Off The Record: హై వోల్టేజ్ పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన మార్క్ కనిపిస్తోందా అంటే… అనుమానపు చూపులే అందరి సమాధానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకే ప్రస్తుతం డౌట్స్ ఎక్కువగా ఉన్నాయట. పైగా… తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు మావాళ్ళు అపరిపక్వంగా వ్యవహరించి పరువు తీశారని పార్టీ సీనియర్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయాక మిగతా పార్టీ లీడర్స్కంటే ఒకింత ఎక్కువ ఫీలయ్యారు ఇక్కడి నాయకులు. ఇక 2024లో కూడా పవన్ ఇక్కడే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా….ఆయన పిఠాపురం వైపు మొగ్గుచూపారు. తర్వాత రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా… ఫైనల్‌గా టీడీపీ నుంచి వలస వచ్చిన పులపర్తి రామాంజనేయులుకు ఛాన్స్ దక్కింది. ఇక్కడ పార్టీ గెలుపుతో భీమవరం రూపురేఖలు మారతాయని భావించిన పాత నేతలకు తర్వాత జరుగుతున్న పరిణామాలు మింగుడు పడ్డం లేదట. ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్బులు ఎక్కువయ్యాయంటూ… జనసేనలోని ఓ వర్గం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా డీఎస్పీ జయసూర్య వ్యవహారం చాలా తలనొప్పిగా ఉందని, పేకాట క్లబ్బులకు ఆయన అనధికార అనుమతులు ఇవ్వడమే కాకుండా సివిల్ తగాదాల్లోనూ వేలు పెడుతున్నారనేది వాళ్ళ ఫిర్యాదు సారాంశం. దాంతో….తప్పు ఎవరు చేసినా తప్పేనని భావించిన డిప్యూటీ సీఎం… వెంటనే భీమవరం డిఎస్పీపై విచారణకు ఆదేశించారు.
ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారింది. జనసేన కింది స్థాయి నేతలు తప్పు పట్టిన అదే డీఎస్పీని కొంతమంది కూటమి నేతలు వెనకేసుకొచ్చారు. ఎందుకలా జరుగుతోందని ఆరాతీస్తే… కొత్త సంగతులు వెలుగులోకి వచ్చాయట. కేవలం జనసేన యువ నాయకుల ఆధ్వర్యంలో నడిచే పేకాట క్లబ్బులకు, శిబిరాలకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే డీఎస్పీ మీద వేరే వంకపెట్టి డిప్యూటీ సీఎంకు డైరెక్ట్‌గా ఫిర్యాదులు చేశారనే చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. వాళ్ళ పేకాట క్లబ్బులకు, కోడి పందాలకు అవకాశం ఇవ్వని కారణంగానే డిఎస్పీపై ఫిర్యాదు చేశారని, రాంగ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా డిప్యూటీ సీఎం వెంటనే విచారణకు ఆదేశించడం వల్ల భీమవరంలో జనసేన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందన్నది లోకల్ టాక్. మామూలుగానే… భీమవరం పేకాట క్లబ్బుల వ్యవహారం రచ్చ కావడంతో … జూదానికి అవకాశం లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు పోలీసులు. దాంతో ఆదాయం కోల్పోయిన కొంతమంది జనసేన ఛోటా నాయకులు…. అధినేత దృష్టికి వేరే రకంగా తీసుకువెళ్ళి ఆయన్ని పక్కదారి పట్టించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే…. భీమవరం డీఎస్పీ మీద స్వయంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించినా…. ఆ తర్వాత కూడా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ఎవరూ రాలేదట. దీంతో డీఎస్పీ తీరు వల్ల కేవలం గ్యాంబ్లింగ్ నడిపే గ్యాంగ్‌లకు మాత్రమే ఇబ్బంది తప్ప… సామాన్య జనానికి కాదన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది నియోజకవర్గంలో.
పైగా…పారదర్శక విచారణ జరగాలని పవన్ ఆదేశించిన కొద్ది రోజులకే డిఎస్పీతో పాటు అక్కడి పోలీసులకు కేంద్ర స్థాయిలో ప్రశంసలు దక్కాయి. డెడ్ బాడీ పార్సిల్ కేసు దర్యాప్తులో నైపుణ్యం చూపించినందుకు అవార్డ్ వచ్చింది. సదరు డీఎస్పీ మీద ఒకవైపు జనసేన ఛోటా నాయకులు ఫిర్యాదులు చేస్తుంటే మరోవైపు ఉన్నత స్థాయిలో ప్రశంసలు అందడం మరింత చర్చకు దారితీసింది. జూదంపై వచ్చే ఆదాయం కోసం కక్కుర్తిపడుతున్న కొందరు ఛోటా నాయకులు ఈ విధంగా పార్టీ పరువు తీస్తున్నారని భావిస్తోందట భీమవరం జనసేనలోని మరో వర్గం.డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించి నెల రోజులు గడిచినా డీఎస్పీ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ కారణాలు ఏవీ కనిపించలేదని సమాచారం. నిర్దిష్టమైన సాక్ష్యాలు ఏవీ లేకపోవడం చూస్తుంటే… ఇదంతా కేవలం గ్యాంబ్లింగ్ గ్యాంగ్ పనేనని, వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన్ని పక్కదారి పట్టించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి భీమవరం జనసేనలో. కొద్ది రోజుల్లో ఎలాగూ సాధారణ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా డీఎస్పీ వెళ్ళిపోయే అవకాశాలున్నాయని, ఆ మాత్రం దానికి అనవసరంగా ఆవేశపడిపోయి రాష్ట్ర స్థాయిలో పార్టీ పరువు తీశారని లోకల్ సీనియర్స్ మండిపడుతున్నట్టు సమాచారం. మొత్తం మీద క్రమశిక్షణ విషయంలో పవన్ ఆశించింది ఒకటైతే… భీమవరం పరిణామాలు మరోలా ఉన్నాయన్నది జనసైనికుల ఇంటర్నల్ టాక్.