్ ను టార్గెట్ చేశారని అనుకుంటున్నారట. ఎమ్మెల్యేకు సహకరిస్తే వేటు వేస్తామంటూ కార్పొరేషన్ పాలకవర్గం పరోక్షంగా అధికారులను హెచ్చరిస్తోందని చెప్పుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తమకు నెల మామూళ్ళు ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఒత్తిళ్లు తెస్తున్నట్లు కడపలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు ఇప్పించాలంటూ అధికారులను వత్తిడి చేస్తున్నారట. మాట విననివారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తున్నారని, ఇంజనీరింగ్ విభాగంలో షోకాజ్ నోటీసుల వెనక ఈ కారణాలు కూడా ఉండి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నాయట ఉద్యోగ వర్గాలు. కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయకపోవడం, కొన్ని కాంట్రాక్టు పనులను రద్దు చేయకపొవడమే అధికారులు చేసిన పాపమని మాట్లాడుకుంటున్నారట. సకాలంలో గుంతలు పూడ్చడం లో విఫలమయ్యారని, తాగునీటి సరఫరా లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కమిషనర్ షోకాజ్‌లు ఇచ్చారు. కానీ… అసలు మేటర్ పని చేయకపోవడం కాదని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఇప్పించకపోవడమేనని మున్సిపల్ సిబ్బంది గుసగుసలాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దెబ్బకు అసలు కాంట్రాక్టర్స్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. ఇలా…. రెండు పార్టీల మధ్య విభేదాలు ఇప్పుడు తమ ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించాయనిఎంప్లాయిస్ మధనపడుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కుర్చీ గోల….కడప మున్సిపాలిటీలో జీడిపాకం సీరియల్‌లా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
