Off The Record: క్షేత్ర స్థాయిలో ఏ రాజకీయ పార్టీకైనా ఊపిరి పోసేవి స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎలక్షన్స్‌లో అయితే… పార్టీ సింబల్స్ ఉండకపోవచ్చుగానీ… వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇక్కడే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార పార్టీగా నిన్నటి మొదటి విడత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచినా… కొన్ని తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా రావాల్సిన సీట్లు తగ్గాయంటున్నారు. వర్గపోరు, సొంతోళ్ళే దెబ్బ కొట్టడం లాంటి వ్యవహారాలతోనే తప్పులు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 4,230 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగ్గా… అందులో 2వేల 567 అంటే…. 61 శాతంతో పూర్తి స్థాయిలో పట్టు నిలుపుకుంది కాంగ్రెస్. రేవంత్ సర్కార్ కి ఇది మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. మిగిలిన రెండు విడతల ఎన్నికల్లో కూడా ఇంతకు మించిన ఫలితాలు రాబట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అయితే.. తొలివిడతలో సీట్లు చేజారిన చోట్లలో కూడా ప్రజా వ్యతిరేకతతో కాదని, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల తప్పిదాల వల్లే నష్టపోయామన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం. దీనిపై పార్టీ పెద్దలు కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. డోర్నకల్, మహబూబాబాద్, జడ్చర్ల,పాలమూరు లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఆయా సెగ్మెంట్స్‌లో పార్టీ అభ్యర్ధులను ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్లే నష్టం జరిగిందన్నది పీసీసీ అభిప్రాయంగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఎక్కువ నష్టం జరిగిందనే ఫీలింగ్ ఉంది. సర్పంచ్ లుగా పోటీ చేసిన వారిని పట్టించుకుంటే తమ జేబుకు ఎక్కడ చిల్లు పడుతుందోనన్న కారణంతోనే ఎక్కువ మంది శాసనసభ్యులు అటువైపు దృష్టి పెట్టలేదని సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకైతే… అసలు ఎవరెవరు బరిలో ఉన్నారో కూడా తెలియదట పాపం. పార్టీ నాయకత్వం కూడా ఇలాంటి వ్యవహారాల మీద దృష్టి పెట్టాల్సి ఉన్నా లైట్ తీసుకోవడం వల్లే ఆ కొన్ని సీట్లు చేజారాయన్నది ఇంటర్నల్ టాక్. సర్పంచ్ ఎన్నికలు సింబల్ మీద జరగడం లేదు కాబట్టి….ఎవరు గెలిచినా మన లెక్కలో వేసుకుందామన్న ధోరణి కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండవచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ… పార్టీ కోసం పని చేసిన వాళ్లను పట్టించుకోకుంటే… వచ్చే ఎన్నికల్లో ఫలితాలు కూడా తేడా కొట్టే ప్రమాదం లేకపోలేదని, అది ఎమ్మెల్యేలకే నష్టమన్న సంగతి కొందరు మర్చిపోయినట్టున్నారన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదు సరే…రేపు ఎంపిటిసి.. జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ మీదే జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారు..? ఫలితాలు తేడా వస్తే సీఎం రేవంత్ ఊరుకుంటారా..? స్థానిక ఎన్నికల్లో బలంగా లేకపోతే… క్షేత్ర స్థాయిలో mla బలహీన పడ్డట్టే కదా అని మాట్లాడుకుంటున్నారు గాంధీభవన్‌లో. గ్రామాల్లో ఎవరు గెలిస్తే ఏముందన్న ఫీలింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఇంకా తత్వం బోధపడినట్టే లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.
పార్టీ అధినాయకత్వం కూడా… జిల్లాల వారీగా అభ్యర్ధులు… మంత్రుల పనితీరు.. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్న విషయం మీద దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ….కొత్తగా వచ్చిన జిల్లా అధ్యక్షులు కొత్తగా వచ్చిన వాళ్ళు కావడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ప్రతిపక్షానికి కాస్త ఛాన్స్ దొరికిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు సర్పంచులను పట్టించుకోకపోతే… రేపు వాళ్ళని వీళ్ళెలా పట్టించుకుంటారన్నది బేసిక్ క్వశ్చన్. ఈ లాజిక్ మిస్ అవడం వల్లే ఆ కాస్త నష్టం కూడా జరిగిందంటున్నారు. అదే సమయంలో ఇంకొన్ని కొత్త డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆర్ధికంగా సర్పంచ్ అభ్యర్ధులను అదుకోకోలేదు సరే… రేపు ఎంపిటిసి జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా ఆదుకుంటారా? అలా జరక్కుంటే మాత్రం మొత్తానికే తేడా చేసిన వాళ్లవుతారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారితో పాటు సీరియర్స్ ఉన్న చోట్లలో కూడా ఇలాంటి లోపాలు జరిగాయట. అదే ప్రత్యర్ధి పార్టీకి అవకాశం ఇచ్చినట్టయిందని అంటున్నారు. అలాంటి ఎమ్మెల్యేల విషయంలో అధిష్టానం ఏం చేస్తుందని కూడా మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. 61 శాతం పంచాయతీల్ని గెల్చుకోవడం చిన్న విషయమేంకాదుగానీ… ఉన్న అవకాశాన్ని అందుపుచ్చుకోలేక ఇంకా రావాల్సిన వాటిని ప్రత్యర్థులకు వదిలేశామన్న బాధ మాత్రం పార్టీ కేడర్‌ని వెంటాడుతోందట.