Site icon NTV Telugu

Off The Record: ఆ నాయకుడు చనిపోయాక పార్టీ మారబోతున్నారా..?

Dharmapuri Srinivas

Dharmapuri Srinivas

Off The Record: అనగనగా ఒక రాజకీయ నాయకుడు. ఆయన పేరు ధర్మపురి శ్రీనివాస్‌. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయం చేశారాయన. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేస్‌లో ఉన్నారు. అప్పట్లో అపాయింట్‌మెంట్‌ లేకుండా నేరుగా వెళ్ళి సోనియాగాంధీని కలవగలిగిన స్థాయి ఆయనది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయి బీఆర్‌ఎస్‌లో చేరినా… ఫైనల్‌గా తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరారు డీఎస్‌. ఆయన ఇద్దరు కొడుకుల్లో… సంజయ్‌ కాంగ్రెస్‌లో, అర్వింద్‌ బీజేపీలో ఉన్నారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. చిన్న కొడుకు బీజేపీలో ఉన్నా… బతికున్నప్పుడెప్పుడూ డీఎస్‌ అటువైపు వెళ్ళలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి గాంధీభవన్‌కే చేరుకున్నారాయన. కానీ…. ఇప్పుడు, చనిపోయాక కాషాయ కండువా కప్పే ప్రయత్నం జరుగుతోందట. ఆయన మావాడేనని చెప్పుకునే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత… పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ వెళ్ళిపోయి… గులాబీ కండువా కప్పుకున్నారు. అయినాసరే… ఆ పార్టీలో అంత యాక్టివ్‌గా పనిచేయలేదు. తిరిగి సొంత గూటికే చేరుకున్నారాయన. డీఎస్‌ చనిపోయినప్పుడు కూడా…. మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళి ఆయన భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండా కప్పి నివాళి అర్పించారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

కాంగ్రెస్ వ్యక్తిగా ఆయనకు పార్టీ నుంచి…. ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారన్న అభిప్రాయం ఉంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అంతవరకు బాగానే ఉన్నా…. ఇప్పుడు ఆయనకు కాషఆయ కలర్‌ ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నం హాట్‌ టాపిక్‌ అవుతోంది. త్వరలోనే నిజామాబాద్‌లో ధర్మపురి శ్రీనివాస్‌ విగ్రహావిష్కరణ జరగబోతోంది. విగ్రహం సిద్ధమైంది, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. పూర్తి స్థాయి కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న డీఎస్‌కు ఇప్పుడు కాషాయ కలర్‌ ఎందుకు పూస్తున్నారు? ఒక కొడుకు బీజేపీలో ఉన్నంత మాత్రాన చనిపోయాక ఆయన కండువా మార్చేస్తారా? ఈ విషయంలో అసలు కాంగ్రెస్‌ పార్టీ ఏం చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయట పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అయితే… చనిపోక ముందు డీఎస్‌ మానసికంగా బీజేపీకి దగ్గరయ్యారని రాష్ట్ర స్థాయి నాయకులు ప్రకటించడం గురించి కూడా ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చనిపోక ముందు నడవలేని స్థితిలో ఆయన్ని ఒకసారి గాంధీభవన్‌కు తీసుకురావడంపై కూడా కుటుంబంలో వివాదం రేగింది. అది రచ్చ అవడంతో… కుటుంబ విషయాన్ని రాజకీయం చేయకండని ప్రకటన విడుదల చేశారు శ్రీనివాస్‌ భార్య.

Read Also: Vizag Court: ఆరు హత్యల కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. ఉరిశిక్ష..

ఇక ఇప్పుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం బీజేపీ కనుసన్ననల్లో జరగబోతుండటంతో… కాంగ్రెస్‌ నేతలు ఆయన్ని పూర్తిగా వదిలేశారా అన్న చర్చలు మొదలయ్యాయి. బీజేపీ పొలిటికల్‌ స్టెప్‌పై ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ రియాక్ట్‌ అవలేదు. నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉన్నారు. అయినాసరే… బీజేపీ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతల్ని బీజేపీ ఓన్‌ చేసుకుంటోందని కాస్త అసహనంగా కామంట్స్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు… సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడి సొంత ప్రాంతంలో అలాంటి కార్యక్రమమే జరుగుతున్నా.. కనీస ప్రకటన కూడా లేకపోవడానికి కారణం ఏంటన్న అనుమానాలు పెరుగుతున్నాయట రాజకీయవర్గాల్లో. దీన్ని ఇద్దరు కొడుకుల మధ్య ఆధిపత్య పోరుగా చూస్తున్నారా? కుటుంబ వ్యవహారంలో మనం జోక్యం చేసుకునేది ఏంటనుకుంటున్నారా? అన్న చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏదైనా… తమ ముఖ్య నేతను బీజేపీ ఓన్‌ చేసుకోవడంపై కాస్త అసహనంగానే ఉన్నాయట నిజామాబాద్‌ కాంగ్రెస్‌ శ్రేణులు.

Exit mobile version